న్యూఢిల్లీ: ఇకపై నగరంలోని చాందినీ చౌక్ రోడ్లపై నడుస్తూ వెళుతుంటే సైకిల్‌పై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు కనిపించవచ్చు.. పార్కులు, ఇతర ప్రాంతాల్లో నేరస్తుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. దీంతో ఢిల్లీవాసుల నుంచి పలు ఫిర్యాదులు అందిన మీదట ఉత్తరజిల్లా పోలీసులు సైకిల్ పెట్రోలింగ్ ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నారు. పెట్రోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన సెర్చ్‌లైట్, ఇతర పరికరాలను ఉంచేందుకు క్యారీ బాక్స్ సైతం ఆ సైకిల్‌కు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎటువంటి రోడ్డుపైనైనా ప్రయాణం చేసేందుకు వీలుగా గేర్లు ఉన్న సైకిళ్లను సమకూర్చుకునేందుకు యోచిస్తున్నారు. కాగా, ఇప్పటికే పై తెలిపిన హంగులన్నీ ఉన్న 8 సైకిళ్లను సేకరించాలని నిర్ణయించారు.
నగరంలో తెల్లవారుజామున వాకింగ్ వెళుతున్న వారిపై పార్కులు, వీధుల చివర్లలో దాడిచేసి చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు ఎక్కువగా ఫిర్యాదులందుతున్నాయని ఉత్తర డీసీపీ మధుర్ వర్మ తెలిపారు. చాందినీచౌక్, కొత్వాలి, సివిల్ లైన్స్, మౌరిక్ నగర్ తదితర ప్రాంతాలనుంచి ఎక్కువగా తమకు ఇటువంటి ఫిర్యాదులందుతున్నాయని ఆయన వివరించారు. కాగా, ఫిర్యాదులందుతున్న ప్రాంతాల్లోకి మోటార్ సైకిళ్లుపై కూడా వెళ్లేందుకు వీలు లేకుండా ఇరుకు సందులు ఉంటున్నాయని, దాంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో బైక్‌లపై గస్తీ తిరగడం కష్టసాధ్యమవుతోందని చెప్పారు. దీంతో సైకిళ్లపై గస్తీ ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. పనిలోపనిగా సైకిల్ తొక్కితే పోలీసుల ఫిట్‌నెస్ కూడా మెరుగుపడుతుందని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు.
ఎర్రకోట, మోత్ రోడ్, న్యూ దరియాగంజ్ రోడ్, ఢిల్లీ చలో పార్క్, జ్ఞాన్‌పథ్, 15 ఆగస్ట్ పార్క్ వద్ద ఉదయం 8 గంటల నుంచి 10 గంటలవరకు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పోలీసులు సైకిల్‌పై గస్తీ నిర్వహిస్తారని వర్మ తెలిపారు. దీంతోపాటు కంపెనీ బాగ్, మెట్రో పార్క్, మహిళా పార్క్, కంచన్‌బాగ్‌లలో సైతం సైకిల్ పెట్రోలింగ్ ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. ఒక సైకిల్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో గస్తీ తిరుగుతుంటే మరో సకిల్ రూప్‌నగర్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుందని పోలీసులు వివరించారు. కాగా ఢిల్లీ పోలీసులు చేస్తున్న ఈ ప్రయోగంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఇంతగా చొరవ తీసుకోవడంతో భద్రతపై తమకు భరోసా పెరుగుతోందని చెబుతున్నారు.
గల్లీల్లో ‘సైకిల్ గస్తీ’ ..!
Published Wed, Sep 3 2014 10:23 PM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM
Advertisement