- కాంగ్రెస్, జేడీఎస్ మధ్య మాటల తూటాలు
- పదునెక్కుతున్న విమర్శనాస్త్రాలు
- దేవెగౌడపై పరమేశ్వర ఘాటు విమర్శలు
- సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డ దేవెగౌడ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే గడువు ఉండడంతో రాజకీయ పార్టీల మధ్య విమర్శనాస్త్రాలు పదునెక్కుతున్నాయి. బుధవారం కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఇక్కడి శివాజీ నగరలో ప్రచారం చేసిన సందర్భంగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ చేసిన విమర్శలు కొద్ది పాటి దుమారాన్ని రేపాయి.
దేవెగౌడ ప్రతి సారి తనకు ఇవే చివరి ఎన్నికలంటూ చెప్పి మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతుంటారని పరమేశ్వర ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే విషం తాగుతానని కూడా ఆయన బెదిరించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. వచ్చే జన్మలో ముస్లింల కుటుంబంలో పుడతానని చెప్పిన గౌడ, ఇప్పుడే ఆ మతంలోకి మారిపోతే అడ్డుకునే వారు ఎవరున్నారని ప్రశ్నించారు.
మరో వైపు దేవెగౌడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విరుచుకు పడ్డారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల సీఎం హాసనలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తనపై చేసిన విమర్శలపై విరుచుకు పడ్డారు. టమోటా, బంగాళా దుంపలు అమ్ముకునే వారు కోట్లకు ఎలా పడగలెత్తారని సీఎం ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కోట్ల రూపాయలు సంపాదించాననడానికి సీఎం వద్ద ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు.
అధికార మదంతో నోటికొచ్చినట్లు మాట్లాడకుండా నాలుకను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన దేవెగౌడ, జేడీఎస్ కథలు ముగిసి పోయాయని పలువురు భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాగా కొప్పళ నియోజక వర్గంలో సమాజ్ వాది పార్టీ అభ్యర్థికి మద్దతునివ్వాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.