‘కేసీఆర్, చంద్రబాబు చేస్తున్నది ఒక్కటే’
గుంటూరు: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వునైతికంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కు వర్తిస్తుందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. న్యాయస్థానం ఆదేశానుసారం మూడు నెలల్లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరులో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని చెప్పారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను నైతికంగా అమలు చేయాలని అన్నారు. ఏపీలో పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు చేస్తున్నది ఒక్కటేనని అంబటి పేర్కొన్నారు. ఇద్దరూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో తాము కూడా హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
కాగా, కాపులకు వ్యతిరేకంగా బీసీలను ఏపీ సీఎం చంద్రబాబు రెచ్చగొడుతున్నారని అంబటి ఆరోపించారు. మంజునాథ కమిషన్ ఎక్కడికి వెళితే అక్కడ టీడీపీ నేతలు గొడవలు చేస్తున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు స్పందిచడం లేదని ప్రశ్నించారు. పనిగట్టుకుని బీసీల్లోని టీడీపీ నాయకులకు ఎగదోస్తున్నారని ఆరోపించారు. కాపులకు, బీసీలకు మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు నష్టం లేకుండా కాపులను బీసీల్లో చేర్చాలి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.