ambaris
-
ఇళ్ల కేటాయింపులపై... దద్ధరిల్లిన అసెంబ్లీ
ఫలించని స్పీకర్ రాజీ యత్నాలు బీజేపీకి జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు రేపటికి సభ వాయిదా వారం లోగా చెరుకు రైతులకు బకాయిలు బెంగళూరు : రాష్ట్రంలో వాజ్‌పేయి గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ తాము చేసిన ఆరోపణలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్ స్పందించిన తీరుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు మంగళవారం శాసన సభలో ధర్నాకు దిగారు. దీనిపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాజీ కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జీరో అవర్‌లో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులో మంత్రి పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన అంబరీశ్ ‘ఎనిమిదేళ్ల పాటు కాంగ్రెస్ అజ్ఞాతంలో ఉండిందని, మీరు చేసిన పనే మేమూ చేశాం’ అని చెప్పారు. సీనియారిటీ ఆధారంగా ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులతో పాటు జేడీఎస్ సభ్యులు శెట్టర్‌కు మద్దతుగా నిలవడంతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయించారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క ఇంటినీ కేటాయించలేదని ఆరోపించారు. ఇకమీదట ఇలాంటి పక్షపాతం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ దశలో మంత్ర మళ్లీ మాట్లాడుతూ మూడు లక్షల ఇళ్లను కేటాయించాలనేది లక్ష్యమని చెప్పారు. తొలుత అర్జీలు సమర్పించిన వారికి ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. 142 నియోజక వర్గాలకు ఇళ్లను కేటాయించినట్లు వివరించారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం ఎదుట ధర్నాకు దిగారు. ఈ దశలో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేసి, పాలక, ప్రతిపక్షాల మధ్య తన ఛాంబర్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడా ప్రతిష్టంభన తొలగిపోలేదు. అన్ని నియోజక వర్గాలకు సమానంగా ఇళ్లను కేటాయిస్తామంటూ సభలో హామీ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రతిపక్షాలు తిరస్కరించాయి. నిర్దిష్టంగా ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం సమ్మతించక పోవడంతో సభ తిరిగి ప్రారంభమైన వెంటనే విపక్షాలు ధర్నాను కొనసాగించాయి. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. వారంలోగా చెరకు రైతులకు బకాయిలు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు ధర్నాను కొనసాగించాయి. రాష్ర్టంలోని చెరకు రైతులకు రావాల్సిన బకాయిలను చక్కెర కర్మాగారాలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ సోమవారం సాయంత్రం విపక్షాలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. దీనిపై సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన చేస్తూ వారంలోగా రైతులకు బకాయిల చెల్లింపులు ప్రారంభమవుతాయని తెలపడంతో విపక్షాల సభ్యులు ధర్నాను విరమించారు. -
ఇక ఉద్వాసనే!
లోక్‌సభ ఫలితాల ప్రభావం .. విజయానికి సహకరించని, పని తీరు సరిగాలేని మంత్రులపై వేటు! జాబితాలో ఆరుగురు త్వరలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అసంతప్తి నేతలకు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు ప్రతిభకు పెద్ద పీట.. అన్ని జిల్లాలకు ప్రాధాన్యత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు సహకరించని, పని తీరు సరిగాలేని అమాత్యులకు ఉద్వాసన పలకడానికి అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతానికి ఈ జాబితాలో శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ ఉన్నారు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని కాంగెస్ భావిస్తోంది. ఒక వేళ అసంతప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచనలో కూడా ఉంది. సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సరైన సహాయ సహకారాలు అందించని మంత్రులపై వేటు వేయాలని అధిష్టానం యోచిస్తోంది. వీరితో పాటే పని తీరు బాగా లేని మంత్రులకు కూడా ఉద్వాసన పలకనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ నేత ృత్వంలో మంత్రుల పని తీరును బేరీజు వేశారు. ప్రస్తుతానికి ఆరుగురు మంత్రుల నెత్తిపై కత్తి వేలాడుతోంది. మంత్రులు శ్రీనివాస ప్రసాద్, శామనూరు శివ శంకరప్ప, ఖమరుల్ ఇస్లాం, ప్రకాశ్ హుక్కేరి, అంబరీశ్, కిమ్మనె రత్నాకర్ పదవులను కోల్పోయే అవకాశాలున్నాయని సమాచారం. వీరిలో ప్రకాశ్ హుక్కేరి మొన్న జరిగిన ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మంత్రి వర్గంలో ఇప్పటికే మూడు ఖాళీలున్నాయి. కనుక కొత్తగా తొమ్మిది మందికి అవకాశం లభించవచ్చు. సమీప భవిష్యత్తులో ముఖ్యమైన ఎన్నికలేవీ లేనందున, మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఇంతకు మించిన తరుణం ఉండదని అధిష్టానం భావిస్తోంది. ఒక వేళ అసంత ృప్తి తలెత్తితే బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులను కట్టబెట్టాలనే ఆలోచన కూడా ఉంది. పునర్వ్యవస్థీకరణలో అనుభవం, సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సామాజిక వర్గం, ప్రాంతం లాంటి వాటిని పక్కన పెట్టి ప్రతిభకు పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో మంత్రి వర్గంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కలిగేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎగువ సభల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలపై చర్చించడానికి దిగ్విజయ్ సింగ్ ఈ నెలాఖరుకు ఇక్కడికి రానున్నారు. ఇదే సమయంలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నారు. మల్లిఖార్జునకు స్థానం తోటలు, ఉద్యాన వనాల శాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప వయో భారంతో బాధ పడుతున్నారు. ఆయన స్థానంలో కుమారుడు ఎస్ఎస్. మల్లిఖార్జునకు స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తప్పుకోవడానికి సిద్ధమయ్యారు. రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీని వల్ల కీలకమైన రెవెన్యూ శాఖ అచేతనంగా పడి ఉంది. కరువు, వరదల సమయాల్లో ఆయన పర్యటనలకు వెళ్లే స్థితిలో లేరు. మునిసిపల్ శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం అనేక శాఖలతో సతమతమవుతున్నారు. ఆయన పని తీరు బాగా లేదని పార్టీలో పెదవి విరుస్తున్నారు. గుల్బర్గ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్న ఆయనకు అక్కడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మండ్యలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, నటి రమ్య ఓటమి పాలైంది. దీనికి ఆయన బాధ్యత వహించాలనే మాటలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ అతి మంచితనమే ఆయన కొంప ముంచేట్లుంది. విద్యా శాఖ లోటు పాట్లను తెలుసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. శివమొగ్గ జిల్లాలోని సొంత నియోజక వర్గం తీర్థహళ్లిలోనే ఎక్కువ రోజులుంటారని సొంత పార్టీ వారే విమర్శిస్తుంటారు. -
నేను కారణం కాదు
రమ్య ఓటమిపై అంబరీశ్ ఆమెను మంత్రి కాదు.. సీఎంగా చేసినా సంతోషమే సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మండ్య లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి రమ్య ఓటమికి తాను కారణం కాదని ఆ జిల్లా ఇన్చార్జి మంత్రి అంబరీశ్ తెలిపారు. సోమవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభంజనం వీచినప్పటికీ, మండ్యలో ఆ పార్టీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చూసుకున్నామని చెప్పారు. రమ్య ఓటమికి తానే కారణమంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, శక్తికి మించి పార్టీ అభ్య ర్థుల విజయానికి కృషి చేశామని తెలిపారు. రమ్యకు మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని వినవస్తుండడంపై ఆయన వ్యాఖ్యానిస్తూ, ‘మంత్రి పదవే కాదు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా సంతోషమే. వచ్చే ఎన్నికల్లో రమ్య అత్యధిక మెజారిటీతో గెలుపొందవచ్చు’ అని అన్నారు. -
రమ్యతో విభేదాలు లేవు
మండ్య, న్యూస్‌లైన్ : మండ్య లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, నటి రమ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అలా ఉన్నట్లయితే ఇక్కడి వచ్చి ఉండేవాడిని కానని గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ స్పష్టం చేశారు. శ్వాస కోశ వ్యాధికి సింగపూర్‌లో చికిత్స చేయించుకున్న అనంతరం తొలిసారిగా శనివారం పట్టణానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రమ్యకు వ్యతిరేకంగా పని చేయాలని ఎవరూ చెప్పలేదన్నారు. తమ వారెవరూ ఆ పని చేయబోరన్నారు. పార్టీకి ద్రోహం చేయబోనని, ఒక వేళ తాను పార్టీ ద్రోహిగా మారితే సంజయ సర్కిల్ ఉరి వేసుకుంటానని సవాలు విసిరారు. రమ్యకు ఇంకా రాజకీయాలు తెలియవని, ఎవరిని విశ్వాసంలోకి తీసుకోవాలి...కార్యకర్తలను ఎలా సంఘటిత పరచాలి లాంటి విషయాలపై అవగాహన లేదని తెలిపారు. ఆ అమ్మాయికి ఈ విషయాలు ఎవరూ చెప్పడం లేదన్నారు. అనుభవం ఆమెకు పాఠాలు నేర్పిస్తుందని, అప్పటి వరకు తాను వేచి ఉండాల్సి వస్తుందని వివరించారు. -
రెబల్ స్టార్‌గా తిరిగి వస్తా
* అభిమానులకు అంబి భరోసా * మరో వారంలో బెంగళూరుకు * సీడీ విడుదల బెంగళూరు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ పూర్తిగా కోలుకున్నారు. మరో వారం రోజుల విశ్రాంతి అనంతరం ఆయన బెంగళూరుకు తిరిగి వస్తారు. శ్వాస కోశ వ్యాధికి అంబరీశ్ సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలు తన ఆరోగ్యం గురించి ఇక ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతూ ఆయన సీడీ రూపంలో ఓ సందేశాన్ని పంపారు. అందులో ఆయన ఏమన్నారంటే....‘నమస్కారం. అందరికీ మీ అంబరీశ్ నమస్కారం. మీకు తెలిసిన విధంగానే నా ఆరోగ్యం గురించి అభిమానులు, పెద్దలు, దేశ, విదేశాల్లోని స్నేహితులు ఆందోళన చెందారు. అయితే ఎవరూ కలత చెందాల్సిన పని లేదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో కచ్చితంగా తిరిగి వస్తాను. విక్రం ఆస్పత్రి వైద్యులు చూపించిన వాత్సల్యం, విశ్వాసానికి నేను సదా రుణ పడి ఉంటా. వారి ప్రయత్నం వల్లే నేను బతికాను. అందరి ఆపేక్ష మేరకు సింగపూర్‌కు చికిత్స కోసం వచ్చాను. ఇప్పుడు కోలుకున్నాను. అయితే ఇప్పటికిప్పుడు ఊరికి రావడం కుదరదు. ఎందుకంటే.. వైద్యుల సలహా మేరకు ఇంకా ఓ వారం ఇక్కడే ఉండాలి. అనంతరం తిరిగి వస్తాను. ప్రభుత్వం నాకు అవసరమైన సాయం అందించింది. నాపై ఉంచిన విశ్వాసం, వాత్సల్యానికి జీవితాంతం రుణపడి ఉంటాను. అభిమానులు నా ఆరోగ్యం కోసం పూజలు చేశారు. అందరిలోనూ ఆందోళన నెలకొంది. అయితే ఇకమీదట ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. విక్రం ఆస్పత్రిలో ఉన్నప్పుడు అనేక మంది ప్రముఖులు వచ్చి నా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వారందరికీ హృదయ పూర్వక వందనాలు. కొద్ది రోజుల్లోనే రెబల్ స్టార్ లాగానే తిరిగి వస్తా. జై హింద్, జై కర్ణాటక’. -
'దయచేసి సింగపూర్ రావద్దు'
బెంగళూరు : సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రముఖ నుటుడు అంబరీష్‌ను పరామర్శించేందుకు వెళుతున్న సన్నిహితులు, అభిమానుల సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో అంబరీష్‌ను పరామర్శించేందుకు సన్నిహితులెవ్వరూ సింగపూర్ రావద్దని ఆయన సతీమణి సుమలత కోరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వార్డులో అంబరీష్ చికిత్స తీసుకుంటున్నారని, ఇతరులనెవరినీ వార్డులోనికి అనుమతించడం లేదని సుమలత పేర్కొన్నారు. అందుకే సన్నిహితులెవరూ సింగపూర్‌కు రావాల్సిన అసవరం లేదని, అంబరీష్ పూర్తిగా కోలుకున్నాక తామే బెంగళూరుకు వస్తామని ఆమె తెలిపారు. శనివారం నటుడు దర్శన్, నిర్మాత సందేశ్ నాగరాజ్‌లు అంబిని పరామర్శించిన విషయం తెలిసిందే. దీంతో మరికొంతమంది సన్నిహితులు అంబరీష్‌ను పరామర్శించేందుకు నగరం నుండి బయలుదేరారు. -
అంబికి సింగపూర్‌లో చికిత్స
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శ్వాస కోశం ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్‌ను శనివారం ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. సింగపూర్ ఎయిర్ అంబులెన్స్‌లో ఆయన వెంట సతీమణి సుమలత, కుమారుడు అభిషేక్ గౌడ, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌లు కూడా వెళ్లారు. అక్కడ చికిత్సకు ఆయన చక్కగా స్పందిస్తున్నారని సమాచారం. వారం రోజులుగా ఇక్కడి విక్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఉన్నత వైద్యం కోసం సింగపూర్‌కు తరలించాలని ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన వైద్యులు సూచించారు. ఉదయం పది గంటలకు అక్కడికి చేరుకున్న అంబరీశ్‌కు వైద్యులు ఐసీయూలో చికిత్సలు ప్రారంభించారు. పూర్తి స్వస్థతతో తిరిగి వస్తారు : ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంబరీశ్‌ను ఉత్తమ చికిత్స కోసం సింగపూర్‌కు తీసుకు వెళుతున్నామని, ఆయన పూర్తి స్వస్థతతో తిరిగి వస్తారని ఆయన సతీమణి సుమలత అభిమానులకు భరోసా ఇచ్చారు. సింగపూర్‌కు వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడుతూ అసంఖ్యాక అభిమానుల ఆశీర్వాదం వల్ల ఆయనకు ఎటువంటి సమస్యలు ఎదురు కాబోవని అన్నారు. ఉత్తమ చికిత్సను అందించడం ద్వారా ఆయనను మళ్లీ రెబల్ స్టార్‌గా అభిమానుల ముందుకు తీసుకు వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. విక్రమ్ ఆస్పత్రి వైద్యులు ఆయనను బిడ్డ లాగా చూసుకున్నారని, శ్వాస సమస్య ఇంకా ఉన్నందున అనివార్యంగా సింగపూర్‌కు పిలుచుకు పోతున్నామని ఆమె చెప్పారు. -
సింగపూర్‌కు అంబరీష్ తరలింపు!
బెంగళూరు : శ్వాస కోశానికి ఇన్ఫెక్షన్ కారణంగా ఇక్కడి విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీష్ ను శనివారం తెల్లవారుజామున సింగపూర్‌కు తరలించినట్లు సమాచారం. ఆయన్ను సింగపూర్ ఎయిర్ లైన్స్ అంబు లెన్స్ లో తీసుకెళ్లేందుకు వైద్యులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన వైద్య నిపుణుడు రణదీప్ గులేరియా, విక్రమ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సతీశ్‌తో కలసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరో రెండు వారాల పాటు అంబరీష్ కు విశ్రాంతి అవసరమని తెలిపారు. అంబరీష్ క్రమంగా కోలుకుంటున్నారని గులేరియా చెప్పారు. అంబరీష్ శ్వాస కోశ ఇన్ఫెక్షన్ను నివారించడానికి కొంత సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు కృత్రిమ శ్వాసతోనే చికిత్సను కొనసాగిసాగించాల్సి ఉంటుందన్నారు. మెదడు, మూత్ర పిండాలు, గుండె చక్కగా పని చేస్తున్నాయన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను కూడా ఇక్కడే ఉండి ఇక్కడి వైద్యులకు సహకరిస్తానన్నారు. డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ అంబరీష్ చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెబుతూ, వదంతులను విశ్వసించ వద్దని కోరారు. కాగా మూడు రోజుల క్రితం నటుడు రజనీకాంత్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నత చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి తీసుకెళ్లాల్సిందిగా అంబరీష్ సతీమణి సుమలతకు సూచించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ సూచన పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్‌ను సంప్రదించారు. ఆయన సూచన మేరకు గులేరియా ఇక్కడికి చేరుకుని అంబరీష్ వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. ప్రస్తుతానికి సింగపూర్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అయినా కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు అంబరీష్ ను సింగపూర్‌కు తరలించడానికి వైద్యులు చర్యలు చేపట్టారు. -
నిలకడగా అంబి ఆరోగ్యం
ప్రకటించిన ప్రభుత్వం .. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్వస్థత లండన్‌నుంచి కుమారుడి రాక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీశ్ ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోంది. ఆయన ఆరోగ్యంపై వ్యాపిస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన సతీమణి, నటి సుమలత మరో మారు విజ్ఞప్తి చేశారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని శాసన సభలో సోమవారం బీజేపీకి చెందిన ఆర్. అశోక్, జేడీఎస్‌కు చెందిన చెలువరాయస్వామి డిమాండ్ చేశారు. అంబరీశ్ మంత్రి కనుక ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రకటన చేసి తీరాలని వారు పట్టుబట్టారు. దీంతో ప్రభుత్వం తరఫున ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప ప్రకటన చేశారు. ‘అంబరీశ్ ఆరోగ్యం పట్ల ఆందోళన వద్దు. వైద్యులు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తున్నారు. ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి తరలించాల్సి ఉంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంబరీశ్ సతీమణి కూడా ప్రకటన చేశారు. వైద్యులు కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళనా వద్దని చెప్పారు’ అని ప్రకటించారు. మరో వైపు మండ్య ఎంపీ, నటి రమ్య...అంబరీశ్ చికిత్స పొందుతున్న విక్రమ్ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైద్యులు ఇప్పటి వరకు ఆయనలో 10-11 లీటర్ల నీటిని తొలగించారని, మరో ఐదారు లీటర్ల నీటిని తీయాల్సి ఉందని వెల్లడించారు. కాగా అంబరీశ్ వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు రాష్ర్ట వ్యాప్తంగా ధన్వంతరి, వృత్యుంజయ హోమాలను నిర్వహించారు. రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్డీ. దేవెగౌడ సహా పలువురు ప్రముఖులు ఆస్పత్రిని సందర్శించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్వస్థత అంబరీశ్ ఆరోగ్యం విషయంలో ఎలాంటి వదంతులను నమ్మవద్దని, ఆయన చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ తెలిపారు. విక్రం ఆస్పత్రి వైద్యులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో ఆయనకు పూర్తి స్వస్థత చేకూరుతుందని చెప్పారు. వైద్యుడు డాక్టర్ రవీశ్ మాట్లాడుతూ అంబరీశ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, విశ్రాంతి కోసం కృత్రిమ శ్వాసను అమర్చామని వెల్లడించారు. ఇంకా ఒకటి, రెండు రోజులు కృత్రిమ శ్వాస ద్వారానే వైద్యాన్ని అందిస్తామని, అనంతరం వార్డుకు తరలిస్తామని తెలిపారు. ఆయన గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలు చక్కగా పని చేస్తున్నాయని చెప్పారు. మరో వైద్యుడు విక్రం మాట్లాడుతూ అంబరీశ్‌ను ఆస్పత్రికి తీసుకు వచ్చిన రోజుతో పోల్చుకుంటే, ఆరోగ్యం ఎంతో మెరుగు పడిందని తెలిపారు. కుమారుని రాక తండ్రి అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న అంబరీశ్ తనయుడు అభిషేక్ గౌడ సోమవారం నగరానికి వచ్చాడు. అనంతరం నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. వేకువ జామున నగరానికి వచ్చిన అభిషేక్ తొలుత జేపీ నగరలోని ఇంటికి వెళ్లాడు. ఆక్కడి నుంచి ఆస్పత్రికి వచ్చాడు. అంబరీశ్‌కు చికిత్స చేస్తున్న వైద్యులతో మాట్లాడాడు. పూర్తిగా స్వస్థత చేకూరడానికి ఎన్ని రోజులు పడుతుందని, భవిష్యత్తులో తండ్రి ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటూ వాకబు చేశాడు. అనంతరం ఆస్పత్రి వెలుపల విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి ఆరోగ్యం బాగా మెరుగు పడిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. వైద్యులు ఉత్తమ చికిత్సను అందిస్తున్నారని తెలిపాడు. పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. ‘మీ అంబరీశ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావడానికి, ఎప్పటిలాగే ఆయన పనులు చేసుకోవడానికి’ దయ చేసి సహకరించండి అని అభిషేక్ అభిమానులను కోరాడు.