ఆ తప్పు మళ్లీ చేయరు! | Harshvardhan Elections Campaign in Chandni Chowk | Sakshi

ఆ తప్పు మళ్లీ చేయరు!

Apr 7 2014 10:40 PM | Updated on Aug 29 2018 8:54 PM

కాంగ్రెస్‌కు ఓటువేసి 2004లో ప్రజలు చారిత్రాత్మకమైన తప్పు చేశారని, ఆ తప్పు మళ్లీ చేయరని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు ఓటువేసి 2004లో ప్రజలు చారిత్రాత్మకమైన తప్పు చేశారని, ఆ తప్పు మళ్లీ చేయరని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి, ద్రవ్యోల్బణం, మత రాజకీయాలు, తప్పుడు విధానాల అమలు బాగా పెరిగిపోయాయని ఆరోపించారు. కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తుందని, వాటిని పరిష్కరిస్తుందన్నారు. చాందినీచౌక్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన హర్షవర్ధన్ సోమవారం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందని, ఆ గాలికి గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో పేరుకుపోయిన అవినీతి, లంచగొండితనం, తప్పుడు విధానాలు కూకటి వేళ్లతోసహా కదిలిపోతాయన్నారు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వానికి ఓటు వేయకుండా వామపక్ష పార్టీల మద్దతున్న కాంగ్రెస్‌కు ఓటువేసిన భారతీయులు చారిత్రాత్మక తప్పు చేశారని, ఫలితంగా పదేళ్లపాటు శిక్ష అనుభవించారన్నారు. 
 
 ఈ పదేళ్లలో ప్రజలు ఎంతో జాగృతమయ్యారని, వారిలో ఎంతో మార్పు వచ్చిందని, గతంలో చేసిన తప్పును ఈసారి ఎంతమాత్రం చేయరన్నారు. గతంలో చేసిన తప్పును బ్రిటిష్‌వారు 1945లో విన్‌స్టన్ చర్చిల్‌కు ఓటువేయడం ద్వారా సరిదిద్దుకున్నారని, ఆ తర్వాత చర్చిల్ రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ను గెలిపించాడన్నారు. 2000 సంవత్సరంలో అమెరికన్లు బుష్‌ను గెలిపించి, అల్ గోరేను ఓడించడం ద్వారా తప్పు చేశారని, అందుకు ఇప్పుడు ప్రతిఫలం అనుభవిస్తున్నారంటూ మరో ఉదాహరణనిచ్చారు. భారత ప్రధానుల్లో వాజపేయి ఎంతో గొప్పవాడని, అటువంటి వ్యక్తిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నామన్నారు. అయినా ప్రజల తీర్పును గౌరవించి పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నామని, సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేశామన్నా రు. కాంగ్రెస్, ఆప్‌లు తమ విజయాన్ని అడ్డుకునేం దుకు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాయన్నారు. 
 
 పక్కా ప్రణాళికతో ప్రచారం..
 దేశవ్యాప్తంగా బీజేపీ పక్కా ప్రణాళికతో ప్రచారం చేస్తోందని, ప్రచారాంశాలను నాలుగు భాగాలుగా విభజించామని వర్ధన్ చెప్పారు. సుపరిపాలన అందిస్తామని, ఆర్థిక వృద్ధిని సాధిస్తామనేది తమ మొదటి హామీ అని, అందుకు గుజరాత్, మధ్యప్రదేశ్‌లను ఉదాహరణగా చూపుతున్నామన్నారు. ఇక ఈ గవర్ననెన్స్ ద్వారా పారదర్శక పాలనను అందిస్తామనేది మరో కీలక ప్రచారాంశంగా వర్ధన్ చెప్పారు. పాకిస్థాన్, చైనా నుంచి పొంచిఉన్న ముప్పును తిప్పికొట్టి, దేశప్రజల్లో భద్రతపై భరోసా కల్పించేది బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని ప్రజలు బలంగా నమ్ముతున్నారని, అందుకే ప్రచారాంశాల్లో దానిని కూడా చేర్చామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement