'బాలింతలు చనిపోతున్నా పట్టదా?'
'బాలింతలు చనిపోతున్నా పట్టదా?'
Published Tue, Apr 25 2017 3:52 PM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
హైదరాబాద్: బాలింతలు సరైన వైద్యం అందక మరణిస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు. మంగళవారం పాతబస్తీలోని పెట్ల బురుజు ఆసుపత్రిని ఆమె సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఆస్పత్రిలో మౌలిక వసతులు దుర్భరంగా ఉన్నాయన్నారు. సర్కార్ చెబుతున్న దానికి ఆసుపత్రులలో వసతులకు పొంతన లేదన్నారు. మూడేళ్ల నుంచి స్టాఫ్‌ను నియమించక పోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతుందన్నారు. బ్లడ్ బ్యాంక్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. 600 మంది రోగులు వచ్చే ఆసుపత్రికి 6 మంది డాక్టర్లా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఎందుకు ఖాళీలు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మాటలకు పరిమితం కాకుండా.. ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆసుపత్రుల్లో ఒక రోజు కూలి చేయాలని కోరారు. అప్పుడే రోగుల కష్టాలు మంత్రికి తెలుస్తాయన్నారు. ప్రభుత్వమే.. జనాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నదని ఎద్దేవా చేశారు. ఆసుపత్రిలో తక్షణమే బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో లంచగొండితనం చూసి కేసీఆర్ సిగ్గుపడాలని అన్నారు.
Advertisement
Advertisement