క్లీన్ స్వీప్ లక్ష్యం
అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం సాగింది. ఆ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ముందుకు సాగేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ప్రజలతో ప్రతి నాయకుడు, కార్యకర్త ఇప్పటి నుంచి మమేకం కావాలని అధినేత్రి జయలలిత పిలుపునిచ్చారు.
సాక్షి, చెన్నై:మూడోసారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత సుపరిపాలన లక్ష్యంగా జయలలిత అడుగులు వేస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలను ఆకర్షించే విధంగా పథకాల్ని ప్రవేశ పెడుతున్నారు. అమ్మ క్యాంటీన్ల మొదలు, మెడికల్ షాపుల వరకు పేద, మధ్య తరగతి వర్గాల కోసం ప్రవేశ పెట్టినవే. ఇలాంటి పథకాలను మరిన్ని వేగవంతం చేయడానికి ముందుకు సాగుతున్న జయలలిత సర్కారు అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యింది. నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన జయలలిత సర్కారు, మరో ఏడాదిన్నరలో మళ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. డీఎంకేకు ఎదురవుతున్న వరుస పతనాలను తమకు అనుకూలంగా మలచుకుని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కార్యాచరణను ఆ పార్టీ అధినేత్రి జయలలిత సిద్ధం చేశారు.
కార్యాచరణ: లోక్ సభ ఎన్నికల్లో 37 అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకోవడం, డీఎంకే డిపాజిట్లను గల్లంతు చేయడం చూస్తే అన్నాడీఎంకేకు అనుకూల పరిస్థితులున్నట్లు తెలుస్తోంది. దీన్ని అలాగే, పదిలం చేసుకోవడం లక్ష్యంగా జయలలిత తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన కీలక అంశాలపై గురువారం నాటి పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చర్చించారు. పార్టీ పరంగా కీలక మార్పులతోపాటుగా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా, ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజలతో మమేకం అయ్యే విధంగా సూచనలు ఇచ్చి ఉన్నారు. ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్టు, ఇవన్నీ సక్రమంగా ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని వివరించి ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే శ్రమించాలని, అప్పుడే రాష్ట్రంలోని 234 స్థానాలను క్లీన్ స్వీప్ చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. డీఎంకే మీద ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుండడం, ప్రధాన ప్రతిపక్షం డీఎండీకే చతికిలబడి ఉన్న దృష్ట్యా, ఈ రెండు పార్టీలకు చరమ గీతం పాడేందుకు ప్రజలను సిద్ధం చేస్తూ, క్లీన్ స్వీప్ నినాదంతో ఇక ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు సాగే రీతిలో ఉపదేశాల్ని జయలలిత ఇచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ అనుబంధ విభాగాల నేతృత్వాల్లో ప్రజాకర్షణ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి సైతం నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ కోసం శ్రమిస్తున్న వారందరికీ పదవులను కట్టబెట్టే విధంగా నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు నిర్ణయించినట్టు ఆ పార్టీలో ప్రచారం సాగుతుండడం గమనార్హం.