సిద్దుపై సీనియర్ల గుస్సా.... | congress leaders fires on Chief Minister Siddaramaiah | Sakshi
Sakshi News home page

సిద్దుపై సీనియర్ల గుస్సా....

Published Sun, Oct 11 2015 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM

congress leaders fires on Chief Minister Siddaramaiah

సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి రెండున్నరేళ్లు కావస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై సీనియర్ నేతల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి రాహుల్ పర్యటన సందర్భంలో బయటపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు సీనియర్ నేతలతో చర్చించేందుకుగాను శుక్రవారం సాయంత్రం పొద్దుపోయాక ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై కాంగ్రెస్ సీనియర్ నేతలు పలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ ఏకంగా రాహుల్‌గాంధీ ఎదుటే సిద్ధరామయ్యకు చురకలు అంటించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘రాష్ట్రంలో అసలు ఎవరి కోసం ప్రభుత్వం నడుస్తోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పరిశ్రమలు కూడా రాష్ట్రానికి వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి.

ఇక రాష్ట్రంలోని వెనకబడిన వర్గాల వారికి ఊరటనిచ్చే సంక్షేమ పధకాలేవీ రెండున్నరేళ్లలో ప్రభుత్వం ప్రారంభించలేకపోయింది. కేవలం అన్నభాగ్య, షాదీభాగ్య వంటి పధకాలతో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడం కుదరని పని. ఇక చాలా కాలంగా మంత్రి వర్గ విస్తరణ కూడా వాయిదా పడుతూనే వస్తోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి నెలకొది. రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్ తరహా పరిస్థితిని కర్ణాటకలోనూ పార్టీ ఎదుర్కొనాల్సి వస్తుంది’ అని చెప్పారు.

ఎస్.ఎం.కృష్ణ మాట్లాడుతున్న సందర్భంలోనే ఆయన మాటలకు సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందుకు రాగా రాహుల్‌గాంధీ సున్నితంగా వారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘సీనియర్ నేతలు ఏం చెబుతున్నారో ముందు వినండి, తరువాత మీ అభిప్రాయాలను చెప్పండి’ అని రాహుల్‌గాంధీ సూచించడంతో సిద్ధరామయ్య వెనక్కుతగ్గారు.

ఇక ఎస్.ఎం.కృష్ణ వ్యాఖ్యలకు సీనియర్ నేత బి.కె.హరిప్రసాద్ సైతం గొంతు కలిపారు. అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ అసంతృప్తి పెరుగుతూ పోతే అది పార్టీ పటిష్టతపై ప్రభావం చూపే అవకాశం ఉందని సీనియర్ నేతలు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం.
 
లేఖ రాసిన అరణ్య అభివృద్ధి మండలి అధ్యక్షుడు....
ఇక సిద్ధరామయ్య తీరుపై సీనియర్ నేతలు రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే సిద్ధరామయ్యకు మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. రాష్ట్ర అరణ్య అభివృద్ధి మండలి అధ్యక్షుడు చలవాధి నారాయణ స్వామి ప్రభుత్వ పగ్గాలను సిద్ధరామయ్య చేతి నుండి తప్పించి కేపీసీసీ అధ్యక్షడు డాక్టర్ జి.పరమేశ్వర్ లేదా పార్లమెంటు సభ్యుడు మల్లికార్జున ఖర్గేలకు అప్పగించాల్సిందిగా రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు త్వరలోనే పదవీగండం తప్పదేమోననే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విసృతంగా జరుగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement