కొట్టి... ఇంటి నుంచి గెంటేసి
ఉత్తమ నడవడికతో సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో కొద్దిరోజులుగా తెలుస్తూనే ఉంది. తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే భార్యను ఇంటి నుంచి బయటకు గెంటేసిన వైనం కర్ణాటక రాజధానిలోనే చోటుచేసుకుంది.
బెంగళూరు: బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం.పి.కుమారస్వామి, ఆయన భార్య సవిత కుటుంబ కలహాలతో మరోసారి రోడ్డెక్కారు. చిక్కమగళూరు జిల్లాలోని మూడిగేరె నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ఎంపి.కుమార స్వామి కుటుంబం ఇక్కడి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ మొదటి సెక్టార్‌లో నివాసముంటోంది. ఆయనకు మరో మహిళకు అక్రమ సంబంధం ఉందని, దీనిని ప్రశ్నించడంతో ఆదివారం రాత్రి ఇంటి నుంచి గెంటి వేసి ఇంటికి తాళం వేసుకొని వెళ్లాడని భార్య సవిత ఆరోపించారు. న్యాయం జరగాలని కోరుతు ఎం.పి.కుమారస్వామి ఇంటి వద్ద నిరహార దీక్ష చేపట్టారు.
సవిత సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ నవంబర్ 14 తేదీ వరకు తనను బాగానే చూసుకున్నాడని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అడగటంతో అప్పటి నుంచి తనను ఇంట్లో తీవ్రంగా కొట్టడం వేధించడం మొదలుపెట్టాడని వాపోయారు. చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని మీడియా ముందు తెలిపారు. ఎలాగైనా తన నుంచి విడాకులు తీసుకుని ఆ మహిళతో కాపురం పెట్టాలని చూస్తున్నాడని, తాను భర్తను వదిలి ఉండనని చెప్పారు.
తాను పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్ళనని, తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందే నిరహార దీక్ష చేస్తానని అన్నారు. కాగా గొడవ జరిగిన వెంటనే కుమరస్వామి అక్కడ నుంచి వెళ్లిపోగా, సవిత కూడా ఆదివారం రాత్రి అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. నిన్న ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి... తాళం వేసి ఉండటంతో ఆమె అక్కడే బైఠాయించారు.
మరోవైపు సవిత ఆరోపణలను కుమాస్వామి ఖండించారు. మరో మహిళతో అక్రమ సంబంధం అంటూ నిరాధార ఆరోపణలు చేస్తోందని, అవన్నీ అవాస్తవమని ఆయన తెలిపారు. తన ఆస్తి కోసమే సవిత ఇదంతా చేస్తోందని, తాను కూడా ఆమెతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
అప్పట్లో అసెంబ్లీ వద్దే గొడవ
2008లో కుమారస్వామితో సవితకు వివాహమైంది. సంసారం సజావుగానే సాగినా, ఈ ఏడాది జనవరి నెల 23 తేదీన తన భర్త కుమారస్వామి మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య సవిత విధానసౌధ వద్దనున్న ఎమ్మెల్యే భవనం వద్దకు వచ్చి పెద్ద గొడవ చేయడంతో వివాదం రచ్చకెక్కింది. అప్పట్లో ఈ విషయం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్ళింది.
ఇక పైన ఎటువంటి తప్పు చేయనని, తన భార్యతో మంచిగానే ఉంటానని కుమారస్వామి ప్రమాణ పత్రం రాసిచ్చారు. కాని ఇటీవల వేరొక మహిళతో మళ్లీ తిరుగుతున్నావని భర్తను నిలదీశారు. తానీష్టం వచ్చినట్లు ఉంటానని, ఇష్టం ఉంటే ఉండు, లేదంటే విడాకులిచ్చి వెళ్ళి పొమ్మని వేధిస్తున్నాడని ఆమె తెలిపారు. గతంలో తాను గొడవ చేసినప్పుడు పత్రికల్లో వచ్చిన వార్త చిత్రాలను చూపారు.