కొలిమి పొయ్యిపై టీ తయారుచేస్తున్న రాఘవేంద్ర
చింతామణి: కొలిమిపొయ్యి, బొగ్గుల పొయ్యి, కట్టెలపొయ్యి, పొట్టు పొయ్యి... ఇలాంటివి వినడమే తప్ప నేటి తరం చూడడం లేదు. కరెంటు, గ్యాస్, ఇండక్షన్ స్టౌలు వచ్చాక వీటికి కాలం చెల్లిపోయింది. కట్టెలపొయ్యి మీద చేసిన వంట రుచి అద్భుతం, అలాంటి రుచి గ్యాస్ పొయ్యి వంటకు రాదు.. అని పెద్దలు, పల్లెవాసులు చెబుతుంటారు. విషయమేమిటంటే... కొలిమి పొయ్యి మీద కాఫీ, టీ తాగాలనే కోరిక ఉన్నవారికి ఇది శుభవార్త. చింతామణి సమీపంలో ఇలాంటి సౌలభ్యం అందుబాటులో ఉంది. మాజీ డ్రైవర్ ఒకాయన రోడ్డు పక్కన టెంటు వేసుకొని కొలిమి పెట్టి బొగ్గులతో కాఫీ, టీ, టిఫిన్ హోటల్ నడుపుతున్నారు. తాలుకాలోని శింగనపల్లి క్రాస్ దగ్గర ఈ టెంట్ ఉంది.
రుచి, ఆరోగ్యమని మంచి స్పందన
శింగనపల్లి గ్రామానికి చెందిన రాఘవేంద్ర పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. చాలా ఏళ్ల పాటు వ్యాన్, లారీ డ్రైవర్‌గా పనిచేశారు. అయితే కొన్ని నెలల నుండి డ్రైవర్ డ్యూటీలు దొరక్క, జీవనోపాధి కోస రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్‌ను పెట్టారు. రాఘవేంద్ర వినూత్నంగా ఆలోచించి బొగ్గులతో కొలిమి పెట్టి కాఫీ, టీలతో పాటు ఇడ్లీ, దోసె తదితర టిఫిన్లు తయారు చేస్తారు. ఇలాంటి వంట రుచిగాను, ఆరోగ్యంగానూ ఉంటుందని ఎంతోమంది ఈ హోటల్‌ను సందర్శిస్తుంటారు. రాఘవేంద్రకు తోడుగా భార్య విజయలక్ష్మీ ఉంటారు. హోటల్ వ్యాపారం బాగా జరుగుతోందని వారు సంతోషం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment