- అమ్మ అభిమానులను అడ్డుకున్న పోలీసులు
- వాగ్వాదానికి దిగిన అన్నాడీఎంకే కార్యకర్తలు
బెంగళూరు : జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలుసుకునేందుకు వచ్చిన అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పరప్పన అగ్రహార కిక్కిరిసింది. సోమవారం ఉదయం చెన్నైతో పాటు కృష్ణగిరి, ధర్మపురి తదితర జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వందలాది మంది తరలి వచ్చారు. జైలులో అమ్మను కలవడానికి అనుమతించాలంటూ పోలీసులను అభ్యర్థించారు. అయితే ఇందుకు జైలు సిబ్బంది అంగీకరించకపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. జైలు సిబ్బందితో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. జైలు ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమింపచేశారు.
సొంద సోదరికి చిక్కని దర్శనం
బెంగళూరు నివాసముంటున్న జయలలిత సోదరి శైలజ సోమవారం ఉదయం తన కుమార్తెను వెంటబెట్టుకుని పరప్పన అగ్రహార జైలును చేరుకున్నారు. జైలు సిబ్బందికి తనను తాను పరిచయం చేసుకుని తన సోదరితో భేటీ అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఇదే విషయాన్ని జయలలితకు సిబ్బంది వివరించారు.
అయితే తాను ఎవరిని కలవను అని జయలలిత చెప్పడంతో శైలజను లోపలికి అనుమతించేందుకు జైలుసిబ్బంది నిరాకరించారు. చాలా సేపు అక్కడే వేచి చూసిన శైలజకు చివరకు నిరాశే మిగిలింది.
బెంగళూరు నుంచి తరలి వెళ్లిన తమిళ సోదరులు
బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాలలో తమిళ సోదరులు నివాసం ఉంటున్నారు. వీరు అధిక సంఖ్యలో సోమవారం ఉదయం పరప్పన అగ్రహార జైలు దగ్గరకు చేరుకున్నారు. జయలలితను కలవాలని నినాదాలు చేశారు. అమ్మా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులు సమన్వయంతో వ్యవహరించి వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు. ముందు జాగ్రత చర్యగా కారాగారం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు.