సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరం ప్రశాంతతకు నిలయం. ఉద్యోగ రీత్యా స్థిరపడ్డ వాళ్లు, వివిధ పనుల నిమిత్తం చెన్నైకు వచ్చి వెళ్లే వారు ఇక్కడ లక్షల్లో ఉన్నారు. ఈ నగరం తీవ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉన్నా విధ్వంసకర సంఘటనలు మాత్రం ఇంతవరకు చోటు చేసుకోలేదు. ఒకప్పుడు అన్నా వంతెనను పేల్చేందుకు బాంబు దాడి జరిగింది. అది పెను ప్రమాదాన్ని సృష్టించలేదు. ఆ తర్వాత ఎప్పుడూ రాజధాని నగరంలో ఎలాంటి విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకోలేదు. కోయంబత్తూరు, మదురై, తిరుచ్చిలో పేలుడు ఘటనలు జరిగినా, కుట్రలు చేసినా ఆ ప్రభావం రాజధాని నగరం మీద పడలేదు. 2009 ఏప్రిల్ 29న చెన్నై సబర్బన్ స్టేషన్ నుంచి విద్యుత్ రైలు హైజాక్‌కు గురికావడం, వ్యాసార్పాడి వద్ద ఆ రైలు ప్రమాదం బారిన పడడంతో నగర వాసులతోపాటు రైలు ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇది జరిగి ఐదేళ్లు అవుతున్నా, ఇంత వరకు విచారణ పూర్తికాలేదు. సరిగ్గా ఐదేళ్లకు చెన్నై సెంట్రల్ వేదికగా మరో ఘటన చోటు చేసుకోవడం ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది.
నగరంలో అసాంఘిక శక్తులు
నగరంలో పోలీసులు అను నిత్యం నిఘాతో వ్యవహరిస్తున్నా అసాంఘిక శక్తులు చాపకింద నీరులా తమ పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇటీవల విద్యార్థి ముసుగులో నిషేధిత సిమి తీవ్రవాద సంస్థ మద్దతుదారుల కార్యకలాపం వెలుగు చూసింది. రాజధానిలో నక్కి ఉన్న వీరిని కేంద్ర నిఘా వర్గాలు వచ్చి పట్టుకెళ్లే వరకు నగర పోలీసులు నిద్రావస్థలో ఉండడం గమనార్హం. అలాగే ఉగ్రవాది బిలాల్ కూడా చెన్నైలో కొన్నాళ్లు తిష్ట వేసినట్టుగా కేంద్రం పేర్కొనడం, గత ఏడాది అజ్ఞాత తీవ్రవాదులు తొలుత చెన్నైలో చిక్కడం, ఇక్కడ సాగుతున్న దొంగ నోట్ల వ్యవహారం, స్మగ్లింగ్ తదితర వ్యవహారాలు వెరసి రాజధాని నగరం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. మంగళవారం రాత్రి చెన్నైలో ఐఎస్‌ఐ తీవ్రవాది జాకీర్ హుస్సేన్, మరుసటి రోజు అతడి మద్దతుదారులు పట్టుబడటం, ఆ మరుసటి రోజు సెంట్రల్‌లో పేలుడు చోటు చేసుకోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
నిఘా కట్టుదిట్టం
కేంద్రం నుంచి రాష్ట్రానికి తరచూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. అలాగే బూచీల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే తీవ్రంగా స్పందిస్తామన్నట్టుగా పోలీసు యంత్రాంగం పరిస్థితి ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రమాదం అనంతరం మేల్కొన్న రైల్వే, నగర పోలీసు యంత్రాంగం హడావుడి సృష్టించాయి. చెన్నైలోని సబర్బన్ స్టేషన్లలో నిఘా కట్టుదిట్టం చేశారు. ఎగ్మూర్ స్టేషనల్లో ఆరంచెల భద్రత పెంచారు. సెంట్రల్, ఎగ్మూర్ స్టేషన్లలో అడుగడుగునా బాంబ్, డాగ్ స్క్వాడ్‌లు తనిఖీలు చేశాయి. ప్రతి రైలును అనువనువు పరిశీలించారు. గతంలో కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు అన్నా వంతెన(జెమిని), ఎల్‌ఐసీ, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్ని నిఘా వలయంలోకి తెచ్చారు. తాజా ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టేషన్లు విల్లుపురం, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, తిరునల్వేలి, సేలంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంతో పాటు అన్ని విమానాశ్రయూల్లో నిఘాను పటిష్టం చేశారు. తనిఖీల పేరుతో ఎక్కడి రైళ్లను అక్కడే ఆపడంతో సుమారు గంటన్నర ఆలస్యంగా నడిచారుు. దీంతో ప్రయూణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
పరుగులు
సెంట్రల్‌లో ఉదయాన్నే బాంబులు పేలినట్టు టీవీల్లో వచ్చిన వార్తలతో జనం ఉలిక్కి పడ్డారు. సంఘటనా స్థలాన్ని చూడడానికి పెద్ద ఎత్తున పరుగులు తీశారు. వారిని కట్టడి చేసేందుకు భద్రతా సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. తమ వాళ్లెవరైనా ఉన్నారా..? అన్న ఆందోళనలో పడ్డ అనేక మంది ఉత్కంఠతో హెల్ప్‌లైన్ల ద్వారా సమాచారం సేకరించే పనిలో పడ్డారు.
ఉలిక్కిపడ్డ చెన్నై
Published Fri, May 2 2014 12:00 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM
Advertisement
Advertisement