Chandni Chowk
-
‘నా ఫోన్ దొరికింది’.. భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారి
ఢిల్లీ : భారత్‌లో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ మొబైల్ ఫోన్ దొంగతనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. థియరీ మాథౌ ఫోన్ దొంగతనం చేసిన నలుగురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.దీపావళి పండుగ నేపథ్యంలో ఫ్రెంచ్ రాయబారి థియరీ మాథౌ అక్టోబర్ 20 తన కుటుంబ సభ్యులతో కలిసి ఓల్డ్ ఢిల్లీలోని చాందినీ చౌక్ లో షాపింగ్ చేశారు. ఆ సమయంలో 20 నుంచి 25ఏళ్ల మధ్యన ఉన్న దొంగలు తమ చేతి వాటం ప్రదర్శించారు.షాపింగ్ చేస్తున్న థియరీ మాథౌ జేబులో ఉన్న ఫోన్‌ను కాజేశారు. ఫోన్ మాయ మవ్వడంతో మాథౌ ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయబార కార్యాలయం అధికారులు సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.దర్యాప్తులో భాగంగా మాథౌ షాపింగ్ చేస్తున్న ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఫోన్ నెంబర్ ఆధారంగా మాథౌ ఫోన్ ట్రేస్ చేశారు. నిన్న, ఇవాళ రెండ్రోజుల వ్యవధిలో ఫోన్ దొంగతనం చేసిన యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం థియరీ మాథౌకు ఫోన్‌ను అందించారు. దీంతో మాథౌకు సంతోషం వ్యక్తం చేశారు. -
Lok Sabha elections 2024: చాంద్నీ చౌక్ నుంచి అక్షయ్‌కుమార్ ?
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చాంద్నీ చౌక్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగొచ్చని వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పటికే పార్టీ నేతలు అక్షయ్‌ను ఒకసారి సంప్రదించారని జాతీయ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఢిల్లీలో గతంలో గెలిచిన మొత్తం 7 లోక్‌సభ స్థానాలను తిరిగి ఈసారి కూడా దక్కించుకోవాలని కమలదళం పట్టుదలతో ఉంది. సినిమాల్లోకి రాకముందు గతంలో చాలా సంవత్సరాలు ఢిల్లీ చాంద్నీ చౌక్ ప్రాంతంలో అక్షయ్‌కుమార్ నివసించారు. అందుకే స్థానికతను దృష్టిలో ఉంచుకుని అక్షయ్‌కుమార్‌ను బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అని బీజేపీ లోతైన లెక్కలు వేస్తోందని సమాచారం. గడిచిన 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ అన్నిస్థానాలను స్వీప్ చేసింది. ఈ ఏడాది అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తులు కుదరడంతో మూడు స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో ఆప్ బరిలో దిగాలని నిర్ణయించుకున్నాయి. దీంతో ఈ ఏడు స్థానాల్లో త్రిముఖపోరు కాస్తా ద్విముఖ పోరుగా మారింది. దీంతో అభ్యరి్థని మరింత ఆచితూచి ఎంపికచేయాలని బీజేపీ భావిస్తోంది. -
G20 Summit: విదేశీ అతిథుల కోసం అనువాదకులు
న్యూఢిల్లీ: జీ20 సదస్సు కోసం వచ్చి ఢిల్లీ దుకాణాల్లో, ముఖ్యంగా చాందినీ చౌక్ ప్రాంతంలో షాపింగ్ చేసే విదేశీ అతిథుల సౌకర్యం కోసం అక్కడి వర్తకులు మరో అడుగు ముందుకేశారు. షాపింగ్ సమయంలో భాషా బేధంతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు అనువాదకు(ట్రాన్స్‌లేటర్)లను సిద్ధంచేస్తున్నారు. ఇంగ్లి‹Ù, ఫ్రెంచ్, స్పానిష్ ఇలా జీ20 దేశాల్లో మాట్లాడే భాషలను అనర్గళంగా మాట్లాడి అనువదించగల 100 మంది మహిళా అనువాదకులను అక్కడి వర్తకులు రంగంలోకి దింపుతున్నారు. వీరు అందుబాటులో ఉండటంతో ఇకమీదట విదేశీ అతిథులు షాపింగ్ వేళ ఎలాంటి ఇబ్బందులు పడరని వర్తకులు చెబుతున్నారు. ఈ అనువాదకులు నిజానికి నూతన వ్యాపార వ్యవస్థాపకులు(ఎంట్రప్రెన్యూవర్స్). వీరిలో ఫ్యాషన్ డిజైనర్లు, సెలూన్, బొటిక్ యజమానులు, బ్లాగర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ‘ వీరంతా ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ తదితర భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. 8, 9, 10 తేదీల్లో ట్రేడర్లకు, అతిథులకు అనుసంధానకర్తలుగా మెలగుతారు’ అని వీరితో భాగస్వామ్యం కుదుర్చుకున్న ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) చైర్మన్ బ్రిజేష్ గోయల్ చెప్పారు. ‘ ట్రేడర్లకు సాయపడే వాలంటీర్ల జాబితాను ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖకు పంపాం. వీరు విదేశీ అతిథులకు అందుబాటులో ఉండి సాయపడతారు. దేశంలోనే షాపింగ్‌కు చిరునామాగా నిలిచే చాందీనీ చౌక్‌లో విదేశీయుల సందడి మరింత పెరగనుంది’ అని గోయల్ పేర్కొన్నారు. -
ఢిల్లీ చాందిని చౌక్ లో అగ్నిప్రమాదం
-
అయ్యో.. అల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పార్టీలు మారి ఎన్నికల బరిలో నిలిచిన 17 మందిలో 9 మంది విజయం సాధించారు. గెలుపొందిన వారిలో అత్యధికంగా 8 మంది ఆప్‌కు చెందిన వారు కాగా బీజేపీ నుంచి ఒక్కరున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఆప్ 9 మందిని, బీజేపీ నలుగురిని, కాంగ్రెస్ ముగ్గురిని బరిలోకి దించాయి. ఆప్ తరఫున పోటీ చేసిన మొత్తం 9 మందిలో అయిదుగురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పాయ్(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈయన ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరిపై 6 వేల పైచిలుకు ఓట్లతో మళ్లీ విజయం సాధించారు. మోడల్ టౌన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈసారి ఈయన్ను ఆప్‌నకు చెందిన అఖిలేశ్ త్రిపాఠీ 10వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. కాంగ్రెస్‌కు చెందిన సంజయ్ సింగ్(వికాస్పురి), సురేంద్రపాల్ సింగ్(తిమర్పూర్) ఈసారి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. వీరిద్దరినీ వరుసగా ఆప్‌కు చెందిన మహీందర్ యాదవ్(31 వేల ఓట్లు), దిలీప్ పాండే(21వేల ఓట్లు) ఓడించారు. ఎన్నికల ప్రచారంలో అల్కా లాంబా (ఫైల్) ఇతర ముఖ్యనేతల్లో ఆప్‌ను వీడి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన చాందినీచౌక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్కా లాంబా.. కాంగ్రెస్ తరఫున గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆప్ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ చేతిలో ఓడిపోయారు. అల్కాకు కేవలం 3,881 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సుమన్ కుమార్ గుప్తా 29,584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రహ్లాద్ సింగ్‌కు 50,891 ఓట్లు వచ్చాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్టు అల్కా లాంబా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయన్న దానిపై మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంటే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: ‘ఆప్’రేషన్ సప్తపది) -
మళ్లీ సొంత గూటికి చేరిన ఆల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ ఎమ్మెల్యే ఆల్కా లాంబా ఎట్టకేలకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ఇన్చార్జ్ పీసీ చాకో సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. 2014లో కాంగ్రెస్‌ను వీడిన లాంబా ఆప్‌లో చేరి.. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆమెపై ఢిల్లీ స్పీకర్ ఇటీవల అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. గత నెలలోనే ఆమె ఆప్‌కు రాజీనామా చేశారు. ఆప్‌లో రెబల్ ఎమ్మెల్యేగా ఆల్కా లాంబా పేరొందారు. అనేక సందర్భాల్లో పార్టీ నాయకత్వంపై, ఆప్ ప్రభుత్వంపై ఆమె బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఇందిరాగాంధీ హత్యానంతర సిక్కులు సామూహిక హత్యలను మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సమర్థించారని, ఆయనకు కేంద్రం ఇచ్చిన భారత రత్న అవార్డును వెనక్కు తీసుకోవాలంటూ ఢిల్లీ సర్కారు ఇటీవల అసెంబ్లీలో తీర్మానం తీసుకురాగా.. దానిని ఆల్కా లాంబా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్మానంపై విమర్శలు రావడంతో సర్కారు కూడా విరమించుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆప్ తరఫున ఆల్కా లాంబా ఢిల్లీలో ప్రచారం చేయలేదు. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్‌లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయెల్ ఆమెపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ప్రైవేట్ లాకర్లలో కోట్లాది రూపాయలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని చాందినీ చౌక్‌లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న లాకర్లలో భారీగా సొత్తు బయటపడింది. ఖారి బౌలి, చాందినీ చౌక్, నయా బజార్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ సంస్థకు చెందిన 350 లాకర్లలో డబ్బు, నగలు దాస్తుంటారు. అయితే, వ్యాపారులు పన్నులు ఎగవేసేందుకు లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఇక్కడున్న సుమారు 100 లాకర్లలో దాచి ఉంటారని ఆదాయ పన్ను శాఖ(ఐటీ) అధికారులు అనుమానిస్తున్నారు. 39 లాకర్లను తెరిచి చూడగా రూ. 30 కోట్ల నగదు బయటపడిందని, దీన్ని స్వాధీనం చేసుకున్నామని సోమవారం అధికారులు తెలిపారు. మిగతా లాకర్లను కూడా తనిఖీ చేస్తామన్నారు. అయితే, ఎలాంటి అక్రమాలు, అనధికార లావాదేవీలకు పాల్పడలేదని, తమ సంస్థకు 1992లోనే ఆర్బీఐ అనుమతి లభించిందని ఆ సంస్థ నిర్వాహకుడు స్పష్టం చేశారు. -
బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీలో పేలుడు..!
-
బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీలో పేలుడు..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాత ఢిల్లీలోని ఓ వోల్సేల్ మార్కెట్లో పేలుడు సంభవించింది. చాందినీ చౌక్ మార్కెట్ లేదా నయా బజార్‌గా పేరొందిన ప్రాంతంలో రద్దీ ప్రదేశంలో పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఈ పేలుడులో ఒకరు మృతిచెందగా.. ఐదుగురు గాయపడ్డారు. దీంతో హుటాహుటీన పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్దసంఖ్యలో టపాసుల కార్ఖానాలు ఉన్నాయి. ఒక బ్యాగులో భారీ ఎత్తున టపాసులు తరలిస్తుండగా అవి ఒక్కసారిగా పేలినట్టు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం తెలుస్తోంది. అయితే, పేలుడు ఎలా జరిగింది? కారణం ఏమిటి? అన్న దానిపై అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఫోరెన్సిక్ నిపుణులు, స్పెషల్ సెల్ దర్యాప్తు అధికారులు సంఘటనా స్థలం చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ పేలుడు ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. -
అమ్మో.. రెప్పపాటులో కత్తి పోటు తప్పింది
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ దొంగ దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఓ షాపు ముందు కాపలాగా నిద్రిస్తున్న వ్యక్తిని అమాంతం పొడిచిచంపేందుకు ప్రయత్నించాడు. దొంగ అలికిడిని రెప్పపాటులో గమనించిన కాపలా వ్యక్తి స్వల్పగాయంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ తప్పించుకున్నాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ప్రకారం ఢిల్లీలోని చాందీ చౌక్ ఏరియాలో ఓ స్టేర్ పై దుకాణం ఉంది. దాని ముందే సెక్యూరిటీ గార్డు నిద్రపోయాడు. రాత్రి సమయం కావడంతో అక్కడి మెట్లు ఎక్కి దొంగతనానికి మంకీ టీ షర్ట్ లో వచ్చిన దొంగ అక్కడ గార్డును చూసి తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని బయటకు తీశాడు. రెండు చేతులతో దాని పిడిని గట్టిగా పట్టుకున్నాడు. రెండుమూడుసార్లు కిందికి వంగి చూసి కాళ్లు, తల భాగం ఎటువైపు ఉందా అని పరిశీలించాడు. ఆ తర్వాత పైకి లేచి ఊపిరి బిగబట్టి గట్టిగా పొడిచేసే ప్రయత్నం చేశాడు. రెప్పపాటు ఆ గార్డు ఆ పోటు నుంచి తప్పించుకుని స్వల్పగాయాలతో మెట్లపై నుంచి దొర్లుతూ ఆ ప్రాంతం నుంచి పరుగెత్తాడు. దీంతో దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టీనేజీ యువకుడిలాగే ఉన్న ఆ దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఆ 'మిఠాయి' దుకాణం శాశ్వతంగా బంద్
న్యూఢిల్లీ : ఆ మిఠాయి షాపులో తయారైన జిలెబి అంటే భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయికి మహా ఇష్టం... మరో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి అయితే ఆ షాపుకు వెళ్లి మరీ మిఠాయి కొనుగోలు చేసేవారు. ప్రముఖ గాయకుడు మహ్మమద్ రఫీ అయితే కారులో వచ్చి మరీ మిఠాయిని కొని ఇంటికి కొనుక్కోని తీసుకెళ్లేవారు. ఇక దీపావళి పండగ వచ్చిందంటే.. షాపులో మిఠాయి కొనుక్కోనేందుకు నగరవాసులు కిలోమీటర్ల మేర బారులు తీరే వారు. వారిని నియంత్రించేందుకు ఢిల్లీ పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చేంది. అంత పేరు పొందిన మిఠాయి షాపు బుధవారం రాత్రి శాశ్వతంగా మూతపడింది. దేశ రాజధాని హస్తినలోని చాందినీ చౌక్‌లో అత్యంత పురాతనమైన ఘంటేవాలా మిఠాయి షాపు మూతపడింది. ఈ షాపుకు ఘనమైన చరిత్ర ఉంది. 1790లో ఢిల్లీని మొఘల్ వంశానికి చెందిన రాజు షా అలం -2 పరిపాలిస్తున్న రోజుల్లో ఈ మిఠాయి షాపును ప్రారంభించారు. దాదాపు 225 ఏళ్ల పాటు 8 తరాల పాటు తమ కుటుంబ సభ్యులు ఈ షాపును నడిపారు.... అలాంటి షాపును మూసివేస్తున్నట్లు తెలియజేయడాన్ని తనకు చాలా కష్టంగా ఉందని ఆ షాపు అధిపతి సుశాంత్ జైన్ ఫోన్లో వెల్లడించారు. పర్యాటకులను ఈ స్వీట్ షాపు అయస్కాంతంలా ఆకర్షించేదని... విదేశీ పర్యాటకులైతే ఈ షాపు ముందు మరీ సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడే వారని పక్కనే ఉన్న బట్టల షాపు ఓనర్ అశోక్ అరోరా గుర్తు చేసుకున్నారు. షాపుకు ఘంటేవాలా అనే పేరు రావడంపై అనేక అంశాలు ప్రచారంలో ఉన్నా... క్లాక్ టవర్‌కు దగ్గరగా ఉండటం వల్లే ఆ పేరు వచ్చిందని అరోరా చెప్పారు. చాందీని చౌక్‌లో రెండు ఘంటేవాలా మిఠాయి షాపులుంటే.. ఫౌంటేన్ షాపు సమీపంలోని ఘంటేవాలా షాహీ హల్వా మిఠాయి షాపును కొన్ని ఏళ్ల క్రితం మూసివేశారు. మరోకటి అదే ప్రాంతంలో రోడ్డుకు అటుపక్కనే ఉంది. దాన్ని ఇద్దరు అన్నదమ్ములు ఏర్పాటు చేసిన వారిలో ఒకరు తన వాటాను సుశాంత్‌కు విక్రయించాడు. సుశాంత్ నడుపుతున్న ఘంటేవాలా షాపులో గత దశాబ్ద కాలంగా విక్రయాలు బాగా తగ్గిపోయాయి. దీంతో షాపును మూసివేయాలని యాజమానులు నిర్ణయించారు. 1954లో మీనా కుమారి హీరోయిన్గా నటించి ఓ చిత్రం ఈ షాపు ముందే షూటింగ్ జరుపుకుంది. -
వన్‌వేగా చాందినీచౌక్ మెయిన్ రోడ్
సాక్షి, న్యూఢిల్లీ: చాందినీచౌక్ మెయిన్ రోడ్ వన్‌వేగా మారనుంది. సోమవారం నుంచి అమలులోకి వస్తుంది. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనర్ అనిల్ శుక్లా వెల్లడించారు. ఎర్రకోట నుంచి టౌన్‌హాల్, ఫతేపురి మసీదు వైపు ట్రాఫిక్‌ను అనుమతిస్తారు. కానీ వ్యతిరేకదిశలో వాహనాలను అనుమతించరు. తిరిగి వెళ్లేవారు శ్యామా ప్రసాద్ ముఖర్జీ మార్గ్ అంటే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ ముందు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఎర్రకోట చౌక్ నుంచి ఫతేపురి మసీదు వరకు ట్రాఫిక్ ఇకపై సదరన్ కేరేజ్వే గుండా వెళుతుంది. మొత్తం చాందినీచౌక్ మెయిన్ రోడ్ వన్‌వేగా మారుతోంది. సైనేజీల ఏర్పాటు వన్ వే గురించి వాహనచోదకులకు సమాచారం అందించడం కోసం చాందినీచౌక్ వద్ద పీడబ్ల్యూడీ పలుచోట్ల మ్యాపులు , సైనేజీలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం ట్రాఫిక్ సిబ్బందిని తగిన సంఖ్యలో మోహరించనున్నారు. చాందినీ చౌక్ మెయిన్ రోడ్ సదరన్ క్యారేజ్‌పై వాహనాల పార్కింగ్‌ను అనుమతించరు. వాహనాలను నిలిపి సరుకులు దింపడాన్ని ఎక్కించడాన్ని కూడా అనుమతించరు. అక్రమంగా పార్క్ చేస వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొంటారు. అటువంటి పార్కింగ్‌లపై రూ.600 జరిమానా విధిస్తారు. చురుగ్గా రోడ్డు అభివృద్ధి పనులు పీడబ్ల్యూడీ చాందినీచౌక్ అభివృద్ధి పనులు జరుపుతున్నందు వల్ల చాందినీచౌక్ మెయిన్‌రోడ్‌ను వన్‌వేగా మార్చాలని నిర్ణయించారు. ఏప్రిల్ నుంచి ఈ పనులు కొనసాగుతున్నాయి. భూగర్భంలో ఆర్సీసీ బాక్సులు పరచి విద్యుత్, టెలిఫోన్ వైర్లను అండర్‌గ్రౌండ్‌లో వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందుకోసం చాందినీచౌక్ మెయిన్‌రోడ్‌పై నార్తన్ క్యారేజ్‌వే ను కొంతమేర ట్రాఫిక్ కోసం మూసివేశారు. దాంతో చాందినీచౌక్, ఫతేపురి మసీదు మధ్య రెండు వైపులా సింగిల్ క్యారేజ్ వేపైనే వాహనాల రాకపోకలు జరుగుతన్నాయి. దాంతో సదరన్ సైడ్‌పై ట్రాపిక్ సమస్యలు అధికమయ్యాయి. ఇటువైపునే వాహనాలను కూడా పార్క్ చేయడం వల్ల రోజు భారీ ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీన్ని అధిగమించేందుకు మొత్తం చాందినీచౌక్ మెయిన రోడ్ ను సోమవారం నుంచి వన్‌వేగా మార్చాలని నిర్ణయించారు. -
గల్లీల్లో ‘సైకిల్ గస్తీ’ ..!
న్యూఢిల్లీ: ఇకపై నగరంలోని చాందినీ చౌక్ రోడ్లపై నడుస్తూ వెళుతుంటే సైకిల్‌పై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు కనిపించవచ్చు.. పార్కులు, ఇతర ప్రాంతాల్లో నేరస్తుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. దీంతో ఢిల్లీవాసుల నుంచి పలు ఫిర్యాదులు అందిన మీదట ఉత్తరజిల్లా పోలీసులు సైకిల్ పెట్రోలింగ్ ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నారు. పెట్రోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన సెర్చ్‌లైట్, ఇతర పరికరాలను ఉంచేందుకు క్యారీ బాక్స్ సైతం ఆ సైకిల్‌కు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎటువంటి రోడ్డుపైనైనా ప్రయాణం చేసేందుకు వీలుగా గేర్లు ఉన్న సైకిళ్లను సమకూర్చుకునేందుకు యోచిస్తున్నారు. కాగా, ఇప్పటికే పై తెలిపిన హంగులన్నీ ఉన్న 8 సైకిళ్లను సేకరించాలని నిర్ణయించారు. నగరంలో తెల్లవారుజామున వాకింగ్ వెళుతున్న వారిపై పార్కులు, వీధుల చివర్లలో దాడిచేసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు ఎక్కువగా ఫిర్యాదులందుతున్నాయని ఉత్తర డీసీపీ మధుర్ వర్మ తెలిపారు. చాందినీచౌక్, కొత్వాలి, సివిల్ లైన్స్, మౌరిక్ నగర్ తదితర ప్రాంతాలనుంచి ఎక్కువగా తమకు ఇటువంటి ఫిర్యాదులందుతున్నాయని ఆయన వివరించారు. కాగా, ఫిర్యాదులందుతున్న ప్రాంతాల్లోకి మోటార్ సైకిళ్లుపై కూడా వెళ్లేందుకు వీలు లేకుండా ఇరుకు సందులు ఉంటున్నాయని, దాంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో బైక్‌లపై గస్తీ తిరగడం కష్టసాధ్యమవుతోందని చెప్పారు. దీంతో సైకిళ్లపై గస్తీ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. పనిలోపనిగా సైకిల్ తొక్కితే పోలీసుల ఫిట్నెస్ కూడా మెరుగుపడుతుందని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఎర్రకోట, మోత్ రోడ్, న్యూ దరియాగంజ్ రోడ్, ఢిల్లీ చలో పార్క్, జ్ఞాన్‌పథ్, 15 ఆగస్ట్ పార్క్ వద్ద ఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పోలీసులు సైకిల్‌పై గస్తీ నిర్వహిస్తారని వర్మ తెలిపారు. దీంతోపాటు కంపెనీ బాగ్, మెట్రో పార్క్, మహిళా పార్క్, కంచన్బాగ్లలో సైతం సైకిల్ పెట్రోలింగ్ ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. ఒక సైకిల్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో గస్తీ తిరుగుతుంటే మరో సకిల్ రూప్‌నగర్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుందని పోలీసులు వివరించారు. కాగా ఢిల్లీ పోలీసులు చేస్తున్న ఈ ప్రయోగంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఇంతగా చొరవ తీసుకోవడంతో భద్రతపై తమకు భరోసా పెరుగుతోందని చెబుతున్నారు. -
నగరంలో నేరాల నియంత్రణకు మరిన్ని నిఘానేత్రాలు
నేరాల కట్టడిపై పోలీసు శాఖ దృష్టి సారించింది. ఇందులోభాగంగా నగరవ్యాప్తంగా త్వరలో పది వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర హోం శాఖ పరిశీలనలో ఉంది. సూరత్‌లో ప్రారంభించిన కమ్యూనిటీ ఆధారిత సీసీటీవీ కెమెరా ప్రాజెక్టు విజయవంతమవడంతో అదే నమూనాను ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. న్యూఢిల్లీ: నగరంలో నానాటికీ నేరాల సంఖ్య పెరిగిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో వాటిని నియంత్రించే అంశంపై దృష్టి సారించింది. ఇందులోభాగంగా త్వరలో నగరవ్యాప్తంగా పది వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాల ఏర్పాటువల్ల నేరాల నియంత్రణతోపాటు నిందితులను పట్టుకునేందుకు తగు ఆధారాలు కూడా లభిస్తాయన్నారు. నగరంలో 16 మిలియన్ల మందికిపైగా జనాభా ఉన్నారు. ఇప్పటికే నగరంలో 22 వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటయ్యాయన్నారు. వీటి ఏర్పాటువల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇందులో మొత్తం 3,586 సీసీటీవీ కెమెరాలను పోలీసు శాఖ ఏర్పాటుచేయగా మిగతావాటిని ఇతర శాఖలు అమర్చాయి. ఇక నగర పరిధిలోని మూడు కార్పొరేషన్లు 992 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాయి. ఇవి అందుబాటులో ఉండడం వల్ల నిందితులను పట్టుకోవడం మరింత సులువవుతుందన్నారు. దక్షిణ ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ హత్యకేసును సీసీటీవీ కెమెరాల్లో లభించిన ఆధారాల వల్ల ఐదుగురు నిందితులను త్వరగా గుర్తించడం, వారిని పట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ హత్య ఘటన దృశ్యాలు అనేక చానళ్లలోనూ అప్పట్లో ప్రసారమయ్యాయి. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు లేకపోయినప్పటికీ నగరవాసులు తమ తమ ఇళ్లతోపాటు పరిసర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించామని, ఇందులోని దృశ్యాలు 20 రోజులపాటు భ ద్రంగా నిక్షిప్తమవుతాయని తెలిపారు. అనేక రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, దుకాణదారులు తమ తమ దుకాణాల వద్ద వీటిని ఏర్పాటు చేసుకోవాలంటూ సూచించామన్నారు. వీరితోపాటు మాల్స్, హోటళ్ల యజమానులను కూడా ఇవే సూచనలు చేశామన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఔటర్ ఢిల్లీలో మొత్తం 4,529 సీసీటీవీ కెమెరాలు ఉండగా, అందులో పోలీసులు ఏర్పాటు చేసినవి 246 కాగా పౌర సంస్థలు అమర్చినవి 186. ఇక ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రులు, ఉన్నతాధికారులు తదితర వీఐపీలు నివసించే ప్రాంతాల్లో వీటి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. ఈ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల సంఖ్య నాలుగువందలు మాత్రమే. పార్లమెంట్‌పై 2001లో ఉగ్రవాదుల దాడి అనంతరం వీటిని ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ ఆధారిత సీసీటీవీ ప్రాజెక్టు కాగా నగరంలోని చాందినీచౌక్‌లో కమ్యూనిటీ ఆధారిత సీసీటీవీ కెమెరాల ప్రాజెక్టును లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బుధవారం ప్రారంభించనున్నారు. గుజరాత్ రాష్ర్టంలోని సూరత్ నగరంలో కూడా ఇదే తరహా ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి విదితమే. అక్కడ ప్రారంభించిన ఆ ప్రాజెక్టు విజయవంతమైంది. కాగా సూరత్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల బృందం అక్కడికి చేరుకుని పరిశీలించిన సంగతి విదితమే. నగరంలో ఈ తరహా ప్రాజెక్టును ప్రారంభించడం ఇదే తొలిసారని, పోలీసు శాఖ ప్రజాసంబంధాల అధికారి రాజన్ భగత్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నేరాల్ని కట్టడి చేయడంతోపాటు నగరవాసులకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో తమ శాఖ ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటిదాకా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరించాయని, ఇకమీదట ఇందులో ప్రజలను కూడా మరింతగా భాగస్వాములను చేయాలనేదే ఈ తరహా ప్రాజెక్టు ప్రారంభంలోని ఆంతర్యమని ఆయన వివరిం చారు. -
హాట్‌టాపిక్: ప్రతిష్టాత్మక చాందినీచౌక్
చాందినీచౌక్ చరిత్రాత్మక ప్రదేశం. మొఘల్ చక్రవర్తి షాజహాన్(1628-1658) తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాలనుకున్నప్పుడు యమునా నది తీరాన ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోటలో నివసించే వారి కోసం ఒక బజారు అవసరమని భావించిన షాజహాన్ కుమార్తె జంహా ఆరా చాందినీ చౌక్ బజార్‌కు రూపకల్పన చేశారు. చంద్రుడి వెన్నెల ప్రతిబింబించేలా అప్పట్లో ఈ బజారు మధ్యలో ఓ కొలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో కొలను పూడుకుపోయినా బజారు పేరు చాందినీ చౌక్ చిర స్థాయిగా నిలిచిపోయింది. ఢిల్లీలో ప్రసిద్ది చెందిన చాందినీచౌక్ పేరును మార్చి, సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన మూడేళ్ల క్రితం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చింది. దానిని అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. చాందినీచౌక్ పేరు మార్చడమంటే దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించినట్లుగా భావించారు. చాందినీచౌక్‌ను షాజహాన్ నిర్మించాడని, ఈ పేరును మార్చడం ఈ నగరానికి ఉన్న చరిత్రను కించపర్చడమే అవుతుందని పలువురు పేర్కొన్నారు. దేశరాజధానిలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన చాందినీచౌక్‌లోని అన్ని వ్యాపార సంస్థలను ఆన్లైన్లో పెట్టినట్లు గూగల్ ఇండియా తెలిపింది. ఇక్కడ వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 2500 వ్యాపార సంస్థలున్నాయి. వీటన్నింటికి ప్రత్యేకంగా ఒక్కో వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. చాందినీ చౌక్ ప్రాంతంలో వ్యాపారస్తులే అధికం. అందుకే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి వ్యాపారులు లేదా ఆ వర్గానికి చెందిన వారే గెలుస్తూ ఉంటారు. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత గల ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈ సారి ముగ్గురు హేమాహేమీలు పోటీపడుతున్నారు. ఈ నెల10న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తరపున కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్, బిజెపి నుంచి పార్టీ సీనియర్ నేత హర్షవర్థన్, ఆమ్ అద్మీ పార్టీ నుంచి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ యాంకర్ అషుతోష్ పోటీ చేస్తున్నారు. కపిల్ సిబల్: పంజాబ్‌కు చెందిన కపిల్ సిబల్ గత ఎన్నికలలో ఇక్కడ నుంచే గెలుపొందారు. సాదారణంగా ఇక్కడ నుంచి వ్యాపారులు లేక ఆ వర్గానికి చెందినవారే గెలుస్తూ ఉంటారు. చాందినీ చౌక్ ప్రాంతంలో పంజాబీల సంఖ్య అధికం. తన రాష్ట్ర ఓటర్ల బలంతోనే గతంలో ఆయన ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో సిబల్ మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడలేదు. పంజాబ్‌లోని ఏదో ఒక లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ఆయన కాంగ్రెస్ అధిష్టానికి చెప్పారు. ఫలితంలేదు. ఆయన మాట అధిష్టానం వినలేదు. విధిలేని పరిస్థితులలో సిబల్ మరోసారి చాందినీ చౌక్ నుంచి పోటీకి సిద్ధపడ్డారు. హర్షవర్థన్: వ్యాపార వర్గానికి చెందిన హర్షవర్ధన్ బిజెపి సీనియర్ నేత. హర్షవర్థన్ ఇటీవల ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. బిజెపికి తగిన సంఖ్యాబలం ఉంటే ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఉండేవారు. స్థానికుడైన హర్షవర్థన్‌కు ఓటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. వృత్తిపరంగా వైద్యుడైన ఆయనను మిత్రులు, ప్రత్యర్థులు కూడా ‘డాక్టర్ సాబ్’ అని పిలుస్తారు. అషుతోష్: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అషుతోష్ ప్రముఖ టీవీ చానల్లో పనిచేసి ఢిల్లీ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆ టీవీ చానల్లో యాంకర్‌గా పని చేసినంత కాలం వైశ్య కులాన్ని సూచించే పేరు ‘గుప్తా’ను పెట్టుకోలేదు. ఇప్పుడు నామినేషన్ వేసే సమయంలో మాత్రం తన పేరు చివర ‘గుప్తా’ను తగిలించుకున్నారు. చాందీనీ చౌక్‌లో గణనీయ సంఖ్యలో ఉన్న వైశ్యుల మద్దతు సంపాదించేందుకే ఆయన ‘గుప్తా’గా పరిచయం చేసుకున్నారు. ఈ ముగ్గురిలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఉన్న వ్యతిరేకత వల్ల ముస్లిం ఓట్లు తనకే పడతాయని కపిల్ సిబల్ ఆశ. వ్యాపార వర్గం ఓట్లు తనకే పడతాయన్నది హర్షవర్థన్ అభిప్రాయం. ఇక మిగిలిన సామాన్య ఓటర్ల మద్దతు తనకేనన్నది అశుతోష్ గుప్తా అంచనా. -
‘హస్తిన’లో ముక్కోణం
* ‘ఆప్’ రాకతో మారిన రాజకీయ ముఖచిత్రం * సిట్టింగ్ ఎంపీలనే బరిలోకి దించిన కాంగ్రెస్ * మోడీ ప్రభావంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ శ్రీదేవి - సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 10న జరగనున్న లోక్‌సభ ఎన్నికలు యావద్దేశానికి ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇక్కడి నుంచి స్థానాలు చేజిక్కించుకున్న పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం ఒకటిరెండు సార్లు మినహా పలుసార్లు నిజమైంది. ఢిల్లీ పరిధిలో న్యూఢిల్లీ, చాందినీచౌక్, సౌత్ ఢిల్లీ, నార్త్‌వెస్ట్ ఢిల్లీ, నార్త్ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానాలు ఉండగా, వీటిలో నార్త్‌వెస్ట్ ఢిల్లీ రిజర్వ్డ్ స్థానం. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ వాసులు ఈ ఏడు లోక్‌సభ స్థానాలనూ కాంగ్రెస్‌కే కట్టబెట్టారు. దాదాపు 1.20 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న ఢిల్లీలో 13 మంది మహిళలు సహా 150 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు వచ్చి ఉంటున్నా, ఢిల్లీ రాజకీయాల్లో కుల మతాలు ఇంకా కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. ధరల పెరుగుదల, తాగునీటి సమస్య, అధిక విద్యుత్ చార్జీలు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఢిల్లీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఇదివరకటి షీలా దీక్షిత్ సర్కారు ఇతోధికంగా కృషి చేసినా, స్థానిక సమస్యల పరిష్కారంలో వైఫల్యం కారణంగా ఓట ర్లు కాంగ్రెస్‌ను ఓడించారు. గత లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రెస్, బీజేపీలకే ఢిల్లీ రాజకీయ పోరు పరిమితమై ఉండేది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భావంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఫలితంగా ఢిల్లీలో ఈ లోక్‌సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే, ఢిల్లీలోనే ‘ఆప్’ బలంగా ఉందనేది నిరాకరించలేని సత్యం. కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా ఉంటూ వచ్చిన దళితులు, అనధికార కాలనీ వాసులను తనవైపు తిప్పుకొని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసిన ‘ఆప్’ ఇప్పుడు ముస్లింల వైపు దృష్టి సారించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో చూపినంతగా ‘ఆప్’ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 49 రోజులకే అధికారాన్ని వదిలి పలాయనం చిత్తగించిందనే విమర్శ ‘ఆప్’ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. ఢిల్లీ కాంగ్రెస్‌కు పదిహేనేళ్లుగా కేంద్ర బిందువుగా ఉన్న షీలా దీక్షిత్, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఢిల్లీ రాజకీయాల నుంచి నిష్ర్కమించి, కేరళ గవర్నర్‌గా వెళ్లిపోవడంతో, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పెద్ద దిక్కు లేకుండానే బరిలోకి దిగింది. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా, అనుభవానికే పెద్దపీట వేస్తూ సిటింగ్ ఎంపీలనే కాంగ్రెస్ బరిలోకి దించింది. ఆ నియోజకవర్గాల్లో కులాలే కీలకం వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించడంలో కులాలదే కీలక పాత్ర. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సైతం లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూపిన చరిత్ర గల సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున రమేశ్‌కుమార్, బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బిదూడీ, ‘ఆప్’ తరఫున దేవేంద్ర సెహ్రావత్ పోటీ చేస్తున్నారు. జాట్, గుజ్జర్ ఓటర్లు ఇక్కడి అభ్యర్థుల తలరాతలను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తారు. వెస్ట్ ఢిల్లీలో సిక్కుల ఓటర్లకు గాలం వేసే లక్ష్యంతో ‘ఆప్’... గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి చిదంబరంపై బూటు విసిరిన జర్నైల్ సింగ్‌ను బరిలోకి దించింది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి తనయుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మకు టికెట్టు ఇచ్చి, జాట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. మహాబల్ మిశ్రాను బరిలోకి దించిన కాంగ్రెస్, పూర్వాంచలీ ఓటర్ల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ‘ఆప్’ ప్రొఫెసర్ ఆనంద్ కుమార్‌ను నిలబెట్టింది. తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్ల నుంచి వలసవచ్చిన ఓటర్లను దృష్టిలో ఉంచుకుని భోజ్‌పురి నటుడు, గాయకుడు మనోజ్ తివారీని బీజేపీ బరిలోకి దించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ జేపీ అగర్వాల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తమ్మీద ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ ముక్కోణపు పోటీ ఉత్కంఠభరితంగా మారింది. మోడీ ప్రభంజనంపై బీజేపీ ఆశలు తమ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనమే తమను గెలిపిస్తుందని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఢిల్లీలో పార్టీకి నాయకత్వం వహిస్తున్న హర్షవర్ధన్‌కు గల ‘క్లీన్ ఇమేజ్’ కూడా పార్టీకి సానుకూలాంశంగా ఉంది. హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించింది. అయితే, స్థానికులను కాదని బయటి వారికి టికెట్లు కట్టబెట్టడంతో బీజేపీకి కార్యకర్తల అసంతృప్తి తప్పడం లేదు. స్థానికేతరులకు టికెట్లు కట్టబెట్టిన ‘ఆప్’ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందరి చూపు చాందినీచౌక్ వైపు... ఈసారి చాందినీచౌక్ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ్నుంచి కాంగ్రెస్ తరఫున తిరిగి పోటీచేస్తున్న కేంద్ర మంత్రి కపిల్ సిబల్పై బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ పోటీ చేస్తున్నారు. ఇక న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రి అజయ్ మాకేన్, బీజేపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మీనాక్షి లేఖి, ‘ఆప్’ అభ్యర్థిగా పాత్రికేయుడు ఆశిష్ ఖేతాన్ తలపడుతున్నారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా, ‘ఆప్’ నుంచి మహాత్మా గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ, బీజేపీ నుంచి మహేశ్ గిరి బరిలో ఉన్నారు. -
ఆ తప్పు మళ్లీ చేయరు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు ఓటువేసి 2004లో ప్రజలు చారిత్రాత్మకమైన తప్పు చేశారని, ఆ తప్పు మళ్లీ చేయరని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి, ద్రవ్యోల్బణం, మత రాజకీయాలు, తప్పుడు విధానాల అమలు బాగా పెరిగిపోయాయని ఆరోపించారు. కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తుందని, వాటిని పరిష్కరిస్తుందన్నారు. చాందినీచౌక్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన హర్షవర్ధన్ సోమవారం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందని, ఆ గాలికి గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం, తప్పుడు విధానాలు కూకటి వేళ్లతోసహా కదిలిపోతాయన్నారు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వానికి ఓటు వేయకుండా వామపక్ష పార్టీల మద్దతున్న కాంగ్రెస్‌కు ఓటువేసిన భారతీయులు చారిత్రాత్మక తప్పు చేశారని, ఫలితంగా పదేళ్లపాటు శిక్ష అనుభవించారన్నారు. ఈ పదేళ్లలో ప్రజలు ఎంతో జాగృతమయ్యారని, వారిలో ఎంతో మార్పు వచ్చిందని, గతంలో చేసిన తప్పును ఈసారి ఎంతమాత్రం చేయరన్నారు. గతంలో చేసిన తప్పును బ్రిటిష్‌వారు 1945లో విన్స్టన్ చర్చిల్‌కు ఓటువేయడం ద్వారా సరిదిద్దుకున్నారని, ఆ తర్వాత చర్చిల్ రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్ను గెలిపించాడన్నారు. 2000 సంవత్సరంలో అమెరికన్లు బుష్‌ను గెలిపించి, అల్ గోరేను ఓడించడం ద్వారా తప్పు చేశారని, అందుకు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారంటూ మరో ఉదాహరణనిచ్చారు. భారత ప్రధానుల్లో వాజపేయి ఎంతో గొప్పవాడని, అటువంటి వ్యక్తిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నామన్నారు. అయినా ప్రజల తీర్పును గౌరవించి పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నామని, సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేశామన్నా రు. కాంగ్రెస్, ఆప్‌లు తమ విజయాన్ని అడ్డుకునేం దుకు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయన్నారు. పక్కా ప్రణాళికతో ప్రచారం.. దేశవ్యాప్తంగా బీజేపీ పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తోందని, ప్రచారాంశాలను నాలుగు భాగాలుగా విభజించామని వర్ధన్ చెప్పారు. సుపరిపాలన అందిస్తామని, ఆర్థిక వృద్ధిని సాధిస్తామనేది తమ మొదటి హామీ అని, అందుకు గుజరాత్, మధ్యప్రదేశ్‌లను ఉదాహరణగా చూపుతున్నామన్నారు. ఇక ఈ గవర్ననెన్స్ ద్వారా పారదర్శక పాలనను అందిస్తామనేది మరో కీలక ప్రచారాంశంగా వర్ధన్ చెప్పారు. పాకిస్థాన్, చైనా నుంచి పొంచిఉన్న ముప్పును తిప్పికొట్టి, దేశప్రజల్లో భద్రతపై భరోసా కల్పించేది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, అందుకే ప్రచారాంశాల్లో దానిని కూడా చేర్చామని చెప్పారు. -
ప్రచార సమరం!
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. బీజేపీ ప్రదాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ నగరంలో మార్చి 26న భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో బీజేపీ ప్రచారానికి ఊపందిస్తుందని పార్టీ భావిస్తోంది. శాస్త్రిపార్క్‌లో నిర్వహించే మోడీ ర్యాలీ ద్వారా నార్త్ ఈస్ట్ ఢిల్లీతోపాటు ఈస్ట్ ఢిల్లీ, చాందినీచౌక్ ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. శాస్త్రిపార్క్ ప్రాంతం చిన్నది కావడం వల్ల నగరంలోని మిగతా నియోజకవర్గాల్లో మోడీ ర్యాలీని ప్రసారం చేయడానికి ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చనున్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేస్తోన్న బీజేపీ అభ్యర్థులను మోడీ ఈ ర్యాలీలో పరి చయం చేస్తారని అంటున్నారు. నిజాయితీపరుడని హర్షవర్ధన్‌కు ఉన్న పేరుతో మధ్యతరగతి ఓటర్లను ఆకట్టకోవడానికి మోడీ ప్రయత్నిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చాందినీచౌక్‌లో హర్షవర్ధన్ విజయం కోసం ప్రత్యేకంగా శ్రమించవలసి ఉం టుందని బీజేపీ గుర్తించింది. ఆయన బలమైన అభ్యర్థి అయినప్పటికీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ నుంచి వర్ధన్‌కు గట్టిపోటీ ఉంటుంది. ఆమ్ ఆద్మీ పా ర్టీ అభ్యర్థి ఆశుతోష్ కన్నా కపిల్ సిబలే తమ ప్రధాన ప్రత్యర్థని బీజేపీ నాయకులు చెబుతున్నారు. చాందినీచౌక్‌లో గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న బీజేపీ న్యూఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమనిపించడం లేదని, మరింత శ్రమించాల్సిందిగా ఆర్ఎస్ఎస్ సూచించిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ నుంచి మీనాక్షీ లేఖీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఉదిత్‌రాజ్ బీజేపీ తరఫున పోటీచేస్తున్నారు. ఈ నెల 30 సోనియా ర్యాలీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ నెల 30న ఢిల్లీలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తారని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. రాజధానిలో బీజేపీ, ఆప్‌ల బలం దారుణంగా పడిపోయిందన్నారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ తొలి విడత ప్రచారం ముగిసిందన్నారు. రెండోదశ ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ నేతృత్వంలో ర్యాలీని కరోల్‌బాగ్‌లోని అజ్మల్‌ఖాన్ పార్క్‌లో సాయంత్రం నాలుగింటికి నిర్వహిస్తామని లవ్లీ వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని కేంద్రమంత్రి కృష్ణాతీరథ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చరణ్‌సింగ్ కండేరా ఈ సందర్భంగా తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఏప్రిల్ మొదటివారం నుంచి కేజ్రీవాల్ ప్రచారం ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 1 నుంచి 8 వరకు ఢిల్లీలో పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. పొరుగున ఉన్న హర్యానాతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన ఇంతవరకు ఢిల్లీలో ప్రచారం చేయలేదు. కేజ్రీవాల్ ప్రచారం చేయపోవడంపై ఆప్ అభ్యర్థులు, కార్యకర్తలు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ ప్రచారానికి ఎందుకు రావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. కేజ్రీవాల్ ప్రచారం వల్ల తమ గెలుపు అవకాశాలు మెరుగవుతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. కేజ్రీవాల్ మంగళవారం వారణాసిలో ప్రచారం చేస్తారు. తదనంతరం మూడు రోజులపాటు హర్యానాలో ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 1 నుంచి ప్రచారం ఆఖరి తేదీ వరకు..అంటే ఏప్రిల్ 8 వరకు ఆయన ఢిల్లీలో ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. -
ఆ హక్కు మీకెక్కడిది?
న్యూఢిల్లీ: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగే రోజుల్లో చాందినీ చౌక్ అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను మూసివేయాలంటూ లీలా ధార్మిక్ కమిటీ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను మూసివేయాలని కోరే హక్కు మీకెక్కడిది? అంటూ కమిటీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో రద్దీ విపరీతంగా ఉంటుందని, పార్కింగ్‌ను మూసివేయడం ద్వారా ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. అంతగా కావాలనుకుంటే మీరే రామ్‌లీలా ఉత్సవాలను ఎక్కడైనా ఖాళీగా ఉన్న బహిరంగ ప్రదేశంలో నిర్వహించుకోవాలని న్యాయమూర్తులు రవీంద్ర భట్, ఎస్ మురళీధర్‌లతో కూడిన ధర్మాసనం సూచించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను మూసివేయడం కుదరదని చెప్పింది. ఇదికాకుండా ఇంకెక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని మీరు చూపితే అక్కడ రామ్‌లీలాను నిర్వహించుకునేందుకు అవసరమైన అనుమతిని ఇచ్చేందుకు కోర్టు సిద్ధంగా ఉందని చెప్పింది. దీనికి కమిటీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... గత ఎనభై సంవత్సరాలుగా ఇక్కడే ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, భారత రాష్ట్రపతితోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వస్తారని, వారందరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకే తాము కోర్టును ఆశ్రయించామని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ... ఇండియాగేట్ వద్ద కూడా ఇలాంటి సమస్యే ఎదురైందని, అయినప్పటికీ ప్రజల కోసం దానిని తెరిచారని పేర్కొంది. రామ్‌లీలా నిర్వాహక కమిటీ చేసిన ఆరోపణలపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేసును ఉపసంహరించుకోవాలని కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేసిన ఎన్జీవో ప్రతినిధి తరఫు న్యాయవాదికి సూచించింది. ఇదిలాఉండగా ఎయిర్టెల్ మార్గంలో రిక్షాలను కూడా అనుమతించాలని కోర్టు మే 24న జారీ చేసిన ఆదేశాలను అమలు పర్చడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రజా పనుల విభాగానికి కోర్టు సమన్లు జారీ చేసింది.