
ప్రభుత్వాన్ని సాగనంపండి
తమిళనాడును ప్రశాంతత లేని రాష్ట్రంగా తయారుచేసిన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే కోశాధికారి స్టాలిన్ కడలూరు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిచ్చారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:కడలూరు జిల్లా పరంగిపేటలో శనివారం రాత్రి జరిగిన భారీ బహిరంగ సభలో స్టాలిన్ ప్రసంగిస్తూ, డీఎంకే అభిమానులు, సానుభూతిపరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి పథకం ప్రకారం తొలగించే కార్యక్రమం రాష్ట్రంలో సాగుతోందని ఆరోపించారు. అన్నాడీఎంకే వారిని పెద్దశాతంలో జాబితాలో చేరుస్తున్నారని అన్నారు. ప్రతి వార్డులో ప్రతి 10-15 ఓట్లలో కనీసం ఇద్దరిని తొలగిస్తున్నట్లుగా తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. డీఎంకే హయాంలో ప్రభుత్వ పథకాల్లో పేద, బలహీన బడుగు వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లకు అమ్మ ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు.
గత డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లగా ఆ పథకాలకు తమ పేర్లు పెట్టుకుని అన్నాడీఎంకే పబ్బం గడుపుకుంటోందని ఎద్దేవా చేశారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలే ఏర్పడలేదని ఆయన అన్నారు. అసెంబ్లీలో 236 పథకాలను ప్రకటించగా ఇంతవరకు ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని ఆయన చెప్పారు. గత నాలుగేళ్ల అన్నాడీఎంకే పాలనతో ప్రజలు ఆవేదన అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతలు సున్నాగా మారాయని విమర్శించారు. ప్రగతి, ప్రశాంతతో కూడిన రాష్ట్రం కావాలంటే అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆగ్రహావేశాలతో సాగిన స్టాలిన్ ప్రసంగాన్ని లక్షలాది మంది ప్రజలు ఆసక్తితో తిలకించారు.