గవర్నర్ పై వేటు ? | Centre may remove Najeeb Jung as Delhi Lieutenant-Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్ పై వేటు ?

Published Fri, Aug 29 2014 12:06 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

గవర్నర్ పై వేటు ? - Sakshi

గవర్నర్ పై వేటు ?

 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాల గవర్నర్‌లను మార్చుకుంటూ వస్తున్న మోడీ ప్రభుత్వం దృష్టి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌పై పడిందా? కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనికి అవుననే సమాధానమిస్తున్నాయి. ఢిల్లీ బీజేపీ నేతలు చేసిన విజ్ఞప్తులను జంగ్ తోసిపుచ్చడంతో జంగ్‌పై ఆగ్రహంతో ఉన్న ఢిల్లీ ఎమ్మెల్యేలు.. జంగ్‌కు ఉద్వాసన పలకాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. దీంతో జంగ్‌పై వేటు తప్పదంటున్నారు. అయితే జంగ్‌ను ఎల్జీ పదవి నుంచి  నజీబ్ జంగ్‌ను తప్పిస్తే ఆయన స్థానంలో ఎవరిని నియమించే అవకాశాలున్నాయనే విషయమై కూడా విశ్వసనీయవర్గాల ద్వారా కొంత సమాచారం అందింది. ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ అజయ్‌రాయ్ శర్మ, విజయ్‌కుమార్ మల్హోత్రా, మాజీ ప్రధాన కార్యదర్శి శక్తి సిన్హాల పేర్లను ఈ పదవి కోసం కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.  
 
 బాధ్యతలు స్వీకరించిన స్పోలియా..
 ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పునర్నియమితులైన దీపక్ మోహన్ స్పోలియా గురువారం ఉదయం పదవీబాధ్యతలు చేపట్టారు. ఇంతకాలంగా ముఖ్యకార్యదర్శిగా కొనసాగిన ఎస్.కె. శ్రీవాస్తవ స్థానంలో స్పోలియాను నియమించారు. స్పోలియా 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన 2015లో పద వీవిరమణ చేస్తారు. స్పోలియా షీలాదీక్షిత్ హయాంలో కూడా ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. అప్పట్లో అనధికార కాలనీల క్రమబద్ధీకరణలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. బీజేపీ ప్రస్తుతం అనధికార కాలనీల క్రమబద్ధీకరణపై దృష్టిసారించిన నేపథ్యంలో ఈ రంగంలో  ఆయనకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్పోలియాను ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెబుతున్నారు.కాంగ్రెస్ పార్టీ  అధికారంలో ఉన్నప్పటినుంచి ఎన్నికలై.. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు స్పోలియా ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రీవాల్, స్పోలియాను బదిలీ చేసి ఫైనాన్స్ కమిషనర్‌గా నియమించారు. స్పోలియా స్థానంలో శ్రీవాస్తవను ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
 
 కాగా శ్రీవాస్తవ పనితీరుపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. శ్రీవాస్తవ కఠిన వైఖరి వల్ల ఢిల్లీలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదులతోపాటు బీజేపీ నేతల ఒత్తిడి వల్లనే శ్రీవాస్తను తొలగించి స్పోలియాను తిరిగి నియమించారని అంటున్నారు. బీజేపీ నేతలు పలుమార్లు అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ ఆయన వారికి 45 రోజుల తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చారని, అప్పుడు కూడా ఆలస్యంగా వచ్చి వారిని ఇబ్బంది పెట్టారని, దీంతో శ్రీవాస్తవ వ్యవహారశైలిపై కూడా బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.  శ్రీవాస్తవ వ్యవహార శైలి గురించి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు.. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. మొండిగా వ్యవహరిస్తూ, అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిన అధికారులను బదిలీ చేయాలని వారు డిమాండ్ చే సినందునే శ్రీవాస్తవను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారని చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement