మహిళలకు సరిపడా లేని ప్రయాణ సాధనాలు | Funds crunch halts city's woman-only bus service | Sakshi
Sakshi News home page

మహిళలకు సరిపడా లేని ప్రయాణ సాధనాలు

Published Sat, Dec 13 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

Funds crunch halts city's woman-only bus service

సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో లేడీస్ క్యాబ్‌లు, లేడీస్ స్పెషల్ బస్సులు ఉన్నాయన్న సంగతి తెలిసిన వారెంతమంది? వాటిని ఉపయోగించుకుంటున్న వారెంతమంది? ఆ మాటకొస్తే నగరంలో నిత్యం  క్యాబ్‌లు బస్సుల్లోప్రయాణించే మహిళల సంఖ్యతో పోలిస్తే ఈ  లేడీస్ స్పెషల్ ప్రయాణ సాధనాల సంఖ్య ఏ పాటిది అనే ప్రశ్నలు త లెత్తుతున్నాయి. మహిళల కోసం మెట్రోలో లేడీస్ స్పెషల్ కోచ్‌లు మినహా, నగరంలో ప్రవేశపెట్టిన ఇతర ప్రయాణ సాధనాలేవీ పెద్దగా ఉపయోగపడడంలేదు. డిసెంబర్ 5 నాటి రాత్రి మహిళా ఎగ్జిక్యూటివ్ లేడీస్ క్యాబ్ తీసుకుని ఉంటే  కామాంధుని బారిన పడకపోయి ఉండేదన్న అభిప్రాయం అక్కడక్కడా వినిపిస్తోంది.  
 
 ప్రత్యేక బస్సులకు మహిళల ఆదరణ కరువు
 నగరంలో ఢిల్లీ రవాణా శాఖ (డీటీసీ) మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అయినా వాటి సంఖ్య  26 మాత్రమే. ఈ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అరకొరగానే ఉంటుంది. లేడీస్ స్పెషల్ బస్సులకు మహిళల ఆదరణ లేదని రవాణా విభాగం అంటోంది. కానీ  ప్రస్తుతం ఈ బస్సులు  కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే నడుస్తున్నాయి. తమ రూట్లో మహిళా స్పెషల్ బస్సు నడుస్తుందా లేదా అన్నది చాలా మందికి తెలియదు. తెలిసినవారు కూడా రోజుకు ఒకటో రెండో చొప్పున నడిచే బస్సులు ఏ వేళకొస్తాయో తెలియక వాటిపై ఆధారపడడానికి ఇష్టపడడం లేదు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే బస్సుల సంఖ్యను పెంచుతామని అధికారులు చెబుతున్నారు. కానీ ఆ దిశగా ఆదరణ పెరగడం లేదు. ఈ కారణంగా లేడిస్ స్పెషల్ బస్సుల పెంపు ప్రతిపాదన ముందుకు సాగడం లేదు.
 
 పింక్ ఆటోలు మాయం
 మహిళా ప్రయాణికుల కోసం ట్రాఫిక్ పోలీసులు 2010 డిసెం బర్‌లో మహిళా డ్రైవర్లతో పింక్ ఆటోలను ప్రవేశపెట్టారు. 20తో మొదలైన ఈ ఆటోల సంఖ్య తదుపరి ఏడాదికి 70కి పె గింది కానీ  ఆ తరువాత సాధారణ ఆటోల నుంచి తల్తెత్తిన సమస్యల కారణంగా ఈ ఆటోలు మూలకుపడ్డాయి. డిసెంబర్ 16 ఘటన తరువాత ఈ పింక్ ఆటోలను మళ్లీ రోడ్లపైకి తెచ్చినప్పటికీ నాలుగైదు నెలల తరువాత రోడ్లపై నుంచి మాయమయ్యాయి.
 
 పరిమితంగా మహిళా క్యాబ్స్
 ఇక  లేడీస క్యాబ్‌ల విషయానికి  వస్తే సఖా  క్యాబ్, జీ క్యాబ్‌ల వంటివి కొన్ని క్యాబ్ సేవలు మహిళా  డ్రైవర్లతో సేవలందిస్తున్నాయి. కానీ  వాటి గురించి విృతంగా ప్రచారం జరగకపోవడం, అవసరమైన సమయంలో అవి అందుబాటులో లేకపోవడం వల్ల  మహిళా ప్రయాణికులు సాధారణ క్యాబ్‌లపైనే ఆధారపడకతప్పడం లేదు. ‘క్యాబ్‌ల సంఖ్య పరిమితంగా ఉండడం వల్ల 24 గంటల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే సేవలందించగలుగుతున్నామ’ని సఖా క్యాబ్ ప్రతినిధి సరిత అంటున్నారు. జీ క్యాబ్  కూడా మహిళా డ్రైవర్లతో సేవలందిస్తోంది. ఈ మహిళా క్యాబ్ సేవలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయి. తమ వద్ద 10 మంది మాత్రమే మహిళా డ్రైవర్లు ఉన్నారని, వారి సేవలు  ముందే ఫిక్స్ అయి ఉంటాయని జీ క్యాబ్‌కు చెందిన నవీన్‌కుమార్ అంటున్నారు.
 
 ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్
 న్యూఢిల్లీ: నగరంలో నిబంధనలు అతిక్రమిస్తున్న వివిధ క్యాబ్స్‌లపై  ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇటీవల ఉబర్ రేప్ కేసు ఘటన నేపధ్యంలో శనివారం ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 500 క్యాబ్‌ల స్వాధీనం చేసుకొన్నారు. డ్రైవర్ల లెసైన్లులను పరిశీలించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని 4,000 మంది డ్రైవర్లకు చలానులు విధించినట్లు సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి శనివారం మీడియాకు వెల్లడించారు. ఉబర్ కేసు నిందితుడు ఆర్టీఐ అధికారులకు నకిలీ ధ్రువీకరణ పత్రాలు చూపించి విధుల్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, డ్రైవర్ల, వాహనాల అనుమతి పత్రాలను పరిశీలించారు. ఉబర్ క్యాబ్‌లపై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతవారం రోజులుగా ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైవ్‌లను రోజూ నిర్వహిస్తున్నారు. ట్యాక్సీలు, క్యాబ్స్‌ల వివరాలను సేకరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 527 వాహనాలను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకొన్నారు. 1,073 ట్యాక్సీ స్టాండ్‌లను పరిశీలించి, 3,851 మంది డ్రైవర్లకు చలానాలు విధించారమని జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) అనిల్ శుక్లా తెలిపారు. 1,423 మహిళా క్యాబ్‌ల పత్రాలు, డ్రైవర్ల లెసైన్స్‌లను పరిశీలించినట్లు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 239 మందికి చలాన్లు విధించి 193 వాహనాలను స్వాధీనం చేసుకొన్నామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement