80 డీటీసీ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు
న్యూఢిల్లీ: మహిళా ప్రయాణికుల భద్రతకోసం ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) తన ఆధ్వర్యంలోని 80 బస్సులలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసింది. తొలి విడతలో భాగంగా మొత్తం 200 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డీటీసీ నిర్ణయించిన సంగతి విదితమే. వీటిని లోఫ్లోర్ ఏసీ, నాన్‌ఏసీ బస్సుల్లో ఏర్పాటు చేయనుంది. ఈ విషయమై డీటీసీ అధికార ప్రతినిధి ఆర్.ఎస్.మిన్హాస్ మాట్లాడుతూ రాజ్‌ఘాట్ డిపోలోని 80 బస్సులకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాం. శుక్రవారంనాటికల్లా మొత్తం వంద బస్సులకు ఏర్పాటు చేస్తాం. ఇలా ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం డీటీసీ చరిత్రలోనే తొలిసారి. బాగా పొద్దుపోయాక ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తొలివిడత కింద రాజ్‌ఘాట్, సరోజినీనగర్ బస్సు డిపోల్లో వీటిని ఏర్పాటు చే స్తాం. ఈ రెండు డిపోల్లో మొత్తం 200 బస్సులు ఉన్నాయి. రాజ్‌ఘాట్ డిపోలో కంట్రోల్‌రూం ఏర్పాటుచేశాం. డైలీ పద్ధతిలో నిపుణులు ఈ దృశ్యాలను పరిశీలిస్తారు. ఈ కెమెరాలకు ఏడు గంటలపాటు దృశ్యాలను నమోదు చేసే సామర్థ్యం ఉంది. కంట్రోల్‌రూంలోని కంప్యూటర్లలో 15 గంటల నిడివిగల దృశ్యాలను భద్రపరుస్తాం.’అని అన్నారు.