రంగురంగుల అడ్వర్టయిజ్‌మెంట్లతో డీటీసీ బస్సులు నగర రోడ్లపై పరుగులు తీసే రోజులు త్వరలో రానున్నాయి.
సాక్షి, న్యూఢిల్లీ: రంగురంగుల అడ్వర్టయిజ్‌మెంట్లతో డీటీసీ బస్సులు నగర రోడ్లపై పరుగులు తీసే రోజులు త్వరలో రానున్నాయి. దివాళా తీసిన ఆర్థిక స్థితిని చక్కదిద్దుకోవడం కోసం డీటీసీ అడ్వర్టయిజ్‌మెంట్లను ఆశ్రయించనుంది. ఇందుకోసం డీటీసీ టెండర్లనుకూడా ఆహ్వానించింది. ఇప్పటి వరకు డీటీసీ బస్సుల లోపలి భాగంలో మాత్రమే వాణిజ్య ప్రకటనలు దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడని బస్సుల బయటి భాగంలో కూడా ప్రకటనలు కనిపించనున్నాయి. మొదటి దశలో 500 బస్సులపై అడ్వర్టయిజ్‌మెంట్లు ప్రదర్శించడానికి టెండర్ జారీచేసింది. వాటిలో ఏసీ, నాన్ ఏసీ బస్సులున్నాయి.
బస్సుల లోపల వాణిజ్య ప్రకటనలు ఉంచడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపడం లేదు, అటువంటప్పుడు బస్సుల బయట అడ్వర్టయిజ్‌మెంట్లకు ఎలాంటి ప్రతిస్పందన లభిస్తుందనేది వేచి చూడాల్సిందే. అధికారులు మాత్రం ఈ ప్రయత్నం ద్వారా తమ ఖజానాకు కాసులు రాలుతాయని ఆశిస్తున్నారు. చార్జీలు పెంచడానికి తాము పలుమార్లు ప్రతిపాదనలు పంపినా వాటికి ఆమోదం లభించలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది నష్టాలు పేరుకొనిపోతున్నాయి. రోజుకు 50 లక్షల రూపాయల నష్టం వస్తోందని అంచనా. ఈ నేపథ్యంలో లోటును పూడ్చుకోవడం కోసం వాణిజ్య ప్రకటనల మార్గం సరైనదని అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
రోహిణి, జిటికె డిపో, ఈస్ట్ వినోద్‌నగర్, ఎస్‌ఎన్ డిపో, హరినగర్ డిపోలకు చెందిన 100 బస్సులపై అడ్వర్టయిజ్‌మెంట్లు ప్రదర్శించాలని ప్రస్తుతం నిర్ణయించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇతర బస్సుల బయటి భాగంపై అడ్వర్టయిజ్‌మెంట్లను ప్రదర్శించడానికి అనుమతి ఇస్తారు. జీపీఎస్ సదుపాయం కలిగిన క్లస్టర్ బస్సుల బయటి భాగంపై వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించడానికి ఇదివరకే అనుమతి ఇచ్చారు.