
కొల్హాపూర్ వేదికగా ‘మహా’ కూటమి ఎన్నికల భేరి
ర్యాలీలో పాల్గొన్న బీజేపీ, శివసేన,
ఆర్‌పీఐ, ఆర్‌ఎస్‌పీ, స్వాభిమాన్
షెత్కారీ సంఘటన నాయకులు
డీఎఫ్‌ను గద్దె దించాలని పిలుపు
కొల్హాపూర్: శివసేన, బీజేపీ, ఆర్‌పీఐ, స్వాభిమాన్ షెత్కారీ సంఘటన, రాష్ట్రీయ సమాజ్ పార్టీ(ఆర్‌ఎస్‌పీ)లతో కూడిన మహా కూటమి కొల్హాపూర్ వేదికగా లోక్‌సభ ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. ఈ కూటమి గురువారం నిర్వహించిన భారీ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే మాట్లాడుతూ...ఈసారి మన ఓట్లను వృథా చేయకుండా, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. విదేశీ పెట్టుబడుదారులతో సీఎం ఓ వైపు చర్చలు జరుపుతుండగా, రాష్ట్రంలోని ఉన్న పరిశ్రమలు మరో చోటికి తరలిపోతున్నాయన్నారు. ప్రస్తుతం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే నేతృత్వం వహిస్తున్న బారామతి లోక్‌సభ నియోజవర్గాన్ని త్వరలో జరిగే ఎన్నికల్లో మహాకూటమి గెలుచుకుంటుందన్నారు.
బలహీన ప్రధాని ఉండటంలో కేంద్రంలో పాలన సప్పగా సాగుతోం దని విమర్శించారు. రాందాస్ అథవలే మాట్లాడుతూ రాష్ట్రంలో కాషాయకూటమిని ఎగురవేసేందుకు పోరాటం చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీడ్ నుంచి తనకు వ్యతిరేకంగా అజిత్ పవార్‌ను బరిలోకి దింపవచ్చని ఎన్సీపీకి బీజేపీ సీనియర్ నాయకులు గోపీనాథ్ ముండే సవాల్ విసిరారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకుడు వినోద్ తావ్డే, స్వాభిమాన్ షెత్కారీ సంఘటన ఎంపీ రాజుశెట్టి, ఆర్‌ఎస్‌పీ మహాదేవ్ జంకర్‌లు పాల్గొన్నారు.