నేరాల కట్టడిపై పోలీసు శాఖ దృష్టి సారించింది. ఇందులోభాగంగా నగరవ్యాప్తంగా త్వరలో పది వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర హోం శాఖ పరిశీలనలో ఉంది. సూరత్‌లో ప్రారంభించిన కమ్యూనిటీ ఆధారిత సీసీటీవీ కెమెరా ప్రాజెక్టు విజయవంతమవడంతో అదే నమూనాను ఇక్కడ కూడా అమలు చేయనున్నారు.
న్యూఢిల్లీ: నగరంలో నానాటికీ నేరాల సంఖ్య పెరిగిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో వాటిని నియంత్రించే అంశంపై దృష్టి సారించింది. ఇందులోభాగంగా త్వరలో నగరవ్యాప్తంగా పది వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాల ఏర్పాటువల్ల నేరాల నియంత్రణతోపాటు నిందితులను పట్టుకునేందుకు తగు ఆధారాలు కూడా లభిస్తాయన్నారు. నగరంలో 16 మిలియన్‌ల మందికిపైగా జనాభా ఉన్నారు. ఇప్పటికే నగరంలో 22 వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటయ్యాయన్నారు. వీటి ఏర్పాటువల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
ఇందులో మొత్తం 3,586 సీసీటీవీ కెమెరాలను పోలీసు శాఖ ఏర్పాటుచేయగా మిగతావాటిని ఇతర శాఖలు అమర్చాయి. ఇక నగర పరిధిలోని మూడు కార్పొరేషన్లు 992 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాయి. ఇవి అందుబాటులో ఉండడం వల్ల నిందితులను పట్టుకోవడం మరింత సులువవుతుందన్నారు. దక్షిణ ఢిల్లీలో ఇటీవల జరిగిన ఓ హత్యకేసును సీసీటీవీ కెమెరాల్లో లభించిన ఆధారాల వల్ల ఐదుగురు నిందితులను త్వరగా గుర్తించడం, వారిని పట్టుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ హత్య ఘటన దృశ్యాలు అనేక చానళ్లలోనూ అప్పట్లో ప్రసారమయ్యాయి. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు లేకపోయినప్పటికీ నగరవాసులు తమ తమ ఇళ్లతోపాటు పరిసర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించామని, ఇందులోని దృశ్యాలు 20 రోజులపాటు భ ద్రంగా నిక్షిప్తమవుతాయని తెలిపారు.
అనేక రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, దుకాణదారులు తమ తమ దుకాణాల వద్ద వీటిని ఏర్పాటు చేసుకోవాలంటూ సూచించామన్నారు. వీరితోపాటు మాల్స్, హోటళ్ల యజమానులను కూడా ఇవే సూచనలు చేశామన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఔటర్ ఢిల్లీలో మొత్తం 4,529 సీసీటీవీ కెమెరాలు ఉండగా, అందులో పోలీసులు ఏర్పాటు చేసినవి 246 కాగా పౌర సంస్థలు అమర్చినవి 186. ఇక ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రులు, ఉన్నతాధికారులు తదితర వీఐపీలు నివసించే ప్రాంతాల్లో వీటి సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. ఈ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల సంఖ్య నాలుగువందలు మాత్రమే. పార్లమెంట్‌పై 2001లో ఉగ్రవాదుల దాడి అనంతరం వీటిని ఏర్పాటు చేశారు.
కమ్యూనిటీ ఆధారిత సీసీటీవీ ప్రాజెక్టు
కాగా నగరంలోని చాందినీచౌక్‌లో కమ్యూనిటీ ఆధారిత సీసీటీవీ కెమెరాల ప్రాజెక్టును లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బుధవారం ప్రారంభించనున్నారు. గుజరాత్ రాష్ర్టంలోని సూరత్ నగరంలో కూడా ఇదే తరహా ప్రాజెక్టును ప్రారంభించిన సంగతి విదితమే. అక్కడ ప్రారంభించిన ఆ ప్రాజెక్టు విజయవంతమైంది. కాగా సూరత్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారుల బృందం అక్కడికి చేరుకుని పరిశీలించిన సంగతి విదితమే. నగరంలో ఈ తరహా ప్రాజెక్టును ప్రారంభించడం ఇదే తొలిసారని, పోలీసు శాఖ ప్రజాసంబంధాల అధికారి రాజన్ భగత్ వెల్లడించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నేరాల్ని కట్టడి చేయడంతోపాటు నగరవాసులకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో తమ శాఖ ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటిదాకా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకయ్యే ఖర్చును ప్రభుత్వాలే భరించాయని, ఇకమీదట ఇందులో ప్రజలను కూడా మరింతగా భాగస్వాములను చేయాలనేదే ఈ తరహా ప్రాజెక్టు ప్రారంభంలోని ఆంతర్యమని ఆయన వివరిం చారు.
నగరంలో నేరాల నియంత్రణకు మరిన్ని నిఘానేత్రాలు
Published Tue, Aug 12 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement