చెన్నైకి కొత్త కమిషనర్
చెన్నైకి కొత్త కమిషనర్
Published Wed, Apr 9 2014 12:17 AM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM
సాక్షి, చెన్నై: చెన్నై మహానగర పోలీసు కమిషనర్ జార్జ్‌ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో త్రిపాఠి నియమితులయ్యారు. మం గళవారం ఉదయం కమిషనరేట్‌లో త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల విధుల్లోకి దిగారు. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో పూర్తి అధికార బాధ్యతలను ఎన్నికల యంత్రాంగం తన గుప్పెట్లోకి తీసుకుంది. రాష్ర్టంలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా బదిలీల పర్వాన్ని వేగవంతం చేసింది. అధికార పక్షానికి విధేయులుగా ఉన్న అధికారులను తప్పించి, నిక్కచ్చితనానికి మారు పేరుగా ఉండే అధికారులను కీలక పదవుల్లో నియమించే పనిలో ఉంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర డీజీపీ రామానుజంను పక్కన పెట్టిన ఎన్నికల యంత్రాంగం అనూప్ జైశ్వాల్‌ను ఆ పదవిలోనియమించింది. తాజాగా చెన్నై మహానగర పోలీసు కమిషనర్‌పై దృష్టి పెట్టింది.
ఈయన సైతం అధికార పక్షానికి అనుకూలం అన్న సంకేతాలతో హుటాహుటిన మార్చేసింది. చెన్నై మహానగర పోలీసు కమిషనర్‌గా ఉన్న జార్జ్‌ను మార్చేసి, ఆయన స్థానంలో జైళ్ల శాఖ అదనపు డీజీపీ త్రిపాఠిని రంగంలోకి దించింది. ఇది వరకు చెన్నై మహానగర పోలీసు కమిషనర్‌గా త్రిపాఠి పనిచేశా రు.అమెరికా దౌత్య కార్యాలయంపై జరిగిన దాడి ఆయన మెడ కు చుట్టుకోవడంతో ఆ పదవి ఊడింది. దీంతో జైళ్ల శాఖకు పరి మితం కావాల్సి వచ్చింది. తాజాగా ఎన్నికల కమిషన్ చర్యల తో మళ్లీ మహానగర కమిషనర్ బాధ్యతల్ని త్రిపాఠి చేపట్టారు. బాధ్యతల స్వీకరణ: ఉదయం కమిషనరేట్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో త్రిపాఠి బాధ్యతల్ని స్వీకరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా, మీడియాను సైతం లోనికి అనుమతించ లేదు.
కొత్త కమిషనర్‌ను జార్జ్ ఆహ్వానించడంతో త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. వెలుపలకు వచ్చిన జార్జ్‌కు త్రిపాఠితో పాటుగా అదనపు కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, డెప్యూటీ కమిషనర్లు వీడ్కోలు పలికారు. బదిలీ వేటు పడిన జార్జ్, త్రిపాఠి వద్ద ఉన్న జైళ్ల శాఖకు అదనపు డీజీపీగా నియమితులయ్యూరు. ఎన్నికల విధుల్లోకి : బాధ్యతలు చేపట్టినానంతరం నగరంలోని అదనపు కమిషనర్లు, అసిస్టెంట్, డెప్యూటీ, జాయింట్ కమిషనర్లతో త్రిపాఠి సమావేశం అయ్యారు. ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రత, ప్రస్తుతం ఉన్న భద్రతను ఆరా తీశారు. సమస్యాత్మక కేంద్రాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను చర్చించి, అధికారులకు ఆదేశాలు, సూచ నలు ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు కరుణా సాగర్, సుభాష్‌కుమార్, నల్లశివం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement