నగర పర్యటనలో అధికారులపై సీఎం ఫైర్
పరివారంతో ప్రత్యేక బస్సులో సిటీ రౌండ్స్
వర్షాకాలం ప్రారంభానికి ముందే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు
నిర్లక్ష్య అధికారిపై వేటు
బెంగళూరు: బీబీఎంపీ ఎన్నికల సమయంలో వారానికోసారి సిటీ రౌండ్స్ నిర్వహించిన సీఎం సిద్ధరామయ్య ఆరు నెలల తర్వాత మంగళవారం నగరంలో పర్యటించారు. బెంగళూరులోని ఆనందరావ్ సర్కిల్, విఠల్ మాల్యారోడ్, మడివాళ మార్కెట్, హెచ్‌ఎస్‌ఆర్ లేఔవుట్ తదితర ప్రాంతాల్లో మంత్రులు, అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడాన్ని గుర్తించి అధికారులపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తానెంతమాత్రం సహించబోనంటూ హెచ్చరించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే అసంపూర్తిగా ఉన్న పనులన్నింటిని పూర్తి చేయాలని సీఎం సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణా నుంచి మంత్రులు రామలింగారెడ్డి, దినేష్ గుండూరావ్, కె.జె.జార్జ్, బీబీఎంపీ, బీడీఏ, బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ విభాగాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో సీఎం సిద్ధరామయ్య బయలుదేరారు. ఆనందరావ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అండర్‌పాస్ పనులను సమీక్షించారు. పనులు ఎప్పట్లో పూర్తవుతాయి, ఇప్పటి వరకు ఎంత మేరకు నిధులను వెచ్చించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విఠల్‌మాల్యా రోడ్‌లో చేపట్టిన ‘టెండర్ షూర్’ పనులను సీఎం పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా మడివాళ మార్కెట్‌కు సమీపంలో జరుగుతున్న రోడ్డు పనులను సిద్ధరామయ్య పరిశీలించారు. ఈ రోడ్డును రూ.4.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని, ఇప్పటికే 90 శాతం మేర పనులు పూర్తయ్యాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇదే సందర్భంలో మడివాళ మార్కెట్‌లోని వ్యాపారులతో సిద్ధరామయ్య నేరుగా మాట్లాడారు. వ్యాపారుల జీవన స్థితి గతులు, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు తదితర అంశాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. ఇక మార్కెట్ కోసం కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు చేసుకోవాలని, ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు పాదచారులకు సైతం సమస్యలు ఎదురవుతాయని సీఎం సూచించడంతో వ్యాపారులు ఇందుకు అంగీకరించారు. మార్కెట్ పక్కన చెత్త కుప్పలు, కుప్పలుగా పడి ఉండడాన్ని గమనించిన సిద్ధరామయ్య అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. చెత్తను తక్షణమే తొలగించాలని, మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి సీఎం సిద్దరామయ్య నేరుగా జువైనల్ హోమ్‌కు చేరుకున్న సీఎం సిద్ధరామయ్య అక్కడి బాల నేరస్తులతో మాట్లాడారు. ఈ జువైనల్ హోంలో ఆశ్రయం పొందుతున్న 43 మంది బాలలతో అక్కడి వసతుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ....జువైనల్ హోమ్‌లోని పరిస్థితులు బాల నేరస్తులను తిరిగి మంచి వారిగా పరివర్తన తీసుకొచ్చే విధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇదే సందర్భంలో బాలనేరస్తులతో మాట్లాడారు. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత మంచి పౌరులుగా మారండంటూ వారికి సూచించారు. అన ంతరం వారితో భవిష్యత్తులో దొంగతనాలు, హత్యలు వంటి నేరాలన్నింటికి దూరంగా ఉంటామని, ఉత్తమ పౌరులుగా మెలుగుతామని ప్రతిజ్ఞ చేయించారు.
నిర్లక్ష్యం వహించిన చీఫ్ ఇంజనీర్ సస్పెన్షన్...
హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో డ్రెయినేజీ పనులను పూర్తి చేయడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ చీఫ్ ఇంజనీర్ రుద్రమూర్తిని సీఎం సిద్ధరామయ్య సస్పెండ్ చేశారు. గత నాలుగేళ్లుగా హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ఈ డ్రెయినేజీ పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తుండటంపై ఆరోపణలు రావడంతో సిటీ రౌండ్స్‌లో భాగంగా ఈ పనులను సీఎం పరిశీలించారు. ఎలాంటి కారణం లేకుండా పనులను వాయిదా వేస్తూ వస్తున్నారంటూ రుద్రమూర్తిని సీఎం సిద్ధరామయ్య సస్పెండ్ చేశారు.