పనిచేయండి.. లేదా వెళ్లిపోండి | collector sarath review meeting | Sakshi
Sakshi News home page

పనిచేయండి.. లేదా వెళ్లిపోండి

Published Thu, Oct 27 2016 2:27 PM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM

పనిచేయండి.. లేదా వెళ్లిపోండి - Sakshi

పనిచేయండి.. లేదా వెళ్లిపోండి

అధికారులు అలసత్వం వీడాల్సిందే
100 శాతం మరుగుదొడ్లు పూర్తికావాలి
మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల సమీక్షలో కలెక్టర్‌
 
మల్లాపూర్‌/ఇబ్రహీంపట్నం/గొల్లపల్లి/పెగడపల్లి: ‘ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి. అయితేనే సంక్షేమ ఫలాలు ప్రజలు చేరుతాయి. సమర్థవంతంగా పనిచేయండి.. లేకుంటే ఇళ్లకు వెళ్లిపోండి.. ’ అంటూ కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల అధికారులతో ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మల్లాపూర్‌లో మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి డిసెంబర్‌ 31లోపు వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. నవంబర్‌ 15లోగా సాదాబైనామాలపై విచారణ చేపట్టి ప్రోసిడింగ్స్‌ ఇవ్వాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మూటేషన్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండొద్దని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, ఇందుకు అనువైన స్థలాలను గుర్తించాలని సూచించా రు. నెలలో ఐదు ప్రసవాలు జరగడంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి ముఖర్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పంట రుణాలివ్వడంలో లక్ష్యాన్ని చేరాలని ఏవో నాగమణికి సూచించారు.
 
సమావేశంలో డీఎస్‌వో సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ ఆనంద్, ఎంపీడీవో సంతోష్‌కుమార్, తహసీల్దార్‌ రవీందర్‌రాజు, డెప్యుటీ తహసీల్దార్‌ వకీల్, ఎంఈవో శ్రీనివాస్, ఏవో నాగమణి, ఏఈలు అన్వర్, మనోహర్, మౌనిక, ఈవో పీఆర్డీ శ్రీధర్, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ షైనీ, ఎంసీవో గంగాధర్‌నాయక్, ఐకేపీ సీసీ లక్ష్మీరాజం పాల్గొన్నారు. గొల్లపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల విధులు బాగాలేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీపీ కాంపెల్లి సత్తవ్వ, డీఎస్‌వో సత్యనారాయణ, తహశీల్దార్‌ సుమచౌదరి, ఎంపీడీవో కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. పెగడపల్లిలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించినప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాశెట్టి సత్తయ్య, వైస్‌ ఎంపీపీ కరుణాకర్‌రావు, తహశీల్దార్‌ రాఘవచారి, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
 
పనినేర్చుకోండి ముందు..
ఇబ్రహీంపట్నం ఎంపీడీవో శశికుమార్‌పై కలెక్టర్‌ శరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్లు ఎన్ని నిర్మించాల్సి ఉందని ఎంపీడీవోను ప్రశ్నించగా.. 12,437కు గాను 4182 పూర్తయ్యాయని, 180 మందిని ఆన్‌లైన్‌ చేశామని పేర్కొన్నారు. పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి, ఏపీవో సతీష్‌కుమార్‌ ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానం చెప్పడం తో అవగాహన లేకుండా పనులు చేస్తున్నావంటూ ఎంపీడీవోపై అసహనం వ్యక్తం చేశారు. ‘సరిగ్గా పనిచేయి.. లేకుంటే ఇంటికి వెళ్లిపో..’ అంటూ హెచ్చరించారు. మెుక్కల వివరాలపై ఏవో డేవిడ్‌రాజ్‌ను ప్రశ్నించగా.. కంప్యూటర్‌ లేదని సమాధానమిచ్చారు. ఆగ్రహానికి గురైన కలెక్టర్‌ ‘ఉద్యోగం ఎలా సంపాదించావు.. నా ఆఫీస్‌కు వచ్చి కంప్యూటర్‌ పనిచేసుకో..’ అంటూ మందలించారు. సాదాబైనామా దరఖాస్తులపై తహసీల్దార్, పాఠశాలలు, ఉత్తీర్ణతపై ఎంఈవో నర్సింహమూర్తిని అడిగారు. ప్రసవాలపై వైద్యాధికారి సయ్యద్‌షాకీర్‌ను ప్రశ్నించగా.. ఐదు అని చెప్పడంతో ‘అధికారులెవరూ సరిగ్గా పనిచేస్తలేరు..’ అంటూ అసహనం వ్యక్తంచేశారు. సమావేశంలో డీపీఆర్‌వో పల్లవి, జెడ్పీటీసీ సునీత, ఎంపీపీ తేలులక్ష్మి, సర్పంచ్‌ నేమూరి లత పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement