ఇళ్ల కేటాయింపులపై... దద్ధరిల్లిన అసెంబ్లీ
ఫలించని స్పీకర్ రాజీ యత్నాలు
బీజేపీకి జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు
రేపటికి సభ వాయిదా
వారం లోగా చెరుకు రైతులకు బకాయిలు
బెంగళూరు : రాష్ట్రంలో వాజ్‌పేయి గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ తాము చేసిన ఆరోపణలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్ స్పందించిన తీరుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు మంగళవారం శాసన సభలో ధర్నాకు దిగారు. దీనిపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప రాజీ కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జీరో అవర్‌లో ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ.. ఇళ్ల కేటాయింపులో మంత్రి పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన అంబరీశ్ ‘ఎనిమిదేళ్ల పాటు కాంగ్రెస్ అజ్ఞాతంలో ఉండిందని, మీరు చేసిన పనే మేమూ చేశాం’ అని చెప్పారు. సీనియారిటీ ఆధారంగా ఇళ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యులతో పాటు జేడీఎస్ సభ్యులు శెట్టర్‌కు మద్దతుగా నిలవడంతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లను కేటాయించారని, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క ఇంటినీ కేటాయించలేదని ఆరోపించారు. ఇకమీదట ఇలాంటి పక్షపాతం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ దశలో మంత్ర మళ్లీ మాట్లాడుతూ మూడు లక్షల ఇళ్లను కేటాయించాలనేది లక్ష్యమని చెప్పారు. తొలుత అర్జీలు సమర్పించిన వారికి ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు.
142 నియోజక వర్గాలకు ఇళ్లను కేటాయించినట్లు వివరించారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం ఎదుట ధర్నాకు దిగారు. ఈ దశలో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేసి, పాలక, ప్రతిపక్షాల మధ్య తన ఛాంబర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడా ప్రతిష్టంభన తొలగిపోలేదు. అన్ని నియోజక వర్గాలకు సమానంగా ఇళ్లను కేటాయిస్తామంటూ సభలో హామీ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించగా, ప్రతిపక్షాలు తిరస్కరించాయి. నిర్దిష్టంగా ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం సమ్మతించక పోవడంతో సభ తిరిగి ప్రారంభమైన వెంటనే విపక్షాలు ధర్నాను కొనసాగించాయి. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.
వారంలోగా చెరకు రైతులకు బకాయిలు ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు ధర్నాను కొనసాగించాయి. రాష్ర్టంలోని చెరకు రైతులకు రావాల్సిన బకాయిలను చక్కెర కర్మాగారాలు వెంటనే చెల్లించేలా చూడాలంటూ సోమవారం సాయంత్రం విపక్షాలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. దీనిపై సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన చేస్తూ వారంలోగా రైతులకు బకాయిల చెల్లింపులు ప్రారంభమవుతాయని తెలపడంతో విపక్షాల సభ్యులు ధర్నాను విరమించారు.