సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో ఇనుప ఖనిజం అక్రమ తవ్వకానికి సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రద్దయిన 51 ‘సీ’ కేటగిరీ లీజుల్లో అత్యధికం కాంగ్రెస్ పార్టీ వారివేనని ప్రతిపక్ష నాయకుడు కుమారస్వామి ఆరోపించారు. కనుక ఖజానాకు ఏర్పడిన నష్టాన్ని వారి నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు. విధాన సౌధలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి కావడానికి ముందు అక్రమంగా మైనింగ్‌కు పాల్పడిన వారి నుంచి జరిమానా వసూలు చేస్తానని బీరాలు పలికిన సిద్ధరామయ్య ఇప్పుడెందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు. ఆక్రమణదారుల్లో కాంగ్రెస్ వారే ఎక్కువగా ఉండడం దీనికి కారణమేమోనని సందేహం వ్యక్తం చేశారు. కాగా నిషిద్ధ సింగిల్ నంబర్ లాటరీలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
హోం శాఖ మంత్రి కేజే. జార్జ్ లాలూచీ వల్లే ఇంకా లాటరీలు మనుగడ సాగిస్తున్నాయని ఆరోపించారు. దీనిపై తాను గొంతు చించుకుని అరుస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. లాటరీ నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసు అధికారిని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. పార్టీ విప్‌ను వచ్చే నెల 5న ప్రకటిస్తామన్నారు.
కాంగ్రెస్‌లోనే అధికంగా అక్రమ ఘనులు
Published Sat, Sep 28 2013 4:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement