దేశవిదేశాల్లో అంగరంగ వైభవంగా
లండన్/న్యూఢిల్లీ: భారత 67వ గణతంత్ర వేడుకలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా, విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. రాష్ట్రాల రాజధానుల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు జాతీయ పతాకాలు ఎగురవేశారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్లో గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా జమ్మూలోని ఎంఏ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని నియంత్రణ రేఖ వద్ద 3 చోట్ల భారత్, పాక్ సైనికులు మిఠాయిలను పంచుకున్నారు. ముంబై శివాజీ పార్క్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. మరోవైపు విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఘనంగా గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు.
పలు దేశాల్లో ఎంబసీల వద్ద జాతీయ పతాకాలను ఎగురవేశారు.లండన్‌లో ఇండియన్ హై కమిషనర్ నవతేజ్ సర్నా జెండా వందనం చేశారు. రిపబ్లిక్ డేసందర్భంగా నేపాల్‌కు భారత్ 40 అంబులెన్స్‌లను, 8 బస్సులను బహూకరించింది. ఆస్ట్రేలియాలో ఆ దేశ జాతీయ దినోత్సవం ఆస్ట్రేలియా డే’ కూడా జనవరి 26వ తేదీనే కావడం విశేషం. కాన్‌బెర్రా, సిడ్నీ, మెల్‌బోర్న్ సహా ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో జరిగిన గణతంత్ర వేడుకలో భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. థాయ్‌లాండ్, వియత్నాం సహా పలు దేశాల్లో జరిగిన భారత గణతంత్ర వేడుకలకు వణికిస్తున్న చలిని కూడా లెక్కచేయకుండా స్థానిక భారతీయులతో పాటు ఆయా దేశస్తులు ఉత్సాహంగా హాజరయ్యారు. శ్రీలంక, కంబోడియా, ఇండోనేసియా.. తదితర దేశాల్లో వేడుకలు జరిగాయి.