సాక్షి, ముంబై:
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య దూరం పెరుగుతోంది. సీట్ల పంపకాల విషయంలో తమమాటే నెగ్గాలని ఇరు పార్టీలూ పట్టుబడుతున్నాయి. తమ వాదనను సమర్థించుకుంటూ ఎవరికివారు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. సీట్ల పంపకాలపై ఇప్పటికే ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయని, పాత ఫార్ములా ప్రకారమే కాంగ్రెస్ 26, ఎన్సీపీ 22 స్థానాల్లో పోటీ చేస్తుందని ఎన్సీపీ నేతలు ప్రకటిస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. బుధవారం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం పాత ఫార్ములాతోనే ప్రజాస్వామ్య కూటమి ఎన్నికలకు వెళ్తుందని ప్రకటించారు.
అయితే కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాత ఫార్ములా ప్రకారం ఎన్నికలకు వెళ్లడం కుదరదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ 29, ఎన్సీపీ 19 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో ఇరు పక్షాల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా సయోధ్య కుదరలేదనే విషయం స్పష్టమవుతోంది.
ఇరు పార్టీలు కూడా సీట్ల పంపకాల విషయమై ఇప్పటిదాకా పలుమార్లు వేర్వేరుగా సమావేశమైనప్పటికీ ఇరు పార్టీలు కలిసి అధికారికంగా ఎటువంటి సమావేశం నిర్వహించుకోలేదనే చెప్పాలి. ఇటువంటి సమయంలో కొత్త ఫార్ములా ప్రకారమే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తామంటూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ బుధవారం చేసిన ప్రకటన మరింత చిచ్చు రాజేసింది.
భాగస్వామితో ఎటువంటి చర్చలు జరపకుండా ఎలా ప్రకటిస్తారని ఎన్సీపీ నేతలు చవాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా ఎన్సీపీ తీరును తప్పుబడుతున్నారు. పాత ఫార్ములా ప్రకారమే వెళ్తామంటూ ఎన్సీపీ నేతలు కూడా ప్రకటించడాన్ని వారు వేలెత్తి చూపుతున్నారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికన సీట్ల పంపకాలు జరగాలని కాంగ్రెస్ చెబుతోంది. ఈ రకంగా చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో 174, ఎన్సీపీ చేతిలో 114 నియోజకవర్గాలున్నాయి. ఈ నిష్పత్తి ప్రకారం కాంగ్రెస్‌కు 29 లోక్‌సభ స్థానాలు, ఎన్సీపీకి 19 లోక్‌సభ స్థానాలు గా పంపకాలు జరగాలని హస్తం నేతలు చెబుతున్నారు.
ఈ ఫార్ములా ప్రకారమే సీట్ల పంపకాలు జరిగితీరుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు ఎన్సీపీ మాత్రం ఒప్పుకోవడంలేదు. పాత ఫార్ములా ప్రకారమైతేనే కూటమిలో కొనసాగుతామని చోటామోటా నేతలతో హెచ్చరికలు పంపుతోంది. మరి రానున్న రోజుల్లో వీరి మైత్రి ఏమవుతుందో చూడాలి.
కాంగ్రెస్-ఎన్సీపీల సీట్ల పోట్లాట!
Published Sat, Oct 12 2013 12:01 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement