నిలకడగా అంబి ఆరోగ్యం
- ప్రకటించిన ప్రభుత్వం ..
- రెండు, మూడు రోజుల్లో పూర్తి స్వస్థత
- లండన్‌నుంచి కుమారుడి రాక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీశ్ ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోంది. ఆయన ఆరోగ్యంపై వ్యాపిస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన సతీమణి, నటి సుమలత మరో మారు విజ్ఞప్తి చేశారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని శాసన సభలో సోమవారం బీజేపీకి చెందిన ఆర్. అశోక్, జేడీఎస్‌కు చెందిన చెలువరాయస్వామి డిమాండ్ చేశారు.
అంబరీశ్ మంత్రి కనుక ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రకటన చేసి తీరాలని వారు పట్టుబట్టారు. దీంతో ప్రభుత్వం తరఫున ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప ప్రకటన చేశారు. ‘అంబరీశ్ ఆరోగ్యం పట్ల ఆందోళన వద్దు. వైద్యులు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తున్నారు. ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి తరలించాల్సి ఉంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంబరీశ్ సతీమణి కూడా ప్రకటన చేశారు. వైద్యులు కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళనా వద్దని చెప్పారు’ అని ప్రకటించారు.
మరో వైపు మండ్య ఎంపీ, నటి రమ్య...అంబరీశ్ చికిత్స పొందుతున్న విక్రమ్ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైద్యులు ఇప్పటి వరకు ఆయనలో 10-11 లీటర్ల నీటిని తొలగించారని, మరో ఐదారు లీటర్ల నీటిని తీయాల్సి ఉందని వెల్లడించారు. కాగా అంబరీశ్ వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు రాష్ర్ట వ్యాప్తంగా ధన్వంతరి, వృత్యుంజయ హోమాలను నిర్వహించారు. రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్‌డీ. దేవెగౌడ సహా పలువురు ప్రముఖులు ఆస్పత్రిని సందర్శించారు.
రెండు, మూడు రోజుల్లో పూర్తి స్వస్థత
అంబరీశ్ ఆరోగ్యం విషయంలో ఎలాంటి వదంతులను నమ్మవద్దని, ఆయన చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ తెలిపారు. విక్రం ఆస్పత్రి వైద్యులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో ఆయనకు పూర్తి స్వస్థత చేకూరుతుందని చెప్పారు. వైద్యుడు డాక్టర్ రవీశ్ మాట్లాడుతూ అంబరీశ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, విశ్రాంతి కోసం కృత్రిమ శ్వాసను అమర్చామని వెల్లడించారు. ఇంకా ఒకటి, రెండు రోజులు కృత్రిమ శ్వాస ద్వారానే వైద్యాన్ని అందిస్తామని, అనంతరం వార్డుకు తరలిస్తామని తెలిపారు. ఆయన గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలు చక్కగా పని చేస్తున్నాయని చెప్పారు. మరో వైద్యుడు విక్రం మాట్లాడుతూ అంబరీశ్‌ను ఆస్పత్రికి తీసుకు వచ్చిన రోజుతో పోల్చుకుంటే, ఆరోగ్యం ఎంతో మెరుగు పడిందని తెలిపారు.
కుమారుని రాక
తండ్రి అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న అంబరీశ్ తనయుడు అభిషేక్ గౌడ సోమవారం నగరానికి వచ్చాడు. అనంతరం నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. వేకువ జామున నగరానికి వచ్చిన అభిషేక్ తొలుత జేపీ నగరలోని ఇంటికి వెళ్లాడు. ఆక్కడి నుంచి ఆస్పత్రికి వచ్చాడు. అంబరీశ్‌కు చికిత్స చేస్తున్న వైద్యులతో మాట్లాడాడు. పూర్తిగా స్వస్థత చేకూరడానికి ఎన్ని రోజులు పడుతుందని, భవిష్యత్తులో తండ్రి ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటూ వాకబు చేశాడు. అనంతరం ఆస్పత్రి వెలుపల విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి ఆరోగ్యం బాగా మెరుగు పడిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. వైద్యులు ఉత్తమ చికిత్సను అందిస్తున్నారని తెలిపాడు. పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. ‘మీ అంబరీశ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావడానికి, ఎప్పటిలాగే ఆయన పనులు చేసుకోవడానికి’ దయ చేసి సహకరించండి అని అభిషేక్ అభిమానులను కోరాడు.