ప్రచారానికి క్షురకులను సైతం వాడుకోనున్న కమలం
న్యూఢిల్లీ: ఈసారి మీరు క్షౌరశాలకు వెళ్లినపుడు బీజేపీ గొప్పదనం గురించి ఒకవేళ సదరు దుకాణ యజమాని కనుక వివరిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోనుకాకండి. ఎందుకంటే త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమ ల దళం అందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తోంది.
ఇందులోభాగంగా ఈసారి క్షురకుల సేవలను సైతం వినియోగించుకోనుంది. వారితో నూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయమై ఆ పార్టీ బార్బర్ సెల్ అధ్యక్షుడు విజేందర్‌సింగ్ మాట్లాడుతూ నగరపరిధిలో దాదాపు 20 వేలమంది క్షురకులున్నారన్నారు. ‘మాది పెద్ద నెట్‌వర్క్. బీజేపీకి గరిష్టంగా ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు శ్రమిస్తాం. ఢిల్లీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఇక్కడ సుస్థిర ప్రభుత్వ ఎంతో అవసరం’ అని అన్నారు.
ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోలేదు
‘బార్బర్ సెల్ సభ్యత్వ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తాం. క్షౌరశాలలకు వచ్చేవారికి క్షౌర విభాగం సభ్యులు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తారు. మా సమాజాన్ని ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదు. మా సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతాం. హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు క్షురకుల కోసం ఇప్పటికే ప్రత్యేక బోర్డులను ఏర్పాటుచేశాయి.’
త్వరలో ప్రచారసామగ్రి అందజేత
నగరంలోని క్షురకులకు బీజేపీ రాష్ట్ర శాఖ పోస్టర్లు, పాంప్లేట్లు, బ్యానర్లు తదితర ప్రచార సామగ్రిని అందజేయనుంది. ఈ విషయమై విజేందర్ మాట్లాడుతూ ‘నగరానికి చెందిన క్షురకులకు సోమవారం ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించాం. ప్రభుత్వం సాధించిన పురోగతిని వారితో ప్రచారం చేయిస్తాం’అని అన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది.
ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్‌జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎన్నికల ఎత్తుగడల్ ఎన్నెన్నో విధముల్
Published Thu, Nov 13 2014 12:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement