రెబల్ స్టార్‌గా తిరిగి వస్తా
* అభిమానులకు అంబి భరోసా
* మరో వారంలో బెంగళూరుకు
* సీడీ విడుదల
బెంగళూరు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ పూర్తిగా కోలుకున్నారు. మరో వారం రోజుల విశ్రాంతి అనంతరం ఆయన బెంగళూరుకు తిరిగి వస్తారు. శ్వాస కోశ వ్యాధికి అంబరీశ్ సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలు తన ఆరోగ్యం గురించి ఇక ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతూ ఆయన సీడీ రూపంలో ఓ సందేశాన్ని పంపారు.
అందులో ఆయన ఏమన్నారంటే....‘నమస్కారం. అందరికీ మీ అంబరీశ్ నమస్కారం. మీకు తెలిసిన విధంగానే నా ఆరోగ్యం గురించి అభిమానులు, పెద్దలు, దేశ, విదేశాల్లోని స్నేహితులు ఆందోళన చెందారు. అయితే ఎవరూ కలత చెందాల్సిన పని లేదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో కచ్చితంగా తిరిగి వస్తాను. విక్రం ఆస్పత్రి వైద్యులు చూపించిన వాత్సల్యం, విశ్వాసానికి నేను సదా రుణ పడి ఉంటా. వారి ప్రయత్నం వల్లే నేను బతికాను. అందరి ఆపేక్ష మేరకు సింగపూర్‌కు చికిత్స కోసం వచ్చాను. ఇప్పుడు కోలుకున్నాను. అయితే ఇప్పటికిప్పుడు ఊరికి రావడం కుదరదు.
ఎందుకంటే.. వైద్యుల సలహా మేరకు ఇంకా ఓ వారం ఇక్కడే ఉండాలి. అనంతరం తిరిగి వస్తాను. ప్రభుత్వం నాకు అవసరమైన సాయం అందించింది. నాపై ఉంచిన విశ్వాసం, వాత్సల్యానికి జీవితాంతం రుణపడి ఉంటాను. అభిమానులు నా ఆరోగ్యం కోసం పూజలు చేశారు. అందరిలోనూ ఆందోళన నెలకొంది. అయితే ఇకమీదట ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. విక్రం ఆస్పత్రిలో ఉన్నప్పుడు అనేక మంది ప్రముఖులు వచ్చి నా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వారందరికీ హృదయ పూర్వక వందనాలు. కొద్ది రోజుల్లోనే రెబల్ స్టార్ లాగానే తిరిగి వస్తా. జై హింద్, జై కర్ణాటక’.