ఆ హక్కు మీకెక్కడిది?
Published Sat, Oct 5 2013 11:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
న్యూఢిల్లీ: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే రోజుల్లో చాందినీ చౌక్ అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను మూసివేయాలంటూ లీలా ధార్మిక్ కమిటీ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను మూసివేయాలని కోరే హక్కు మీకెక్కడిది? అంటూ కమిటీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో రద్దీ విపరీతంగా ఉంటుందని, పార్కింగ్‌ను మూసివేయడం ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.
అంతగా కావాలనుకుంటే మీరే రామ్‌లీలా ఉత్సవాలను ఎక్కడైనా ఖాళీగా ఉన్న బహిరంగ ప్రదేశంలో నిర్వహించుకోవాలని న్యాయమూర్తులు రవీంద్ర భట్, ఎస్ మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను మూసివేయడం కుదరదని చెప్పింది. ఇదికాకుండా ఇంకెక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని మీరు చూపితే అక్కడ రామ్‌లీలాను నిర్వహించుకునేందుకు అవసరమైన అనుమతిని ఇచ్చేందుకు కోర్టు సిద్ధంగా ఉందని చెప్పింది. దీనికి కమిటీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... గత ఎనభై సంవత్సరాలుగా ఇక్కడే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, భారత రాష్ట్రపతితోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వస్తారని, వారందరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకే తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు.
దీనిపై కోర్టు స్పందిస్తూ... ఇండియాగేట్ వద్ద కూడా ఇలాంటి సమస్యే ఎదురైందని, అయినప్పటికీ ప్రజల కోసం దానిని తెరిచారని పేర్కొంది. రామ్‌లీలా నిర్వాహక కమిటీ చేసిన ఆరోపణలపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేసును ఉపసంహరించుకోవాలని కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేసిన ఎన్జీవో ప్రతినిధి తరఫు న్యాయవాదికి సూచించింది. ఇదిలాఉండగా ఎయిర్‌టెల్ మార్గంలో రిక్షాలను కూడా అనుమతించాలని కోర్టు మే 24న జారీ చేసిన ఆదేశాలను అమలు పర్చడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రజా పనుల విభాగానికి కోర్టు సమన్లు జారీ చేసింది.
Advertisement