
దర్శకుడు నమ్మించి మోసం చేశాడు
దర్శకుడు నన్ను నమ్మించి మోసం చేశారంటూ యువనటి ఆనంది వాపోయింది. కయల్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ అమ్మడు తాజాగా నటిస్తున్న చిత్రం చండివీరన్. అధర్వ హీరో, దర్శకుడు బాలా తన బి.స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సర్గుణం దర్శకుడు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం చెన్నైలో జరిగింది. చిత్ర హీరో అధర్వ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం తనకు రెండు అవార్డులు లభించినట్లు భావిస్తున్నానన్నారు.
ఒకటి దర్శకుడు బాలా నిర్మిస్తున్న చిత్రంలో నటించడం రెండవది సర్గుణం దర్శకత్వంలో చేయడం అన్నారు. ఈ చిత్ర నాయకి ఆనంది గురించి చెప్పే తీరాలన్నారు. ఆమెది చిన్నపిల్లల మనస్థత్వం అన్నారు. దర్శకుడితో నృత్యం చేసేలా పాట కావాలని ఆనంది అడిగిందన్నారు. దాంతో సంగీత దర్శకుడు అరుణగిరి నృత్యభరిత పాటకు బాణీలు కడుతున్నారని ఆ పాటను న్యూజిల్యాండ్‌లో చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పడంతో ఆనంది చాలా ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపారు.
అయితే ఆనందిని ఉత్సాహపరచడానికే దర్శకుడు అలా చెప్పారని అధర్వ వెల్లడించారు. ఆనంది మాట్లాడుతూ దర్శకుడు తనను న్యూజి ల్యాండ్ తీసుకెళతానని చెప్పడంతో ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొన్నాను. చివరకు తనను న్యూజి ల్యాండ్‌కు తీసుకెళ్లలేదు. దర్శకుడు మోసం చేశారంటూ ఆనంది బుంగ మూతి పెట్టుకుంది.