► రూ.1,500 కోట్ల విలువైన రూ.500 నోట్లు వచ్చేశాయి
► 25వ తేదీ నుండి పంపిణీ?
► కొనసాగుతున్న కరెన్సీ పాట్లు
నల్లధనం వెలికితీసేందుకు పెద్ద నోట్లను అకస్మాత్తుగా రద్దు చేయడం ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్న చందంగా తయారైంది. నల్లకుబేరుల మాటెలా ఉన్నా పేద, మధ్య తరగతి కుటుంబాలవారు కొత్త కరెన్సీని మార్చుకోలేక కుదేలైపోతున్నారు. చిల్లర చిక్కులకు స్వస్తి పలికే విధంగా రూ.1,500 కోట్ల విలువైన రూ.500 నోట్లు చెన్నైకి వచ్చినట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ నెల 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం 10వ తేదీ నుంచి కొత్త నోట్ల జారీని ప్రారంభించింది. తొలిదినాల్లో బ్యాంకులకు వచ్చిన వారందరూ రూ.4 వేలు వరకు కరెన్సీ మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. బ్యాంకుల్లో జనం రద్దీని నివారించేందుకు క్రమేణా అనేక సంస్కరణలు చేయడం ప్రారంభించారుు. కరెన్సీ పరిమితిని రూ.4,500గా పెంచింది. ఆ తరువాత కరెన్సీ అయిపోయిందంటూ మార్పిడి లేదు కేవలం డిపాజిట్లు మాత్రమేనని ప్రకటించింది. ఆ తరువాత వేలిపై ఇంకు గుర్తు పెట్టి రెండోసారి రాకుండా కట్టడి చేసింది. డబ్బు డ్రా చేసేవారు, చిల్లర నోట్లు కావాల్సిన వారు ఏటీఎంలకు వెళ్లమని సలహాలిచ్చింది. అరుుతే ఏటీఎంల వద్ద చాం తాడంత క్యూలు, అనేక ఏటీఎంలు పనిచేయక పోవడం ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారుు. తాజాగా ఖాతాలున్నవారు మాత్ర మే క్యూలో రండి అంటూ మిగిలిన వారిని పంపేస్తోంది. మరి బ్యాంకుల్లో ఖాతాలు లేని వారు తమ పాత నోట్లను కొత్త నోట్లుగా ఎలా మార్చుకోవాలో మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు.
పాత కరెన్సీ మార్పిడిపై రూపొందించిన నిబంధనల్లో తరచూ మార్పులు చోటుచేసుకోవడంతో జనం తమవైపు రాకూడదనేలా బ్యాంకుల వారు ఆశించిన ఫలితాలను ఇచ్చింది. బ్యాంకు ఖాతాల్లో లక్షలాది రూపాయలు ఉన్నా కేవలం రూ.24 వేలు మాత్రమే డ్రా చేసుకోవచ్చని షరతు విధించింది. అరుుతే కొత్త కరెన్సీ, పాత కరెన్సీ రెండూ స్టాకు లేకపోవడంతో రూ.24వేలు కూడా దక్కడం లేదు. కొన్ని చోట్ల సీనియర్ సిటిజన్లకు మాత్రమే కొత్త కరెన్సీ ఇచ్చి పంపుతున్నారు. తాజాగా కరెన్సీ మార్పిడి అవకాశం ఖాతాలున్నవారికే బ్యాంకులు పరిమితం చేయడం ప్రజలను మరోసారి కరెన్సీ కష్టాల్లోకి నెట్టివేసింది. ఖాతాదారులు మాత్రమే డబ్బు డ్రాచేసుకునే నిబంధన వల్ల కొందరు మహిళలు తమ చిన్న పిల్లలను, చివరకు పొత్తిళ్లలోని పసిబిడ్డలను తీసుకుని బాలింతలు క్యూలో నిలబడుతున్నారు. కరెన్సీ కొరత తీవ్రరూపం దాల్చడంతో ప్రజల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నారుు. పాత నోట్లను తీసుకోనందున రేషన్ దుకాణాల్లో సరుకులు పొందలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
రేషన్‌షాపు డీలర్లకు, ప్రజలకు మద్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పోలీస్ బందోబస్తు అవసరం అవుతోంది. ఇదిలా ఉండగా రూ.1,500 కోట్ల విలువైన రూ.500 నోట్లు ఒక ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి చెన్నైకి చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అరుుతే దీనిపై సోమవారం రాత్రి వరకు ఎటువంటి అధికారిక సమాచారం వెలువడ లేదు. రూ.500 నోట్ల కరెన్సీని త్వరలో ప్రజా పంపిణీకి ప్రవేశపెడుతారని చెబుతున్నారు. గతంలో పొందిన సమాచారం ప్రకారం 25వ తేదీ నుంచి రూ.500 నోట్లు వినియోగంలోకి రావచ్చు.
పెట్రో బంకుల్లోనూ రూ.2000 నోట్లు
బ్యాంకుల వద్ద రద్దీని తగ్గించుకునేందుకు పెట్రో బంకుల్లో మార్పిడి వసతి ఆదివారం ప్రారంభమైంది. రాష్ట్రం మొత్తం మీద 59 పెట్రోలు బంకుల ద్వారా కొత్త కరెన్సీ పొందే సదుపాయాన్ని కల్పించారు. అరుుతే పెట్రోలు బంకుల వారు సైతం కేవలం రూ.2000 నోట్లు మాత్రమే ఇవ్వడంతో చిల్లర సమస్య తీవ్రరూపం దాల్చింది. అంతేగాక పాత రూ.500, రూ.1000 నోట్లను అనుమతించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పెట్రోలు బంకులు ఖాతరు చేయడం లేదు.
తమిళనాడు పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మాట్లాడుతూ, ఒక రోజుకు ఒక ఏజెన్సీ తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వెళ్లి రూ.1లక్షలు పొంది 50 మందికి తలా రూ.2000 ఇస్తున్నామని తెలిపారు. అరుుతే కొత్త నోటు వద్దు చిల్లర కావాలని ప్రజలు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. రూ.100, 50, 20, 10 నోట్లు ఇస్తేనే ఉపయోగమని అన్నారు. నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం అనేక ఆందోళనా కార్యక్రమాలు జరిగారుు. కాంగ్రెస్ నేతలు చెన్నైలో పలుచోట్ల రాస్తారోకో నిర్వహించారు.
చిల్లర చిక్కులకు స్వస్తి
Published Tue, Nov 22 2016 3:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
Advertisement
Advertisement