- వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సదస్సులో గవర్నర్ భరద్వాజ్
సాక్షి, బెంగళూరు : దేశానికి స్వాతంత్య్రం వచ్చి సంవత్సరాలు గడచినా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్‌గాంధీ వైద్య విశ్వవిద్యాలయంలో సోమవారం ప్రారంభమైన వైద్య విశ్వవిద్యాలయాల జాతీయ సదస్సు కార్యక్రమంలో వుఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... చాలా మంది వైద్యులు సంపాదనే ధేయంగా పనిచేస్తున్నారన్నారు.
దీంతో నగర, పట్టణప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రులను స్థాపించడం, లేకుంటే కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడానికి మొగ్గు చూపుతున్నారు తప్పితే గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఉత్తమ వైద్య సేవలు అందజేయాల్సిన బాధ్యత ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందన్నారు.
ఈ విషయంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయమన్నారు. ప్రజల జీవన శైలి మారుతున్న తరుణంలో నూతన వ్యాధులు కూడా సంక్రమిస్తున్నాయన్నారు. ఈ విషయమై విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు ఎక్కువ దృష్టి సారించి వ్యాధులకు చికిత్స విధానాలు కనుగొనాల్సి ఉందన్నారు. అంతేకాకుండా పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎక్కువగా విశ్వవిద్యాలయాలపై ఉంటుందన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఉమాశ్రీకి పీహెచ్‌డీ పట్టా అందించడం కోసం మైసూరు ఓపెన్ యూనివర్శిటీ కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకువ చ్చిందనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే వర్శిటీ రోజువారి విధుల్లో చాన్స్‌లర్ హోదాలో ఉన్న తాను తలదూర్చనని చెప్పుకొచ్చారు. బెంగళూరు యూనివర్శిటీ వైస్‌చాన్స్‌లర్ తిమ్మేగౌడ సమర్థుడని, సొమ్ములకు పట్టాలు విక్రయించే సంఘటనలు పునరావృతం కాకుండా ఆయన చర్యలు తీసుకుంటారని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు గవర్నర్ భరద్వాజ్ సమాధానం ఇచ్చారు.