కత్తులతో కాలేజీకి..
ఆరుగురు విద్యార్థుల అరెస్ట్
70 మంది పచ్చపాస్ కాలేజీ విద్యార్థుల సస్పెన్షన్
చెన్నై: ఉన్నత విద్యావంతులై దేశాన్ని ఉద్దరించాల్సిన విద్యార్థులు కరుడుగట్టిన నేరస్తులుగా మారిపోతున్నారు. విద్యార్థులను మేధావులుగా మార్చే పాఠ్యపుస్తకాలు భద్రపరుచుకునే బ్యాగులు మారణాయుధాలను మోస్తున్నాయి. కక్షలు, కార్పణ్యాలతో దారితప్పిపోతున్న కాలేజీ విద్యార్థుల ఉదంతం చెన్నైలో గురువారం వెలుగుచూసింది. ప్రత్యర్థి విద్యార్థులను హతమార్చేందుకు కత్తులు, వేట కొడవళ్లతో పచ్చపాస్ కాలేజీకి వచ్చిన ఆరుగురు విద్యార్థులు కటకటాల పాలయ్యారు.
ఇదే వివాదంలో 70 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.చెన్నైలోని పలు కళాశాలల విద్యార్థుల మధ్య కొంతకాలంగా తరచూ ఘర్షణలు సాగుతున్నాయి. ఏదో ఒక వివాదాన్ని నెత్తుకుని నెత్తురు పారించడం పరిపాటిగా మారింది. పవిత్రమైన కళాశాలల్లోకి తరచూ పోలీసులు ప్రవేశించి విద్యార్థులను హెచ్చరించడం జరుగుతూనే ఉంది. విద్యార్థుల భవిష్యత్తును కాలరాయకూడదనే సదుదుద్దేశంతో పోలీసులు పెద్ద పెద్ద కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారు.
పోలీసుల హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న విద్యార్థులు ఇతర కాలేజీల విద్యార్థులతో కయ్యానికి కాళ్లు దువ్వుతూనే ఉన్నారు. ఇంటికి కాలేజీకి మధ్య సిటీ బస్సులో రాకపోకలు సాగించేటపుడు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తారసపడడం సహజం. అయితే తమ కాలేజీ మీదుగా లేదా ఇంటికి అనుకూలంగా బస్సులు నడపాలనే అంశంలో ఇటీవల కాలంలో విద్యార్థులు తరచూ ఘర్షణలు పడుతున్నారు.
ఈ ఘర్షణల్లో పైచేయిగా మిగిలిన కాలేజీ విద్యార్థులను మరో కాలేజీ విద్యార్థులు టార్గెట్ చేయడం, కర్రలతో దాడికి పాల్పడటం గతంలో అనేక సార్లు జరిగింది. కొన్ని కళాశాలల విద్యార్థుల మధ్య వివాదం రావణకాష్టంలా మారింది. ఇదిలా ఉండగా, ఏ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారో ఏమో గురువారం పచ్చపాస్ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్థులు పాఠ్యపుస్తకాల మధ్య కత్తులు, వేట కొడవళ్లను దాచిఉంచి వీపుపై బ్యాగు వేసుకుని నింపాదిగా హాజరైనారు.
ఈ సమాచారాన్ని అందుకుని హతాశులైన కాలేజీ ప్రిన్సిపాల్ కళిరాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విద్యార్థుల బ్యాగులకు జరిపిన తనిఖీలో పెద్ద ఎత్తున మారణాయుధాలు పట్టుబడ్డాయి. మారణాయుధాలు కలిగి ఉన్న బీకాం మొదటి సంవత్సరం విద్యార్థులు దినేష్, కార్తికేయన్, ఎల్ మణకంఠన్, బీకాం రెండో సంవత్సరం విద్యార్థులు చెల్లముత్తు, బీసీఏ మొదటి సంవత్సరం విద్యార్థి మణికంఠన్, రెండో సంవత్సరం విద్యార్థి అరుణ్‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీలో అరాచకాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై 70 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు.