
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం మాంస ప్రియులను భయపెడుతోంది. యలహంక పరిధిలోని దాసరహళ్లిలో బర్డ్ ఫ్లూను అధికారులు గుర్తించిన నేపథ్యంలో నగరంలో చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. మూడు రోజుల ముందుతో పోలిస్తే శుక్రవారం నాటికి నగర వ్యాప్తంగా చికెన్, గుడ్ల అమ్మకాలు దాదాపు 25 శాతం పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. కాగా, బర్డ్ ఫ్లూ కనిపించిన దాసరహళ్లి ప్రాంతంలో మరో 15 రోజుల పాటు మాంసం దుకాణాలను మూసివేయనున్నారు. నగరంలోని దాసరహళ్లి ప్రాంతంలో మంగళవారం రోజున అధికారులు బర్డ్ ఫ్లూను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూను గుర్తించిన ఫారమ్‌లో ఉన్న 900కు పైగా కోళ్లను అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చంపేశారు. ఇక ఇదే సందర్భంలో ఈ వ్యాధి మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
25 శాతం తగ్గిన అమ్మకాలు...
బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో నగరంలో ఈ మూడు రోజుల్లోనే చికెన్, గుడ్ల అమ్మకాలు దాదాపు 25 శాతం పడిపోయాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై కర్ణాటక పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ బ్రీడర్స్ అసోషియేషన్ (కేపీఎఫ్‌బీఏ) ప్రతినిధి డాక్టర్ బి.జి.పుట్టణ్ణ మాట్లాడుతూ... ‘బెంగళూరులో సాధారణంగా ప్రతి రోజూ 4 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే బుధవారంతో పోలిస్తే శుక్రవారం నాటికి అమ్మకాలు 25 శాతం మేరకు పడిపోయాయి. ముఖ్యంగా నగరంలోని ప్రముఖ మార్కెట్‌లలో ఒకటైన రసల్ మార్కెట్‌లో చికెన్, గుడ్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. కొనుగోలు దారులు తమ ఆరోగ్య రక్షణపై ఆందోళనతో చికెన్ కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయినా ప్రస్తుతం బర్డ్ ఫ్లూకు గురైంది నాటుకోళ్లు మాత్రమే, బాయిలర్ కోళ్లలో ఈ లక్షణాలు కనిపించలేదు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.
15 రోజుల పాటు దుకాణాల మూసివేత...
కాగా, బర్డ్ ఫ్లూను గుర్తించిన దాసరహళ్లి ప్రాంతానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసం దుకాణాలను అధికారులు పూర్తిగా మూసేశారు. ఈ విషయంపై రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్‌కుమార్ ఖత్రి మాట్లాడుతూ...‘బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గాను అమృతహళ్లి, థనిసంద్ర, కాడుగోనహళ్లి ప్రాంతాల్లోని ప్రాధమిక వైద్య శిబిరాల్లోని సిబ్బందితో పాటు అంగన్‌వాడీ, ఆశాకార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఈ విషయంపై అవగాహన కల్పించనున్నారు. దాసరహళ్లి ప్రాంతంలో కోళ్లను చంపే ప్రక్రియను కేంద్రం నుండి వచ్చిన వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. ప్రజలు బర్డ్ ఫ్లూకు సంబంధించిన ఏదైనా సమస్యలపై సహాయం కోసం సహాయవాణి కేంద్రాలకు 1800–425–0012 లేదా 080–23417100 నంబర్‌లలో సంప్రదించవచ్చు’ అని తెలిపారు. కాగా, మాంసప్రియులు ఈ విషయం పైఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ‘చికెన్, గుడ్లను 70 డిగ్రీల సెల్సియస్‌కు పైన ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి సమస్య ఎదురవ్వదు. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత వద్ద బర్డ్ ఫ్లూను కలిగించే వైరస్ పూర్తిగా చనిపోతుంది. సరిగ్గా ఉండికించకుండా చికెన్‌ను తిన్న సందర్భాల్లోనే వైరస్ వ్యాపించే అవకాశాలు ఉంటాయి’ అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆనిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బైరేగౌడ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment