రైల్లో రూ.5.75 కోట్ల చోరీ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు.
రైల్లో రూ.5.75 కోట్ల చోరీ కేసు
పాత కరెన్సీపై నిఘా
చెన్నై : రైల్లో రూ.5.75 కోట్ల చోరీ కేసులో ఇంకా మిస్టరీ వీడలేదు. నగదుకు భద్రతగా వెళ్లిన తొమ్మిది మంది పోలీసులను మళ్లీ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. అనుమానితులు పాత, చిరిగిన కరెన్సీ మారిస్తే వెంటనే తమకు సమాచారం తెలియజేయాలని సీబీసీఐడీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. సేలం నుంచి చెన్నైకు వచ్చిన రైలులో రూ.5.75 కోట్లు చోరీకి గురైన విషయం తెలిసిందే.
ఈ చోరీ సంఘటన గురించి చెన్నై, సేలం, విరుదాచలం ప్రాంతాల్లో సీబీసిఐడీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఐజీ మహేష్‌కుమార్ అగర్వాల్ గురువారం సేలంకు వెళ్లి విచారణ జరిపారు. నగదుకు భద్రతగా వెళ్లిన నామక్కల్, కృష్ణగిరి జిల్లా సాయుధ పోలీసులను ఆయన విచారించారు.
ఇలావుండగా డిప్యూటీ కమిషనర్ నాగరాజన్ సహా తొమ్మిది మంది పోలీసులను మళ్లీ విచారణ జరపాలని, అందుచేత వారు చెన్నైకు రావాల్సిందిగా సీబీసిఐడి పోలీసులు గురువారం ఆదేశించారు. దీంతో తొమ్మిది మంది చెన్నైకు చేరుకున్నారు. వీరిని శుక్రవారం మళ్లీ విచారించనున్నారు.
పాత కరెన్సీ మారిస్తే: అనుమానితులు పాత కరెన్సీ మారిస్తే వెంటనే తెలియజేయాల్సిందిగా సీబీసీఐడీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ్యాంకులు, పెట్రోలు బంకులు, షాపింగ్ కాంప్లెక్సులు, హోటళ్లలో చిరిగిపోయిన, పాత రూపాయి నోట్లను ఎవరైనా మార్చేందుకు ప్రయత్నిస్తే దీని గురించి చెన్నైలోగల సీబీసీఐడీ కంట్రోల్ రూంకు ఫోన్ నెంబర్లు: 044-28513500, 044-28512510 కు తెలియజేయాలని కోరారు.
వేలూరు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి తప్పించుకోడానికి ప్రయత్నించిన నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే దీన్ని పోలీసులు ఖండించారు. ప్రత్యేక దళం పోలీసులు రాజస్తాన్, బీహార్‌లలో బసచేసి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. అయితే దీనిని పోలీసులు ధ్రువీకరించబడలేదు. గురువారం రాత్రి సీబీసీఐడీ పోలీసులు చిన్న సేలం సమీపానగల ముకాసా పరూర్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన వద్ద విచారణ జరిపారు. ఈ ప్రాంతంలో అన్ని రైళ్లు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు రైల్వే శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న దొంగలు వంతెన వద్ద రైలు వస్తుండగా రైల్లో ఎక్కి చోరీకి పాల్పడి ఉండొచ్చునా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
వ్యాన్ డ్రైవర్లు: నామక్కల్ జిల్లా రాశిపురం నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సొంతమైన నగదును నామక్కల్ జిల్లాకు చెందిన ఒకరు అద్దెకు మాట్లాడి వ్యానులో తీసుకువెళ్లి సేలం జంక్షన్ రైల్వే స్టేషన్‌కు పంపారు. గురువారం వ్యాన్ డ్రైవర్ ను పోలీసులు విచారించారు.