కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా ?
Published Sat, Aug 31 2013 10:53 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
న్యూఢిల్లీ: రాజకీయ ప్రయోజనాల కోసం 2008 ఎన్నికల సమయంలో ప్రచారానికి నగరవ్యాప్తంగా ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ భారీ ఎత్తున హోర్డింగులు, ప్రకటనలు ఏర్పాటు చేసిన వ్యవహారం ఆమె మెడకు చుట్టుకుంటోంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను శనివారం ఆదేశించింది. బీజేపీ సీనియర్ నాయకుడు విజేందర్ గుప్తా, సమాచార హక్కు చట్టం కార్యకర్త వివేక్‌గార్గ్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించిన ప్రత్యేక న్యాయమూర్తి నరోత్తమ్ కౌషల్ పైఆదేశాలు జారీ చేశారు.
2008 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచారం కోసం హోర్డింగులు, ప్రకటనల కోసం షీలా అక్రమంగా రూ.22.56 ఖర్చు చేశారని గుప్తా, గార్గ్ ఆరోపించారు. కాబట్టి అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసుల నమోదుకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. షీలా దీక్షిత్ నిధులు దుర్వినియోగానికి పాల్పడినందున, ఆమెపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త గతంలోనే రాష్ట్రపతికి సిఫార్సు చేయడం తెలిసిందే. అయితే దురుద్దేశంతో షీలా దీక్షిత్ ప్రచారం చేసుకున్నారని లోకాయుక్త పేర్కొనలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది బీఎస్ జూన్ ఈ సందర్భంగా వాదించారు. ఈ విషయంలో రాష్ట్రపతి మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఎలాంటి నేరమూ చేయలేదంటూ పోలీసులు నివేదికల్లో పేర్కొనడాన్ని డిఫెన్స్ న్యాయవాదులు తప్పుబట్టారు. 2007-09లోనూ షీలా దీక్షిత్ సీఎంగానూ, సమాచార, ప్రచార విభాగానికి ఇన్‌చార్జ్ మంత్రిగానూ పనిచేశారని వివరించారు. యూపీఏ, ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం పలు విజయాలు సాధించాయంటూ పత్రికలు, హోర్డింగుల ద్వారా భారీగా ప్రకటనలు ఇచ్చారని తెలిపారు. ఫలితంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రచా రం నిర్వహించారని లోకాయుక్త మే 22న స్పష్టీకరించిందని గుప్తా తరఫు న్యాయవాది వివరించారు.
‘ఈ మొత్తాన్ని ఆమె నుంచి రాబట్టాలని కూడా అది సిఫార్సు చేసింది. ఆ డబ్బులు ప్రభుత్వానివి,కాంగ్రెస్‌వి కావు. చర్య తీసుకోవడానికే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ? నేరం చేయలేదని పోలీసులు ఎలా చెబుతారు ?’ అని ఆయన మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా అన్నారు. దురుద్దేశంతోనే నిధులను వినియోగించారని లోకాయుక్త పేర్కొనలేదంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది బీఎస్ జూన్ చేసిన వాదనను ఆయన తప్పుబట్టారు. అసలు ఈ కేసు విచారణకు ప్రభుత్వం తరఫు న్యాయవాది రాకూడదని వాదించారు.
Advertisement
Advertisement