మత ఘర్షణలు, అల్లర్లకు ఊతమిచ్చే మెసేజ్‌లు పంపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా హెచ్చరించారు.
సాక్షి, ముంబై: మత ఘర్షణలు, అల్లర్లకు ఊతమిచ్చే మెసేజ్‌లు పంపించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా హెచ్చరించారు. అలాగే సదరు ఎస్‌ఎంఎస్‌లను, ఎమ్మెమ్మెస్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేసేవారిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు లాల్‌బాగ్ ప్రాంతంలో ఈ నెల నాలుగో తేదీ రాత్రి రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అక్కడ 144 సెక్షన్ అమలుచేసిన విషయం తెలిసిందే. ఆ రోజు జరిగిన ఘటన ముందస్తు పథకం ప్రకారమే జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అల్లర్లు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ విషయం ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌ల ద్వారా నగర మంతట వ్యాపించింది. దీన్ని బట్టి ఇదంతా ముందస్తు పథకం ప్రకారం జరిగిందని మారియా అనుమానాలు వ్యక్తం చేశారు. మత ఘర్షణలు సృష్టించి నగరంలో శాంతి, భద్రతలకు విఘాతం కల్గించాలని అసాంఘిక శక్తులు పథకం వేసినట్లు స్పష్టమవుతోందని మారియా అభిప్రాయపడ్డారు.
ఆ రోజు స్థానిక ప్రజలు సంమయనం పాటించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మతఘర్షణలు జరిగి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌లు ఎవరు, ఎవరికి పంపించారు...? వారు బల్క్‌లో ఎవరెవరికి ఫార్వర్డ్ చేశారో ఆరా తీస్తున్నామన్నారు. కాగా, ఏదైనా ఘటన జరిగితే దాని పూర్తి వివరాలు తెలుసుకోకుండా అనవసరంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే మెసెజ్‌లు ఇతరులకు పంపకూడదని మారియా సూచించారు. సదరు సమాచారాన్ని ముందు సమీప పోలీసు స్టేషన్‌కు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.