మండ్య లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, నటి రమ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అలా ఉన్నట్లయితే ఇక్కడి...
మండ్య, న్యూస్‌లైన్ : మండ్య లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, నటి రమ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అలా ఉన్నట్లయితే ఇక్కడి వచ్చి ఉండేవాడిని కానని గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ స్పష్టం చేశారు. శ్వాస కోశ వ్యాధికి సింగపూర్‌లో చికిత్స చేయించుకున్న అనంతరం తొలిసారిగా శనివారం పట్టణానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రమ్యకు వ్యతిరేకంగా పని చేయాలని ఎవరూ చెప్పలేదన్నారు.
తమ వారెవరూ ఆ పని చేయబోరన్నారు. పార్టీకి ద్రోహం చేయబోనని, ఒక వేళ తాను పార్టీ ద్రోహిగా మారితే సంజయ సర్కిల్ ఉరి వేసుకుంటానని సవాలు విసిరారు. రమ్యకు ఇంకా రాజకీయాలు తెలియవని, ఎవరిని విశ్వాసంలోకి తీసుకోవాలి...కార్యకర్తలను ఎలా సంఘటిత పరచాలి లాంటి విషయాలపై అవగాహన లేదని తెలిపారు. ఆ అమ్మాయికి ఈ విషయాలు ఎవరూ చెప్పడం లేదన్నారు. అనుభవం ఆమెకు పాఠాలు నేర్పిస్తుందని, అప్పటి వరకు తాను వేచి ఉండాల్సి వస్తుందని వివరించారు.