ముగిసిన సినిమా శత వసంతాల వేడుకలు
భారతీయ సినిమా శత వసంతాల వేడుకలు మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. వివిధ భాషలకు చెందిన చిత్ర ప్రముఖులను రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీ ఘనంగా సత్కరించారు. వారి సేవలను కొనియాడారు. భావితరాలకు మన సినిమాల ఘనత గుర్తుండాలంటే 1940 -1970 నాటి చిత్రరాజాలు మళ్లీ రావాలని ఆయన ఆకాంక్షించారు.
అన్నానగర్, న్యూస్‌లైన్: భారతీయ సినిమా శత వసంతాల వేడుకలను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ నెల 21న ప్రారంభించారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదిక గా తొలిరోజు తమిళసినీ వేడుకలను నిర్వహించారు. ఈ నెల 22న కన్నడం, తెలుగు, ఈ నెల 23న మలయాళ చిత్ర పరిశ్రమ వేడుకలు జరిగాయి. ముగింపు ఉత్సవాలను మం గళవారం సాయంత్రం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. సినీ రంగానికి విశిష్ట సేవలు అందించిన పలువురిని సత్కరించారు. అనంతరం రాష్ర్టపతి ప్రసంగించారు. సంఘటనలకు దృశ్య రూపమే సిని మా అన్నారు. ఫాల్కే తన తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర ద్వారా మనకు ఇదే చెప్పారని గుర్తు చేశారు.
వందేళ్ల కాలవ్యవధిలో భారత చలనచిత్ర రంగం పలు మలుపులు తిరిగిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల భారతీయ సినిమా బాగా వృద్ధి చెందిందన్నారు. దేశంలోనే అత్యంత భారీ పరిశ్రమగా చెలామణి అవుతోందని వెల్లడించారు. అతి పెద్ద సంఖ్యలో పని చేసే వ్యక్తులున్న పరిశ్రమ ఇదేనన్నారు. భారత చిత్రాలకు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో స్థానం, పురస్కారాలు దక్కుతున్నాయని పేర్కొన్నారు. భారత చలనచిత్ర చరిత్రలో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ ప్రముఖపాత్ర పోషించిందని ప్రశంసిం చారు. సినిమా రంగానికి జాతీయ అవార్డులు అనేవి టానిక్ వంటివన్నారు.
భావితరాలకు మన సినిమాలు ఘనత గుర్తుండాలంటే 1940 -1970 నాటి చిత్ర రాజాలు మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ రంగం కృషి చేయాలని సూచించారు. సినిమా సాంఘిక బాధ్యత కలి గిన బలమైన సాధనమన్నారు. దీన్ని సమాజ ఉద్ధరణ కోసం ఆయుధంగా ఉపయోగించేందుకు సినిమా రంగం కృషి చేయాలని సూచించారు. ప్రసంగాల నడుమ గవర్నర్ రోశయ్య శత వసంతాల భారతీయ చలన చిత్ర విశేషాలను తెలిపే సావనీర్‌ను ఆవిష్కరించారు. తొలిప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు.
మన సంస్కృతిలో భాగం సినిమా: గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయన్నారు. అందరూ మెచ్చే సినిమాలు తీయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 1940 -1960 మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాల పేర్లను ఆయన ఉదహరించారు. సినిమా మన సంస్కృతిలో ఒక విడదీయరాని భాగమన్నారు. సినిమా రంగం ఎందరో రాజకీయ నాయకులను తయారు చేసిం దని చెబుతూ ముఖ్యమంత్రి జయలలిత వంక చూశారు. దానికి ఆమె చిరునవ్వు నవ్వారు. తమిళ సినీ రంగం ఎందరో ఇతర భాషా వ్యక్తులను అక్కున చేర్చుకుని వారిని గొప్ప హీరోహీరోయిన్లుగా తీర్చిదిద్దిందన్నారు. కళ, వ్యాపార కౌశలాల సమ్మేళనమే సినిమా అన్నారు.
మరపురాని పండుగ: భారతీయ సినిమా శత వసంతాల వేడుకలు జరుపుకుంటుండడం మరపురాని విషయమని జయలలిత పేర్కొన్నారు. భారత సినీ రంగం ముఖ్యంగా దక్షిణాది సినీ రంగం బహుముఖ వృద్ధిలో సాగుతోందన్నారు. సినిమా రంగం దేశ ఆర్థిక ప్రగతికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందన్నారు. లూమియర్ సోదరులు సినిమాకు ఆద్యులని, ఈ రంగం భవిష్యత్తులో ఇంత ఎత్తుకు ఎదుగుతుందని వారు ఊహించి ఉండరన్నారు. దేశ సమకాలీన సమస్యలకు - ప్రగతికి సినిమా నిలువుట ద్దమన్నారు. ఎంజీఆర్ రాకలో తమిళ సినీ రంగం గొప్ప మలుపు తిరిగిందన్నారు.
పేక్షకులు లేనిదే సినీ రంగం లేదన్నారు. ప్రేక్షకులే నిజమైన హీరోలన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని చిన్మయి ఆలపించిన తమిళతాయి ప్రార్థనా గీతం అలరించింది. వేదికను అలంకరించిన ప్రముఖులను దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ సత్కరించారు. కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చాండి, కర్ణాటక సమాచారశాఖ మంత్రి సంతోష్ తమ ప్రాంతీయ భాషా చిత్రాల ప్రాముఖ్యతను వివరిం చారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షడు విజయ్ కెంకా పాల్గొన్నారు.
ప్రసంగాల్లో మెరుపులు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్యమంత్రి జయ నటిగా ఉన్నప్పుడు చేసిన అభినయాన్ని ప్రశంసించారు. నటిగా జయ ముద్ర చెరగనిదన్నారు.
రోశయ్య తనదైన చమత్కారంతో తమిళ చిత్రరంగం పలువురు రాజకీయ నాయకులను తయారు చేస్తోందన్నారు.