ఈగల గోల మేం భరించలేకపోతున్నాం అని 8 గ్రామాల ప్రజలు లబోదిబోమంటున్నారు. రాజమౌళి ఈగ సినిమా చూశాక చాలామందికి ఈగను తక్కువగా అంచనా వేయరాదనే ఒక భావన వచ్చి ఉంటుంది. కానీ ఈ గ్రామాల వాసులకు ఆ సినిమాలో చూపించిన కష్టాల కంటే ఎక్కువే చుట్టుముట్టాయి. ఈగలు 24 గంటలూ వెంటాడి వేధిస్తున్నాయి.
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం తాలూకాలోని హుస్కూరు చుట్టుపక్కల ఉన్న సుమారు 15 కోళ్లఫారాల కారణంగా ఉత్పత్తవుతున్న ఈగలు దండయాత్ర మాదిరిగా పరిసర గ్రామాలపైబడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో ఓపిక నశించిన హుస్కూరు సహా 8 గ్రామాల ప్రజలు సోమవారంనాడు ఆ కోళ్లఫారాల ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈగలనైనా అరికట్టండి, లేదా ఊరు వదిలి వెళ్లిపోండి అని కోళ్లఫారాల యజమానులకు స్పష్టంచేశారు.
మా కష్టాలు అన్నీఇన్నీ కావు
బాధితులు మాట్లాడుతూ ‘15 సంవత్సరాలుగా హుస్కూరు చుట్టుపక్కల పలు కోళ్లఫారాలు నడుస్తున్నాయి, అక్కడి చెత్త వల్ల ఉత్పత్తవుతున్న ఈగలు మా గ్రామాలపైబడి అనేక సమస్యలు సృష్టిస్తున్నాయి, ఇంట్లో, బయట, గోడల మీద, పాత్రలమీద, వాహనాలమీద ఈగలు ముసురుకుంటున్నాయి. ఇటీవలి వర్షాలకు మరింత ముదిరాయి. నడుస్తున్నా, కూర్చున్నా, నిద్రపోతున్నా ఈగలు ముసురుకుంటున్నాయి. కనీసం టాయ్‌లెట్‌లోనూ ప్రశాంతత కరువైంది. చేతులతో నిర్విరామంగా ఈగలను తోలుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. భోజనం చేయాలంటేనే బేజారెత్తిపోయింది. అన్నం పెట్టుకుని కంచం ముందు పెట్టుకుంటే చేతికన్నా ముందు ఈగలే అన్నం మీద వాలుతున్నాయి. దీంతో గ్రామంలో చాలామంది అంటురోగాల బారినపడ్డారు. మనుషుల పరిస్థితి ఇదయితే పశువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పశువులపై ఈగలు వాలి ఇబ్బందులు పెడుతున్నాయి. ఈగల పీడ వల్ల గత వారం రోజుల్లోనే పదికి పైగా పశువులు మృత్యువాతపడ్డాయి’ అని బాధితులు ఆవేదనను ఏకరువు పెట్టారు.
పట్టించుకోని నేతలు, అధికారులు
పశువుల కళ్ళల్లోకి, ముక్కుల్లోకి వేళ్లే ఈగలు ఒంటిమీద గాయాలు ఉంటే రక్తాన్ని పీల్చి చంపుతున్నాయన్నారు. ఈగల సమస్యపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. ఈగల బాధ ఇలాగే కొనసాగితే గ్రామాలు వదలి వెళ్లిపోవాల్సిందేనని వాపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఒక కోళ్లఫారం మేనేజర్ మాట్లాడుతూ ఈగల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment