అల్కా లాంబా (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పార్టీలు మారి ఎన్నికల బరిలో నిలిచిన 17 మందిలో 9 మంది విజయం సాధించారు. గెలుపొందిన వారిలో అత్యధికంగా 8 మంది ఆప్‌కు చెందిన వారు కాగా బీజేపీ నుంచి ఒక్కరున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఆప్ 9 మందిని, బీజేపీ నలుగురిని, కాంగ్రెస్ ముగ్గురిని బరిలోకి దించాయి. ఆప్ తరఫున పోటీ చేసిన మొత్తం 9 మందిలో అయిదుగురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.
గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పాయ్(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈయన ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరిపై 6 వేల పైచిలుకు ఓట్లతో మళ్లీ విజయం సాధించారు. మోడల్ టౌన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈసారి ఈయన్ను ఆప్‌నకు చెందిన అఖిలేశ్ త్రిపాఠీ 10వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. కాంగ్రెస్‌కు చెందిన సంజయ్ సింగ్(వికాస్‌పురి), సురేంద్రపాల్ సింగ్(తిమర్‌పూర్) ఈసారి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. వీరిద్దరినీ వరుసగా ఆప్‌కు చెందిన మహీందర్ యాదవ్(31 వేల ఓట్లు), దిలీప్ పాండే(21వేల ఓట్లు) ఓడించారు.
ఎన్నికల ప్రచారంలో అల్కా లాంబా (ఫైల్)
ఇతర ముఖ్యనేతల్లో ఆప్‌ను వీడి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన చాందినీచౌక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్కా లాంబా.. కాంగ్రెస్ తరఫున గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆప్ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ చేతిలో ఓడిపోయారు. అల్కాకు కేవలం 3,881 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సుమన్ కుమార్ గుప్తా 29,584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రహ్లాద్ సింగ్‌కు 50,891 ఓట్లు వచ్చాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్టు అల్కా లాంబా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయన్న దానిపై మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంటే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
(చదవండి: ‘ఆప్’రేషన్ సప్తపది)
Comments
Please login to add a commentAdd a comment