అద్వితీయం
► ‘డాక్టర్ రాజ్‌కుమార్’ జయంతి వేడుకలు.....
► మహానటుడికి ఘనంగా నివాళులు అర్పించిన అభిమానులు
► సమాధిపై హెలికాఫ్టర్‌తో పూల వర్షం
సాక్షి, బెంగళూరు: మహానటుడు, కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు అత్యంత ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకొని ఆయన సమాధిని పుష్పాలతో అందంగా అలంకరించారు. శుక్రవారం ఉదయమే దివంగత రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్, కుమారులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ తదితరులు డాక్టర్ రాజ్‌కుమార్ సమాధి వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. నగర వ్యాప్తంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఆయన అభిమానులు ప్రారంభించారు. అంతేకాక నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనాధ ఆశ్రమాలు, వౄ్ధశ్రమాలు, ఆస్పత్రులలో పండ్లు, మిఠాయిలను రాజ్‌కుమార్ అభిమానులు పంచిపెట్టారు. ఇక రాజ్‌కుమార్ రక్తనిధికి వేలాది సంఖ్యలో అభిమానులు రక్తదానం చేశారు. రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మహానటుడికి నివాళులు అర్పించేందుకు గాను వేలాది సంఖ్యలో అభిమానులు రాజ్‌కుమార్ సమాధి వద్దకు చేరుకున్నారు.
ఒకానొక సందర్భంలో అభిమానులను అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా తయారైంది. బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజ్‌కుమార్ విగ్రహాలు సైతం పుష్ప అలంకారాలతో విరాజిల్లాయి. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంతో పాటు మైసూరు, రామనగర, తుమకూరు, కోలారు, మండ్య, శివమొగ్గ తదితర ప్రాంతాలన్నింటిలోనూ కర్ణాటక రక్షణా వేదిక, నవ నిర్మాణ సేన తదితర సంఘాల ఆధ్వర్యంలో రాజ్‌కుమార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హెలికాఫ్టర్‌తో పూల వర్షం....
ఇక డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మహానటుడికి నివాళులు అర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు రాజ్‌కుమార్ సమాధి వద్దకు చేరుకోగానే వారిపై అభిమానులు పుష్ప వర్షాన్ని కురిపించారు. రాజ్‌కుమార్ జయంతిని విభిన్నంగా ఆచరించేందుకు గాను హెలికాఫ్టర్‌తో రాజ్‌కుమార్ సమాధి పై పూలవర్షాన్ని కురిపించినట్లు కన్నడ కదంబ యువకర సంఘ వెల్లడించింది. 50 అడుగుల ఎత్తులో వెళుతున్న హెలికాఫ్టర్ నుంచి పూల వర్షాన్ని కురిపించడంతో రాజ్‌కుమార్ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులతో పాటు అక్కడికి చేరుకున్న అభిమానులు సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.