సాక్షి, చెన్నై: డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఆదివారం 63వవసంతంలోకి అడుగు పెట్టారు. తన తండ్రి, పార్టీ అధినేత ఎం.కరుణానిధి, కుటుంబీకుల సమక్షంలో, అభిమానుల కోలాహలం మధ్య బర్త్‌డేను స్టాలిన్ ఘనంగా జరుపుకున్నారు. దళపతి బర్త్‌డేను పురస్కరించుకుని వాడ వాడల్లో డీఎంకే వర్గాలు వేడుకల్ని ఘనంగా నిర్వహించాయి. ఎం కరుణానిధి వారసుడిగా రాజకీయాల్లో ఎదిగిన ఎంకే స్టాలిన్ పార్టీ బలోపేతం లక్ష్యంగా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అధినేత కరుణానిధి దూతగా పార్టీ బాధ్యతల్ని తన భుజాన వేసుకుని ముందుకు సాగుతున్నారు. అశేష అభిమానుల్ని, మద్దతుదారుల్ని కల్గిన స్టాలిన్ బర్త్‌డేను ప్రతి ఏటా యువజనోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం 63వ వసంతంలోకి స్టాలిన్ అడుగు పెట్టడం పార్టీ వర్గాలకు, ఆయన మద్దతుదారులు, అభిమానులకు పండుగే. అందరి నోట దళపతిగా పిలవడే స్టాలిన్ బర్త్‌డేను వాడ వాడల్లో డీఎంకే వర్గాలు ఘనంగా నిర్వహించాయి.
వాడవాడల్లో పార్టీ జెండాల్ని ఎగుర వేశారు. అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్ ప్రసంగాల్ని, డీఎంకే ప్రగతిని చాటే పాటలను హోరెత్తించారు. 63 కిలోల కేక్‌లను కట్ చేశారు. పేదలకు పలు చోట్ల 63 రకాల వస్తువులను అందజేశారు. స్వీట్లు, చాక్లెట్లు పంచి పెట్టారు. ఉదయాన్నే గోపాలపురం చేరుకున్న స్టాలిన్ తల్లిదండ్రుల ఆశీస్సుల్ని అందుకున్నారు. తండ్రి, పార్టీ అధినేత ఎం కరుణానిధి స్టాలిన్ అలింగనం చేసుకుంటూ ముద్దాడి మరీ అభినందించారు. తల్లి దయాళు అమ్మాల్ ఆశీస్సులు అందుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలసి స్టాలిన్ కేక్ కట్ చేశారు. ఆళ్వార్ పేటలోని ఇంట్లో సతీమణి దుర్గా, తనయుడు ఉదయ నిధి, కోడలు కృతికతో కలసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం వైఎంసీఏ మైదానంలో జరిగిన వేడుకల్లో స్టాలిన్ పాల్గొన్నారు.
మెరీనా తీరంలోని అన్నా సమాధిని, వెప్పేరిలోని పెరియార్ స్మారక మందిరాన్ని స్టాలిన్ సందర్శించారు. అక్కడ నివాళులర్పించినానంతరం వైఎంసీఏ మైదానంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన తన బర్త్‌డే వేడుకకు హాజరయ్యారు. యువజన విభాగం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడి వేదిక మీద 63 కిలోల కేక్‌ను కత్తిరించినానంతరం ప్రతి కార్యకర్త, నాయకుడి నుంచి శుభాకాంక్షల్ని స్టాలిన్ అందుకున్నారు. స్టాలిన్ స్వయంగా కలుసుకోవడంతో పెద్ద ఎత్తున్న రాష్ట్ర నలమూలల నుంచి డీఎంకే వర్గాలు తరలి వచ్చాయి. అన్ని మతాలకు చెందిన మత పెద్దలు స్టాలిన్‌ను ఆశీర్వదించారు.
పేదలకు సంక్షేమ పథకాల్ని పంపిణీ చేశారు.ఇదే వేదిక మీద తన సోదరుడికి ఎంపీ కనిమొళి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు అందజేశారు. అంటరానితనం నిర్మూలన : ఈ వేదికపై స్టాలిన్ ప్రసంగిస్తూ తన బర్త్‌డేను ఇక, యువజనదినోత్సవంతో పాటుగా అంటరానితనం నిర్మూలన దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అధినేత ఎం కరుణానిధి నేతృత్వంలో డీఎంకే బలం రోజు రోజుకు మళ్లీ పెరుగుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రతి కార్యకర్త సైనికుడి వలే మరింత శ్రమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్తే, అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
దళపతికి శుభాశీస్సులు
Published Mon, Mar 2 2015 1:48 AM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM
Advertisement
Advertisement