
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ ఎమ్మెల్యే ఆల్కా లాంబా ఎట్టకేలకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ఇన్‌చార్జ్ పీసీ చాకో సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. 2014లో కాంగ్రెస్‌ను వీడిన లాంబా ఆప్‌లో చేరి.. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆమెపై ఢిల్లీ స్పీకర్ ఇటీవల అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.
గత నెలలోనే ఆమె ఆప్‌కు రాజీనామా చేశారు. ఆప్‌లో రెబల్ ఎమ్మెల్యేగా ఆల్కా లాంబా పేరొందారు. అనేక సందర్భాల్లో పార్టీ నాయకత్వంపై, ఆప్ ప్రభుత్వంపై ఆమె బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఇందిరాగాంధీ హత్యానంతర సిక్కులు సామూహిక హత్యలను మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సమర్థించారని, ఆయనకు కేంద్రం ఇచ్చిన భారత రత్న అవార్డును వెనక్కు తీసుకోవాలంటూ ఢిల్లీ సర్కారు ఇటీవల అసెంబ్లీలో తీర్మానం తీసుకురాగా.. దానిని ఆల్కా లాంబా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్మానంపై విమర్శలు రావడంతో సర్కారు కూడా విరమించుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆప్ తరఫున ఆల్కా లాంబా ఢిల్లీలో ప్రచారం చేయలేదు. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్‌లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయెల్ ఆమెపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment