నిఘా నీడలో నగరం
Published Sat, Jan 25 2014 11:29 PM | Last Updated on Sat, Mar 23 2019 8:37 PM
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరం చెన్నై తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. కొన్ని నెలలుగా చెన్నైతోపాటుగా మదురైను సైతం తీవ్రవాదులు టార్గెట్ చేసినట్టుగా కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆదివా రం నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాకిస్తానీ ముష్కరులు విధ్వంసాలకు కుట్ర చేయొచ్చని కేం ద్రం చేసిన హెచ్చరికతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తం అయింది. అన్ని జిల్లాల్లో నిఘాను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ చే సింది. శుక్రవారం రాత్రి నుంచి వాహనాల తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఆదివారం గణతంత్ర వేడుకలు జరిగే ప్రదేశాల్లో భద్రతను పెంచారు.
నగరాల్లో: చెన్నై, మదురై నగరాల్లో భద్రతను ఏడంచెలకు పెంచారు. తిరునల్వేలి, కన్యాకుమారి, కోయంబత్తూరు, తిరుచ్చి, సేలంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్, సేలం విమానాశ్రయాల్లో భద్రతను పటిష్టం చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండులు, ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను పెంచారు. ఆయా నగరాల సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీల్లో నిమగ్నమయ్యారు.
వదంతి కలకలం: భద్రత కట్టుదిట్టంగా ఉన్న సమయంలో శనివారం ఉదయం చెన్నై కమిషనరేట్ కంట్రోల్ రూంకు వచ్చిన సమాచారం పోలీసు యంత్రాంగాన్ని ఉరకలు తీయించింది. రాష్ట్ర రాజధాని నగరంలోని అన్నా వంతెన, కోయంబేడు బస్టాండ్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్, రిజర్వు బ్యాంక్, ఎల్‌ఐసీ, హైకోర్టు భవనాలు తీవ్ర వాదుల హిట్‌లిస్టులో ఉన్నట్టు గతంలో తేలింది.
దీంతో ఇక్కడ భద్రత యథాప్రకారం కట్టుదిట్టంగానే ఉంటుంది. ఈ ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్టు, గణతంత్ర వేడుకల్ని విచ్చిన్నం చేయాబోతున్నామంటూ వచ్చిన హెచ్చరికతో పోలీసులు పరుగులు పెట్టారు. ఉదయాన్నే కంట్రోల్ రూంకు ఈ బెదిరింపు కాల్ రావడంతో బాంబ్, డాగ్ స్క్వ్డాడ్‌లు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఎలాంటి బాంబులు లభించకున్నా, ముందు జాగ్రత్త చర్యగా మరింత భద్రతను ఆ ప్రదేశాల్లో పెంచారు. నగరంలో భద్రతను ఏడంచెలకు పెంచారు. గణతంత్ర వేడుకలు జరిగే మెరీనా తీరంలో భద్రతా ఆంక్షలు విధించారు. వేడుకల్ని తిలకించే వాళ్లు ఉదయాన్నే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. తనిఖీల అనంతరం లోనికి అనుమతించనున్నారు. ఆ తీరం వెంబడి విమానాలు ఎగిరేందుకు నిషేధం విధించారు. సముద్ర తీరంలో గస్తీని ముమ్మరం చేశారు.
మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆ మార్గాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తొలుత సీఎం జయలలిత అక్కడికి చేరుకుంటారు. అనంతరం గవర్నర్ రోశయ్య హాజరై వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని చాటే రీతిలో శకటాలు సిద్ధం అయ్యాయి. తివర్ణ దళాల కవాతులు, విద్యార్ధుల సాంస్కృతిక ప్రదర్శనలు, శకటాల ప్రదర్శనలు కనువిందుచేయబోతున్నాయి.
Advertisement
Advertisement