న్యూఢిల్లీ: వాహానాలు పోగొట్టుకున్న బాధితులు ఆన్‌లైన్ ద్వారా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేలా ఢిల్లీ పోలీసులు విధివిధానాలను సిద్ధం చేస్తున్నారు. అపహరణకు గురైన బండిని దాని నంబర్ ఆధారంగా వెతికి, దొరికిన వాహనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే మొబైల్ ఫోన్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు తదితర వస్తువులను పోగొట్టుకున్నవారు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ పోలీసులు అవకాశం కల్పించారు. తాజాగా వాహానాలను పొగొట్టుకున్నవారి కోసం కూడా ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్. బస్సీ తెలిపారు.
బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్ దానంతటదే నమోదవుతుందని, ఆ వెంటనే సమాచారం అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్లిపోతుందని, పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను(నంబర్లు, వాహనం ఫొటోతో సహా) ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు పెడతామని బస్సీ స్పష్టం చేశారు. ఆన్ లైన్ ద్వారా ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసే విధానం వల్ల ఫిర్యాదులు చేసే ప్రక్రియ మరింత సరళతరమవుతుందన్నారు. ఢిల్లీ పోలీసుల వద్ద ఇప్పటిదాకా వాహనచోరీలకు సంబంధించి 10,357 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఇవికాకుండా భారత శిక్షాస్మృతి చట్టంలోని నిబంధనల ప్రకారం 71,523 నమోదైన కేసులు నమోదయ్యాయని, దీంతో వాహానాల చోరీలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉండడంతో ఈ పద్ధతి ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు బస్సీ చెప్పారు. ఢిల్లీలో నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, తాజాగా తీసుకున్న నిర్ణయంతో వాహనాలు పోగొట్టుకున్న వారు ఎక్కువ శ్రమ పడకుండా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండానే పోయిన వాహనానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెప్పారు.
వాహనాలను పోగొట్టుకున్న బాధితులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు
Published Wed, Sep 10 2014 10:25 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement