గుణపాఠం నేర్పిన నేరం పనితీరు మెరుగు
Published Sat, Dec 14 2013 11:07 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
న్యూఢిల్లీ:ఏడాది క్రితంనాటి సామూహిక అత్యాచార ఘటన నగరంలోని ఓ కీలక స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులకు చక్కని గుణపాఠం నేర్పింది. తమ పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు దోహదపడింది. దక్షిణ ఢిల్లీలోని మూడంతస్తుల వసంత్‌విహార్ పోలీస్‌స్టేషన్ హఠాత్తుగా బిజీబిజీగా మారిపోయింది. ఆ స్టేషన్ సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉండడమే ఇందుకు కారణం. ఏడాదిక్రితం ఇదే నెల 16వ తేదీన జరిగిన సామూహిక అత్యాచార ఘటనతో చలించిపోయిన వందలాదిమంది నగరవాసులు ఈ స్టేషన్‌ను చుట్టుముట్టారు.
ఈ పరిణామంతో అనేక అనుభవాలు నేర్చకున్న పోలీసు అధికారులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నించారు. ఇందులోభాగంగా అనేక చర్యలు తీసుకున్నారు. ఈ స్టేషన్‌లో సేవలను మరింత సమర్థం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. ఆ రోజు రాత్రి పోలీసులు విధుల్లో ఉండగా స్టేషన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ఓ అపరిచిత వ్యక్తి ఫోన్‌చేసి గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడిఉన్నారంటూ సమాచారమందించాడు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. ఆ రోజు రాత్రి కర్తవ్య నిర్వహణలో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనిల్‌శర్మ ఆ తర్వాత స్టేషన్ పనితీరును మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలను మీడియాతో పంచుకున్నారు.
‘ఈ ఘటన జరి గిన 17 రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించిన అభియోగపత్రాన్ని కోర్టుకు దాఖలుచేశాం. అనంతరం ఈ స్టేషన్‌లో మౌలిక వసతులను మెరుగుపర చడం, సిబ్బంది సంఖ్యను పెంచడంపై దృష్టి సారిం చా. ఈ ఘటనకు ముందు మా స్టేషన్‌లో సిబ్బంది కొరత సమస్య ఉంది. 25 మంది మహిళలతోసహా మొత్తం 150 మంది సిబ్బంది ప్రస్తుతం ఈ స్టేష న్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏడాది క్రితం ఈ స్టేషన్‌లో ఒకే ఒక మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉంది. ఇప్పుడు మొత్తం ముగ్గురు ఉన్నారు. ఇక మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య 20కి చేరుకుంది. ఈ స్టేషన్‌లో ప్రస్తుతం అత్యవసర స్పందన వాహనాలు (ఈఆర్ వీ) రెండు అందుబాటులో ఉన్నాయి. ఇతర పోలీస్‌స్టేషన్‌లలో ఒక్కటి మాత్రమే ఉంది. పెట్రోలింగ్ బాధ్యతలను నిర్వర్తిం చేందుకు ప్రభుత్వం మూడు జిప్సీ వాహనాలను అందజేసింది. 24 గంటలపాటు సేవలందించే సత్వర స్పందన బృందం (క్యూఆర్‌టీ)తోపాటు నేరాలకు అవకాశమున్న ప్రాంతాల్లో గస్తీ కోసం ఓ వాహనాన్ని అందజేసింది. మహి ళా నిందితులను విచారించేందుకు ఈ స్టేషన్‌లో ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించాం. అంతేకాకుండా మరో లాకప్ గదిని కూడా ఏర్పాటు చేశాం.
డిసెంబర్, 16 నాటి ఘటనకు ముందు షహీద్ జీత్‌సింగ్ మార్గ్‌లో విద్యుత్ దీపాలు వెలిగేవి
కావు. ఆ ప్రాంతమంతా అంధకారంగా ఉండేది. మా చొరవతో ఇప్పుడు ఆ మార్గం విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. ఈ రోడ్డు మునిర్కా ఫ్లైఓవర్ సమీపంలోనే ఉంది. ఈ మార్గంలోనే బాధితులు ఎక్కిన బస్సు ఆ విషాద రాత్రి వచ్చింది’ అని అన్నారు. కాగా దీపాలు లేని కారణంగా చిమ్మచీకటిగా ఈ రోడ్డులో బస్సు వెళుతుండగా అందులో ఎక్కిన బాధితురాలిని దోషులు అత్యంత పాశవికంగా అనుభవించి, ఆమె వెంట ఉన్న స్నేహితుడిని హింసించి ఆ తర్వాత కిందికి తోసివేసిన సంగతి విదితమే.
ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం
ఇదే అంశంపై మరో అధికారి మాట్లాడుతూ ఈ కేసు విచారణను సత్వరమే పూర్తిచేసి, అభియోగపత్రం దాఖలు చేసేందుకు ఎన్నో ఇబ్బందులకు గురయ్యామన్నారు. కష్టాలను ఎదుర్కొన్నామన్నారు. రేయింబవళ్లూ శ్రమించడంతో తమ ప్రయత్నం సఫలమైందన్నారు. ఈ కేసును విజయవంతంగా చేధించినందుకు రివార్డు దక్కిందన్నారు.
Advertisement