సింగపూర్‌కు అంబరీష్ తరలింపు!
బెంగళూరు : శ్వాస కోశానికి ఇన్‌ఫెక్షన్ కారణంగా ఇక్కడి విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీష్ ను శనివారం తెల్లవారుజామున సింగపూర్‌కు తరలించినట్లు సమాచారం. ఆయన్ను సింగపూర్ ఎయిర్ లైన్స్ అంబు లెన్స్ లో తీసుకెళ్లేందుకు వైద్యులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన వైద్య నిపుణుడు రణదీప్ గులేరియా, విక్రమ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సతీశ్‌తో కలసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరో రెండు వారాల పాటు అంబరీష్ కు విశ్రాంతి అవసరమని తెలిపారు.
అంబరీష్ క్రమంగా కోలుకుంటున్నారని గులేరియా చెప్పారు. అంబరీష్ శ్వాస కోశ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి కొంత సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు కృత్రిమ శ్వాసతోనే చికిత్సను కొనసాగిసాగించాల్సి ఉంటుందన్నారు. మెదడు, మూత్ర పిండాలు, గుండె చక్కగా పని చేస్తున్నాయన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను కూడా ఇక్కడే ఉండి ఇక్కడి వైద్యులకు సహకరిస్తానన్నారు. డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ అంబరీష్ చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు.
ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెబుతూ, వదంతులను విశ్వసించ వద్దని కోరారు. కాగా మూడు రోజుల క్రితం నటుడు రజనీకాంత్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నత చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి తీసుకెళ్లాల్సిందిగా అంబరీష్ సతీమణి సుమలతకు సూచించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ సూచన పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
ఈ దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్‌ను సంప్రదించారు. ఆయన సూచన మేరకు గులేరియా ఇక్కడికి చేరుకుని అంబరీష్ వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. ప్రస్తుతానికి సింగపూర్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అయినా కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు అంబరీష్ ను సింగపూర్‌కు తరలించడానికి వైద్యులు చర్యలు చేపట్టారు.